సునంద భాషితం:-వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయములు-757
క్షతే మక్షికా పాత న్యాయము
****
క్షతే అనగా గాయపడిన.మక్షికా అనగా ఈగ.పాత అనగా పడుట అని అర్థము.
పుండు మీద ఈగ వాలినట్లు.అలా వాలిన ఈగ  అంతటితో ఆగకుండా పుండును తొలిచి పెద్దదిగా చేస్తుంది.ఎంత తోలినా పోకుండా వేధిస్తుంది అని అర్థము.
 ఈగను  మూర్ఖుడు లేదా ఆయోగ్యుడితో పోల్చారు. మూర్ఖుడు లేదా అయోగ్యుడు మూర్ఖమైన పనులనే చేస్తాడు.మంచి పనులు చేయడు. పుండు అంటేనే చీము నెత్తురుతో  చూడటానికి అసహ్యంగా ఉండి బాధ కలిగిస్తుంది.అలాంటి పుండుపై ఈగ వాలినట్లే అయోగ్యుడు వినడానికి కూడా మంచిగా అనిపించని పనులు చేస్తాడు అనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
అందుకే భాస్కర శతక కర్త ఇలాంటి వ్యక్తుల గురించి ఓ పద్యం కూడా రాశారు. అదేంటో చూద్దాం.
" ఏడ ననర్హుడు నటకేగు ననర్హుడు నర్హుడున్నచో/జూడగ నొల్ల డెట్లన సశుద్ధ గుణస్థితి నీగ పూయముం/గూడిన పుంటిపై నిలువ గోరిన యట్టులు నిల్వ నేర్చునే/సూడిద పెట్టు నెన్నుదుటి చొక్క గస్తురి మీద భాస్కరా!"
అనగా అయోగ్యుడు వేరొక అయోగ్యుని కడకే పోతాడు.అదెలా అంటే ఈగ కురుపు మీదకు చేరినట్టే చేరును.యోగ్యుని కడకు పోడు  నుదుటిపైన కస్తూరి మీద ఈగ అసలు వాలదు అని అర్థము.
 పుండు అనేది ఇక్కడ అయోగ్యతకు చిహ్నంగా చెప్పడం జరిగింది. అలాగే ఈగను కూడా అయోగ్యుడిగా చెప్పారు.అయోగ్యుడు చేసేవే అర్హత లేని,పనికి రాని, బాధించే పనులే. కస్తూరి గంధం మీద వాలకుండా పుండు మీద వాలినప్పుడే ఈగ ఎంత అయోగ్యమైనదో అర్థం చేసుకోవచ్చు.
 ఇవన్నీ చూసి మన పెద్దవాళ్ళు  రకరకాలుగా  పోల్చి వివిధ రకాల సామెతలు ,జాతీయాలు చెబుతుంటారు అందులో ఒకటి చూద్దాం..
 "రాళ్ళన్నీ ఒక చోట - రత్నాలన్నీ ఒక చోట చేరుతాయి" అన్నట్లు  మూర్ఖులకు విషయానికి సరిగ్గా సరిపోతుంది.
 మనం  గాయాలు, పుండ్లు  అయినప్పుడు చూస్తూ ఉంటాం.పుండు మీద వాలిన ఈగ అంతటితో ఊరుకోదు. ఆ పుండును తొలిచి పెద్దదిగా చేస్తుంది.అంటే "మూర్ఖులు అయోగ్యులు ఒక చోట కలిస్తే ఒరిగేదేమీ ఉండదు.కలిగేది నష్టమే తప్ప" అనే అర్థం ఇందులో ఇమిడి వుంది.
ఈ మూర్ఖులు మరియు అయోగ్యులకు చాలానే దుర్లక్షణాలు ఉంటాయి. "వారు చెబితే వినరు -వంట పుట్టదు" అన్నట్లు ఉంటారు.చెడు వైపే మొగ్గు చూపుతారు.అలాంటి వారి వల్ల  కష్టం, నష్టం రెండూ కలుగుతాయి. ఈగ  పుండునే మెచ్చుతుంది. దాని గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు.
 అందుకే మన పెద్దలు అన్న మరోమాట కూడా గణనలోకి తీసుకోవాలి గొడ్లతో- బడ్లతో స్నేహం చేయొద్దు ". అంటుంటారు‌. ఒకోసారి అలాంటి మూర్ఖులతో కలిసి ఏదైనా పని చేయాలంటే భయమే. ఏం తప్పులు దొర్లుతాయో తెలియదు.
 మరి ఈ " క్షతే మక్షికా పాత న్యాయము"ను గమనంలో పెట్టుకొని  అలాంటి వారికి దూరంగా ఉందాం.నాతో ఏకీభవిస్తారు కదూ!.

కామెంట్‌లు