నాగళ్ళు దున్నిన పొలాలనిండా తలలూపె వరిచేన్లు
బట్టకట్టిన బతుకుల పాడిపంటల నింపే గుమ్ముల ధాన్యాలు
వాకిళ్ళ ఇల్లిల్లు సుఖశాంతి నవ్వులు పూసిన ఊరు
వ్యవసాయమే ఆధారమైన మట్టిలో వృత్తుల సిరి నగలు
చదువుల వెలుగుల సంక్రాంతి హేల అక్షరాల పూల
అరికంఠాల చుట్టి ఊరు చలిమంటల కాగే వరిగడ్డి పొల్లుపొరక
గొబ్బెమ్మల వాకిళ్లు రమణీయ ముగ్గుల జాబిల్లి
కొత్తబట్టల అందాల పొంగులు చక్కెర పొంగలి రుచులు
గంతుల కాంతులు గగన వీధుల రువ్వు చిరునవ్వుల
పగల సెగలన్నీ పొలిమేరల దాటించు పండుగల కళలు
కలల తేలిన కరుణ పంచిన నేల చల్లని చూపుల భాష
మౌనంలో శబ్దించు సంగీత ఝరిని ఉయ్యాలూగే పూలు
అప్పుచేయని తలలు ధైర్యమై సాగే జొన్న కర్రల చేబూని
బూరెలు గారెలు పాయసం ఆకలి పండుగ కడుపు నింపే
కదం తొక్కిన పదం పాటల దుమ్ము ధూళీ ఊరంతా
మనసెరిగిన మట్టి మాట ఉప్పస ఊరటగ తలపోత
పైరు పచ్చల సింగారి చీర ఊరుగాలి వేసే వయ్యారి ఈల
మనిషికీ మనిషికి తెగని బంధం జోల ఈలల కథ
మట్టి మనసుల తీపిరాగం విరుగని కొమ్మల సుందర కావ్యం
ఆకాశంలో సగం అవని సాంతం చలినెగళ్ళ ఊరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి