న్యాయాలు-753
హంస క్షీర న్యాయము
******
హంస అనగా అంచ, సూర్యుడు ,జీవుడు, విష్ణువు, యోగి, పరమాత్మ అనే అర్థాలు ఉన్నాయి.క్షీర అనగా పాలు.
హంస క్షీర న్యాయము అనగా "హంస పాలను, నీటిని విడదీస్తుంది,విడదీయగలదు "అని అర్థము.
మరి అలాంటి హంస గురించి పురాణేతిహాసాలు ఏమంటున్నాయో, ఆధ్యాత్మిక వాదులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
పురాణేతిహాసాలలో హంసకు ప్రత్యేకమైన స్థానం ఉంది.హంస ముఖ్యంగా చదువుల తల్లి సరస్వతీ దేవి యొక్క మంగళకరమైన వాహనము భారతీయ ఆధ్యాత్మిక చింతనలో హంసను జ్ఞానానికి, స్వీయ సాక్షాత్కారానికి ప్రతీకగానూ భావిస్తారు.హంసతో ముడిపడి ఓ పురాణమే వుంది.అదే హంస పురాణము.అలాగే వేదాల్లో హంస గాయత్రీ మంత్రం చాలా ప్రసిద్ధి చెందినది.
హంస యొక్క వర్ణము అంటే రంగు తెలుపు. తెలుపు రంగు స్వచ్ఛతకు,శ్రేష్టతకు చిహ్నము.హంస ఎల్లప్పుడూ మౌనంగా అంటే మూగగా, గంభీరంగా వుంటుందట.అలాగే హంస తినే ఆహారంలో ముత్యాలు ఉంటాయట.అందుకే హంసకు ఉన్న ఈ ప్రత్యేకమైన లక్షణాలను బట్టి కీర్తి,స్వచ్ఛత, జ్ఞానం,ఆప్యాయత, ప్రేమ, గాంభీర్యం మరియు దైవత్వంతో ముడిపడి ఉన్న పక్షిగా సమున్నతమైన స్థానం ఇచ్చారు.
హంస యొక్క గొప్పతనం గురించి మారద వెంకయ్య గారు కూడా ఓ అద్భుతమైన పద్యాన్ని రాశారు భాస్కరా ! అనే మకుటంతో రాసిన ఈ శతక పద్యాన్ని చూద్దాం.
తాలిమి తోడుతం దగవు తప్పక నేర్పరి,యొప్పుదప్పులం/బాలన సేయుగాకట నుపాయ విహీనుడు సేయ నేర్చునే?/పాలను నీరు వేరుపరుపంగ మరాళమెరుంగుగాక మా/ర్జాల మెరుంగునే తదరు చారు రసజ్ఞతబూన భాస్కరా!"
పాలను నీటిని వేరు చేయగల నేర్పరితనము,మంచి గుణము హంస దగ్గర వుంది కనుక హంస పాలను నీటిని వేరు చేయగలదు.మరి పిల్లికి అలాంటి లక్షణము, శక్తి లేదు.అది పాలూ నీళ్ళూ కలిపి వున్న వాటిని అలాగే తాగుతుంది.కానీ వాటిని వేరు చేసుకుని తాగేంత నేర్పరితనం, శక్తి లేదు.హంసలా నేర్పరితనం,తెలివి తేటలు ఉన్న పాలకుడు ఎలాంటి తగవులు, తప్పిదాలు జరగకుండా పరిపాలన చేస్తూ ఎవరికీ నష్టం కలుగకుండా తీర్పులు ఇవ్వగలడు.కానీ తెలివి,సమయస్ఫూర్తి లేనివాడు అలా చేయలేడు అని అర్థము.
ఈ విధంగా హంసలా జ్ఞానవంతుడు ఐన వ్యక్తికి మంచి-చెడు,తప్పు-ఒప్పు, విలువైన- పనికి రాని వాటి మధ్య తేడాను తెలుసుకుని మసలుకోగలుగుతాడు.పనికి రాని వాటిని విస్మరించగలడు అనే అర్థంతో ఈ "హంస క్షీర న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
ఇక హంస ముత్యాలను తింటుందని చెప్పుకున్నాం కదా! ముత్యాలు గట్టిగా వుంటాయి.అంటే కఠినంగా వుంటాయి.అంటే జీవితంలో ఎన్నో కఠినమైన,కష్టతరమైన సంఘటనలు ఎదురవుతూ వుంటాయి.అలాంటి వాటిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి అంటే జీర్ణించుకునే స్థితప్రజ్ఞత మనిషికి కూడా ఉండాలని చెబుతుంటారు.
మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే హంస నీటిలో ఈదినప్పటికీ రెక్కలకు ఏమాత్రం తడి అంటదట.అంటే సంసారమనే సాగరంలో మునిగినప్పుడు బంధాల తాలూకు ఎలాంటి పాశాలు తడి అంటకుండా ఈ భౌతిక ప్రపంచంలో జీవించాలని అర్థమన్న మాట.
మనలోని ఆత్మను హంసతో పోలుస్తూ వుంటారు.ఇక ఊపిరి ఆగిపోయినప్పుడు హంస ఎగిరిపోయింది అనడం మనందరికీ తెలిసిందే.
ఇక హిందూ మతంలో ఆత్మ జ్ఞానం తెలిసిన, ఆధ్యాత్మిక దృష్టి గల ఋషులను , సాధువులను 'పరమహంస' అనే బిరుదుతో పిలుస్తారు.అంటే 'సర్వోన్నత హంస'.ఆధ్యాత్మికతలో ఉన్నత స్థాయికి చేరుకున్న వ్యక్తి అన్నమాట."రామకృష్ణ పరమహంస' గారిని దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఇలా పాలను నీటిని వేరు చేయగల శక్తితో పాటు అనేకానేక ఉన్నతమైన గుణాలు కలిగిన హంసను ఆదర్శంగా తీసుకుందాం. మనలోని ఆత్మ ఉనికిని అర్థం చేసుకుందాం. ఆత్మ పరిశీలన ద్వారా సత్యం అసత్యాలను శోధన చేద్దాం.హంసలా అస్తిత్వాన్ని చాటుకుంటూ పవిత్రమైన మానస సరోవరంలో హంస జీవించినట్లు ఎల్లప్పుడూ స్వచ్ఛమైన మనసుతో, వివేకం, విచక్షణా జ్ఞానంతో మసలుకుందాం ."హంస క్షీర న్యాయం"లోని విషయాలన్నింటినీ గమనంలో పెట్టుకొని ఈ సమాజంలో హంసలా జీవిద్దాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి