సునంద భాషితం:- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయములు-758
"క్షీర విహాయా రోచక గ్రస్తః సౌవీర రుచి మనుభవతి" న్యాయము
*****
క్షీర అనగా పాలు పోసి విహాయా అనగా కోరికలు లేని వ్యక్తి, దూరంలో కంటే ఎక్కువ, అసలైన, మినహా,వదిలివేయడం.రోచక అనగా కూడా రుచికరము,ఆకలి పుట్టించునది,ఆకలి,ఆకలిని పెంచు ఔషధం.గ్రస్తః అనగా తినబడినది,మ్రింగబడినది ,పట్టుకొనబడినది.సౌవీర అనగా ఆయుర్వేద శాస్త్రంలో ఆహారం మరియు వంట కళ ( గృహ వంట).రుచి అనగా నాలుక ద్వారా తెలుసుకునే ఆహార పదార్థముల గుణము.అనుభవతి అనగా అనుభవము అని అర్థము.
నోరు చవి/ రుచి చెడిపోయిన రోగి పాలు త్రాగడం ఇష్టం లేక మానేసి పుల్ల రేగుపండ్ల రుచిని మాత్రమనుభవించును. అనగా "సుఖాభివైయక్తియే ముక్తి" అను పక్షమును త్యజించి "దుఃఖ నివృత్తియే ముక్తి"అని స్వీకరించుట పై "క్షీర విహాయా రోచక గ్రస్తః సౌవీరరుచి మనుభవతి" అను న్యాయమును పోలి వుంది అంటారు.
 ఈ న్యాయమును నిశితంగా పరిశీలించి చూస్తే రెండు రకాలైన కోణాలు కనబడతాయి.
అనారోగ్యంతో బాధపడుతున్న రోగుల నాలుక రుచిని కోల్పోయి ఏది తిన్నా చేదుగానే అనిపిస్తుంది. పాలు తాగమంటే పెద్ద గండంలా వుండేది.అందుకే నోటి చేదు పోవాలని గతంలో మన పెద్దలు టమాటాలతో చేసిన పచ్చడి,కూర, చింతపండుతో చేసిన రసంతో పథ్యం పెట్టేవారు.పుల్ల పుల్లగా తినడంతో నాలుకపై చేదు విరిగి నోటికి హితవుగా అనిపించేది.
అంటే రోగి మనసు పుల్లటి రేగు పండ్ల రుచిని కావాలని కోరుకునేది.వైద్యుడు కూడా దీనికి సరే అంటే అది "సుఖాభివైయక్తియే ముక్తి"గా మారుతుంది.అప్పుడు రోగికి వైద్యుడి  సలహా ద్వారా తీసుకునే  భోజనం వల్ల ఎలాంటి సమస్యా ఉండేది కాదు. సుఖారోగ్యానికి దారి తీసేది.
అయితే రెండో అర్థంలో పైన చెప్పిన  "సుఖాభివై యక్తియే  ముక్తి" ని మరచిన రోగి మనసు "దుఃఖ నివృత్తియే ముక్తి" వైపు మర్లుట; అనగా"క్షీర విహాయా రోచక గ్రస్తః" అనగా రోగి పాలు త్రాగడం మానేసి ముందుగా బాధను, దుఃఖాన్ని తొలగించుకోవాలనే ఆలోచనతో  వైద్యుని ప్రమేయం లేకుండానే తనకు ఇష్టమైన పుల్ల రేగు పండ్ల రుచిని కావాలని కోరుకోవడం అన్నమాట.
 ఇవన్నీ ఆరోగ్యం కోసం చెప్పిన మాటలుగా  పైకి అనిపించినా ఇందులో ఇమిడి ఉన్న అంతరార్థం మానవ నైజాన్ని కాగడా పట్టి  చూపడం.
 మొదటి దానిలో మనిషిలో భయము   వుంది.ముఖ్యంగా ఇంద్రియ నిగ్రహం వుంది.తాత్కాలిక వ్యామోహాల వైపుకు వెళ్ళకుండా సంపూర్ణంగా  వ్యక్తిత్వంతో సమాజంలో వెలిగేందుకు ప్రయత్నించడం వుంది.
 ఇక రెండో విషయానికి వస్తే తాత్కాలిక ఉపశమనం కోసం ఏ ధర్మాలు పాటించకుండా , కాలాన్ని గడిపే వ్యక్తి. ఇతడికి ధర్మాలు, న్యాయములు పట్ల అభిమానం కంటే తన స్వంత ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవడం, ఇంద్రియాల అదుపులో తాను ఉండటం సంభవిస్తుంది.
 ఈ "క్షీర విహాయా రోచక గ్రస్తః సౌవీర రుచి  మనుభవతి న్యాయము" లోని రెండు  కోణాల్లో  ఏది ముఖ్యమో మనకు తెలిసిపోయింది. ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని  హితకరమైన మాటలు వింటూ జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి.అది మొదటిదైన "సుఖాభివై యక్తియే ముక్తిని ఆశ్రయించడం. అదండీ! విషయం. మరి మనం మన ఆరోగ్యం కోసం మంచి దారి ఎంచుకుందాం.

కామెంట్‌లు