తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం (జాతీయo వెనుక ఉన్న కథ) డా.ఎమ్.హరికిషన్-కర్నూల్-9441032212

 మనం ఎవరినైతే బాగా నమ్మి ఇంటిలోకి రానిస్తామో, మనవాడే అని భావిస్తామో, మన బాధలను సంతోషాలను పంచుకుంటామో, మనతోపాటు అన్నం బంతిలో పక్కనే కూర్చోబెట్టుకొంటామో... అటువంటివారే ఊహించని విధంగా అన్నంపెట్టి ఆదరించిన వారినే మోసం చేసినప్పుడు... వాడు తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే రకం అనే జాతీయాన్ని ప్రయోగిస్తాము. 
ఇంతకీ వాసాలు అంటే ఏమిటో తెలుసా... పూర్వకాలం ఇప్పట్లోలాగా కాంక్రీట్ తో నిర్మించిన ఇల్లు ఉండేవి కాదు. అప్పుడు అంతా ఎక్కువగా మట్టి ఇల్లు, పెంకుటిల్లు, పూరి గుడిసెలు మాత్రమే. ఈ మట్టి మిద్దెలు కట్టేటప్పుడు రెండు గోడలకు పైన పొడవాటి కట్టెలు (అడ్డ పట్టెలు) వరుసగా పెట్టి, వాటిపైన బండలు పరిచే వాళ్ళు. దానిపైన మట్టి వేసేవాళ్ళు. బండలు, మట్టి బరువై కట్టెలు వంగిపోవడంగానీ విరిగిపోవడంగానీ ఇల్లు కుంగడంగానీ జరగవచ్చు. అందుకే నిలువు దూలాలను వాటికి పోటుగా ఇంటిలో అక్కడక్కడ ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టేవాళ్ళు. పైన ఉండే అడ్డపట్టెలను వాసాలు అంటారు. నిలువు స్తంభాలను దూలాలు అంటారు. 
పూర్వకాలంలో ఒకడు నగరానికి పనిమీద వచ్చాడు. ఇప్పుడంటే సందుసందునా తినడానికి ఒక ఫలహారశాల, ఉండడానికి హోటళ్ళు వున్నాయి గానీ పూర్వకాలం అటువంటివి ఏవీ వుండేవి కాదు. అసలు అప్పట్లో అన్నం పరబ్రహ్మ స్వరూపమని దానిని అమ్మడం అతి పెద్ద పాపమనీ భావించేవాళ్ళు. ఎవరూలేని అనాధ స్త్రీలు మాత్రమే మరోమార్గం లేక నగరాల్లో అక్కడక్కడ పూటకూళ్ళ ఇల్లు నడిపేవారు.(పూటకు ఇంత తిండి చేసి పెట్టే ఇల్లు కాబట్టి దానిని పూటకూళ్ళ ఇల్లు అనేవారు). వీళ్ళను చాలా చిన్నచూపు చూసేవారు. 
ఈ కాలంలో బస్సు సౌకర్యాలు బాగా పెరిగాయి కాబట్టి బంధువులు ఎవరొచ్చినా ఒక పూటనో, ఒక గంటనో వుండి అందరినీ పలకరించి, పని చూసుకొని వెంటనే వెళ్ళిపోతున్నారు. పూర్వకాలం అట్లా కాదు. ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్ళవలసి వస్తే బండ్లు కట్టుకొనో, కాలి నడకనో అనేక తిప్పలు పడి వెల్లేవాళ్ళు. అందుకే వచ్చినవాళ్ళు నాలుగైదు రోజులు వుండి వెళ్ళేవాళ్ళు. పోతామన్నా బంధువులు వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు.
సరే మనం ఇప్పుడు ఇక మన కథలోకి వద్దాం. ఒకడు పనిమీద నగరానికి వచ్చాడు కదా... అక్కడ చాలా దూరపు బంధువు ఒకరు వుంటే వారి ఇల్లు కనుక్కొని వెళ్ళాడు. ఒక నాలుగు రోజులు వుండడానికి ఆశ్రయం ఇమ్మని అడిగాడు. ఆ బంధువు చాలా మంచివాడు. అతిధులు దేవునితో సమానం అని నమ్మేవాడు. తాను తిన్నా తినకపోయినా అతిధులకు మాత్రం కడుపునిండా అన్నం పెట్టాలి అనుకునేవాడు. దాంతో అతన్ని ఆప్యాయంగా ఆహ్వానించి "ఎంతో దూరం నుంచి ఎంతో శ్రమపడి రాకరాక వచ్చారు. ఎన్ని రోజులైనా పర్వాలేదు మీ పని పూర్తి అయ్యేవరకు హాయిగా ఇక్కడే ఉండండి. మీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను" అని చెప్పాడు. 
రెండు రోజులకే ఆ అతిథి ఆ ఇంటివాళ్లతో బాగా కలసిపోయాడు. అందరితో మాటలు చెబుతూ సొంత ఇంటిలో తిరుగుతా ఉన్నట్లే తిరగసాగాడు. అది చాలా పెద్ద ఇల్లు. హాయిగా మంచం మీద పడుకొని పైకి చూస్తావుంటే అతనికి పైన వాసాలు కనపడ్డాయి. పనీపాటా లేకపోవడంతో ఆ గదిలో పైన ఎన్ని వాసాలు వున్నాయో లెక్క పెట్టాడు. అలాగే అన్ని గదుల్లో మొత్తం ఎన్ని వాసాలు వున్నాయి, ఎన్ని దూలాలు వున్నాయి, ఇంటికి ఎన్ని కిటికీలున్నాయి, తలుపులున్నాయి... అవి దేనితో తయారయ్యాయి... ఇటువంటి విషయాలన్నీ బాగా గమనించి గుర్తుపెట్టుకున్నాడు. 
నెమ్మదిగా వానికి ఒక చెడ్డ ఆలోచన మనసులో ప్రవేశించింది. "ఈ ఇల్లు చాలా బాగా విశాలంగా వుంది. అన్ని సౌకర్యాలు వున్నాయి. ఎలాగైనాసరే ఈ ఇల్లు కొట్టేయాలి" అనుకున్నాడు. దాంతో ఒకరోజు ఆ అతిథి ఆ ఇంటి యజమానితో "మీరు ఇప్పటికే వచ్చి చాలా రోజులైంది కదా. ఎప్పుడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు" అని అడిగాడు. ఆయన అతిధి తనతో వేళాకోళం ఆడుతున్నాడు అనుకొని "నేను ఖాళీ చేయడమేంది. ఈ ఇంటికి అతిథిగా వచ్చింది మీరు. పనైపోగానే మీరే ఖాళీ చేయాలి" అన్నాడు నవ్వుతూ. దానికి ఆ అతిథి కోపంగా "ఏదో బంధువులు కదా అని ఇంటిలో ఉండనిస్తే నాకే నామం పెట్టాలనుకుంటున్నారా. ఈ ఇల్లు నాది. ఎలా ఖాళీ చేయరో నేనూ చూస్తా" అంటూ చక్కగా న్యాయాధికారి దగ్గరికి పోయాడు. 
"అయ్యా... మాది చాలా దూరంలో వున్నటువంటి ఒక చిన్న గ్రామం. ఎప్పటికైనా పనికొస్తుందిలే అని ఈ నగరంలో కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నాను. వీళ్ళు నాకు దూరపు బంధువులు. ఇల్లు ఖాళీగా వుంచితే పాడుబడిపోతుందని మేము వచ్చేంతవరకు వుండమని వీళ్ళకు వూరికే ఇచ్చాను. కానీ వీళ్ళు ఇప్పుడు ఈ ఇల్లు నాదే అని గొడవ పడుతున్నారు. మీరే ఎలాగైనా సరే వీళ్లను ఖాళీ చేయించి నా ఇల్లు నాకు ఇప్పించాలి" అన్నాడు. 
న్యాయాధికారులు ఆ ఇంటి యజమానిని పిలిపించారు. అతను నెత్తీనోరూ కొట్టుకుంటూ "అయ్యా... ఆ ఇల్లు నాది. ఎంతో కష్టపడి వున్న సొమ్మంతా ఖర్చు పెట్టి కట్టుకున్నాను. ఏదో దూరపు బంధువు కదా నాలుగు రోజులు వుంటానంటే వుండనిచ్చాను. కానీ ఇతడు ఏకంగా నాకే పొగబెడతా వున్నాడు. ఇతని మాటలు నమ్మకండి" అన్నాడు. ఇద్దరూ ఆ ఇల్లు నాదంటే నాదంటూ గొడవ పడతావుంటే ఆ న్యాయాధికారులకు ఎవరి తరపున తీర్పు చెప్పాలో తెలియక తలలు పట్టుకున్నారు.
అప్పుడా అతిధి "అయ్యా... ఆ ఇల్లు స్వయంగా దగ్గరుండి నేను కట్టించాను కాబట్టి ఆ ఇంట్లో వుండే అణువణువు నాకు బాగా తెలుసు. ఆ ఇంటికి ఎన్ని వాసాలు వున్నాయి, ఎన్ని దూలాలు వున్నాయి, ఎన్ని వాకిళ్లు వున్నాయి, ఎన్ని కిటికీలు ఉన్నాయి... ఏది ఏ చెక్కతో చేశారు, ఎటువైపు వున్నాయి అనే విషయాలన్నీ మీకు వివరంగా చెబుతాను. అతను చెబుతాడేమో అడగండి" అన్నాడు. 
అతను చెప్పిన మాటల్లో న్యాయం వుంది అనుకున్న న్యాయమూర్తులు ఆ ఇంటి యజమానితో "సరే ఈ ఇల్లు నీదే అంటున్నావు కదా... అతను ఆ ఇంటికి సంబంధించిన అన్ని వివరాలు కూడా చెబుతా అంటున్నాడు. అలాగే మీరు కూడా ఇంటిలో ఎన్ని వాసాలు దూలాలు ఉన్నాయో సరిగ్గా చెప్పగలరా" అన్నాడు. ఇంటి యజమాని అయోమయంలో పడిపోయాడు. ఎంత ఆలోచించినా తలుపులు వాకిళ్లు దూలాలు ఎన్నున్నాయో గుర్తుకు వస్తావుంది గానీ పైన వున్న వాసాలు ఎన్ని వున్నాయో గుర్తుకు రావడం లేదు. దాంతో అందాజుగా చెప్పాడు. 
న్యాయమూర్తులు ఇద్దరూ చెప్పింది విని ఆ ఇంటికి పరిశీలన కోసం వచ్చారు. ఇంటి వాసాలు దూలాలు కిటికీలు తలుపులు అన్నీ లెక్క పెట్టారు. అవి అతిథి చెప్పిన సంఖ్యకు సరిగ్గా సరిపోయాయి. దాంతో వాళ్లు ఆ ఇల్లు అతనిదే అని తీర్పు చెప్పి యజమానిని ఇంటి నుంచి వెళ్ళగొట్టి అతనికి అప్పచెప్పారు. ఇది ఈ జాతీయం వెనక వున్నటువంటి కథ. కాబట్టి ఎవరైనా సరే మనల్ని బాగా నమ్మించి మన గుట్టుమట్లు అన్నీ తెలుసుకొని మోసం చేస్తే 'వాడు తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే రకం' అనే జాతీయంతో పోల్చడం ప్రారంభమైంది.
**********
కామెంట్‌లు