మాటలుండాలి:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
మనుషులుంటే చాలా
మూతులు ఉండాలి
మాటలు ఉండాలి

మాటలుంటే సరిపోతుందా
మంచిగా ఉండాలి
ముద్దుగా ఉండాలి

నచ్చితే మెప్పేనా
తియ్యగా ఉండాలి
చెవులకు విందునివ్వాలి

వీనులకందితే చాలునా
శ్రావ్యంగా ఉండాలి
మదికి చేరేలాయుండాలి

మతినితట్టితే  సరియేనా
ఙ్ఞాపకాల్లోకి వెళ్ళాలి
జీవితాంతం తలచేలాయుండాలి

మాటలు 
నవ్వులు తెప్పించాలి
పువ్వులు తలపించాలి

మాటలు 
గొంతులకు చెరకురసమందించాలి   
నాలుకలను తేనెచప్పరింపజేయాలి

మాటలు 
మురిపించేలా ఉండాలి
మయిమరిపించేలా ఉండాలి

మాటలు
కాంతులు వెదజల్లాలి
కళ్ళను కళకళలాడించాలి

మాటలు
రంగులు చూపించాలి
సౌరభాలు వెదజల్లాలి


కామెంట్‌లు