నవ్వుతూ బ్రతకాలిరా -- 18::-సి.హెచ్.ప్రతాప్
 (1) నిన్న సాయంత్రం బాబి గాడు నన్ను చెప్పుతో కొడతానంటే ఫ్రెండ్ వయ్యుండి ఊరుకున్నావెందుకురా ?” కోపంగా అడిగాడు మనోహర్
“ వాడు అప్పుడు మరీ పాత చెప్పులు వేసుకున్నాడు అందుకని రియాక్ట్ అవడమెందుకని వూరుకున్నాను. ఈసారి మంచి చెప్పులు వేసుకొని వచ్చినప్పుడు నిన్నేమైనా అంటే చీరేస్తాను” పల్లీలు తింటూ తాపీగా అన్నాడు అన్నారావు.
(2)ప్రేమ విఫలమైనందువలన  ఆత్మ హత్య చేసుకోవాలనుకున్న ప్రేమికుల మధ్య సంభాషణ :
“ముందు నేను బిల్డింగ్ నుండి దూకాలా ?ఎందుకు” అడిగింది రాజి.
“ ఏం లేదు. నేను దూకేసాక నువ్వు మనసు మార్చుకుంటే కష్టం కదా! అందుకని. పైగా మా నాన్న ఇంత కంటే మంచి సంబంధాలను తెస్తానన్నాడు” గబుకున్న అనేసి నాలిక కరుచుకున్నాడు కిషోర్.
(3)“ ఈ రోజు రాత్రి ఏడున్నరకు పార్కు ఏరియాలో లైట్లు ఆర్పేయాలా , ఎందుకు” ఆశ్చర్యంగా అడిగాడు లైన్ మెన్.
“ఆ టైంలో నేను, నా గర్ల్ ఫ్రెండ్ పార్కుకు వెళ్ళబోతున్నాం. మా ఆవిడ ఆ టైముకు అదే ఏరియాకు వస్తుంది. దొరికితే చంపేస్తుంది, కాస్త కోపరేట్ చెయ్యవయ్యా బాబు” అంటూ ప్రాధేయపడ్డాడు మూర్తి.
(4)" ఈ మధ్య అడుక్కోవటానికి రావడం లేదు ఎందుకు ?" అడిగింది అనసూయ
" అయ్యగారికి ఒంట్లో బావులేక మీరు వంట చేసేవారని తెల్సింది.తెలిసి,తెలిసి అనారోగ్యం కొని తెచ్చుకోవడం ఎందుకని రావడం మానెసాను !" తాపీగా చెప్పాడు బిచ్చగాడు. 

కామెంట్‌లు