పంచప్రాణాలు!!!:- డా ప్రతాప్ కౌటిళ్యా
ఆకాశం చర్మం వొలిచి నక్షత్రాలతో 
భూక్షేత్ర పాదాలను రక్షిస్తా!!

ఇంద్రధనస్సులను విరిచి 
చందమామలను ముద్దాడుతా!!

దేవకన్యలను వలచి 
అగ్ని ప్రవేశం చేసి యజ్ఞోపవితాన్ని 
త్యజిస్తా!!

నక్కల మాటల వేటల్లో 
ఏనుగునెక్కి సింహాల పులుల 
తలల్నీ తలకిందులు చేస్తా!!

తాటాకుల శబ్దాన్ని కాదు 
తూటాల శబ్దాన్ని నేను!!

తూర్పు పడమరల సముద్రాన్ని మింగే 
ధ్రువాన్ని నేను ధ్రువున్నీ నేను!!

ఉనికినే ప్రశ్నించి అస్తిత్వాన్ని త్యాగం చేసిన 
దానకర్ణుని వర్ణం నాది!!

నీవు ఏకలవ్యుని బొటవన వేలును తెంచితే
చిటికన వేలును తిన్న నకులున్నీ నేను!!

మా అన్న భీమున్నీ నేను జై భీం ను నేను!!?

గంధర్వులను గద్దె దించి గర్వం అణిచిన
దరువు మాది!!
సురుల స్వరం మార్చి సప్త స్వరాల కోటను కూల్చిన 
మాట మాది జానపద పాట మాది!!!

తోటి మాలను హత్య చేసిన తోటమాలిని కాను 
పూల తోటను నేను!!

వంచించినా కంచెకు కంచం మంచం పంచిన పచ్చని చేనును నేను 
మచ్చలేని స్నేహం నేను!!!

చీకటి కోసం తోటి సూర్యుణ్ణి వెలివేసిన 
కోటి వెలుగును నేను!!
నిగర్విగా పర్వతాల బరువును మోసిన భూమాతను నేను!!
మీరు రాసిన తలరాతను నేను!!
అయినా ఆకాశం మద్దతు మాకుంది.!

సప్తవర్ణాల కాంతి కత్తితో పొడిచి చంపిన పంచప్రాణాల్ని నేను పంచవర్ణున్నీనేను!!

ఎస్సీల వర్గీకరణకు మద్దతుగా రాసిన కవిత 

డా.ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు