భళా.......మహా కుంభమేళా - 2025 ! -----డా. హారిక నాంపల్లి, కరీంనగర్.



కుంభమేళా అనేది భారతదేశంలో జరిగే అతిపెద్ద హిందూ ఆధ్యాత్మిక ఉత్సవం. ఇది మతపరమైన ప్రాముఖ్యతతో పాటు, హిందువుల ఐక్యత మరియు భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా చేస్తుంది. 

కుంభమేళా అనగా....కుంభ(కుండ/కలశం/భూమి), మేళా(కలయిక - అందరూ ఒకే దగ్గర కలిసి ఉండడం/జాతర) అని అర్థం. 

ప్రయాగ్ రాజ్ లో జరిగే కుంభమేళాను అన్ని తీర్థయాత్రల్లో కెల్లా అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కుంభమేళాకు ఆ దేవుళ్ళే దిగి వస్తారని ప్రతీతి. 

దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల మంది హిందువులే కాక, ప్రపంచ నలుమూలల నుండి వివిధ దేశాల వ్యక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తారు. 

ఈ భక్త జన సమ్మేళనంలో హిందువులతో పాటు; జైన, బౌద్ధ, సిక్కు వంటి వివిధ మతాల వారు మరియు సామాన్య ప్రజానీకం తో పాటు, అపర శివ-విష్ణు,శక్తి మాత భక్తులైన అఘోరా & నాగ సాధువులు; పండితులు, ఆధ్యాత్మిక వేత్తలు మరియు వివిధ దేశాల ప్రముఖులు పాల్గొంటారు. 

భిన్న మతాలు, విభిన్న సంస్కృతులతో.....'భిన్నత్వంలో ఏకత్వం' గా తన వైవిధ్యాన్ని చాటుకున్న మన 'భారతదేశం'.... లోని ప్రయాగ్ రాజ్ త్రివేణీ సంగమంలో 144 ఏళ్ల తర్వాత, అరుదైన ఖగోళ గ్రహ అమరిక వలన జరుగుతున్న ఈ సమ్మేళనం భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపుతూ "ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక" గా ప్రాధాన్యతను సంతరించుకుంది.

కుంభమేళా జరిగినన్ని రోజులు ఆ ప్రాంతం దైవ నామస్మరణతో మారుమోగుతుంది. 

ప్రయాగ్ రాజ్ లో జరిగే కుంభమేళాలు దాదాపు పుష్యమాసంలో వచ్చే పూర్ణిమ నుండి మాఘమాసంలో వచ్చే పూర్ణిమ(మాఘ పూర్ణిమ) అనంతరం వచ్చే మహా శివరాత్రి వరకు, అంటే సుమారు 45 రోజుల పాటు కొనసాగుతాయి. 

కుంభమేళా జరిగే ప్రదేశంలో - అక్కడి నదీ జలాల్లో పుణ్యస్నానాలు ఆచరించడం; ఆధ్యాత్మిక సాధనలు, పూజలు; దానం, పితృ తర్పణం, శ్రాద్ధ కర్మలు చేయడం వంటివే కాకుండా; సాధువుల దర్శనం, ధర్మ పరిరక్షణ పై చర్చలు వంటివి జరుగుతాయి. 

ప్రయాగ లో 45 రోజుల పాటు సాగే ఈ మేళాలో, 6 రోజులను భక్తులు మరింత పవిత్రమైనవి గా భావిస్తారు.
ఆ ముఖ్యమైన 6 రోజులు వరుసగా: 

 1) పుష్య పూర్ణిమ - ఈ రోజునే కుంభమేళాలు ప్రారంభమవుతాయి. 

 2) మకర సంక్రాంతి - ఈ రోజున సూర్యుడి మకర  సంక్రమణం వలన ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ రోజున దానాలు చేయడం వల్ల చేసిన పాపకర్మలు తొలగిపోయి, సూర్య భగవానుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. కావున భక్తులు ఈ రోజున సాంప్రదాయకంగా ఏదైనా ఆహారం,బెల్లం,నువ్వులు,దుస్తులు,దుప్పట్లు వంటివి దానం చేస్తారు. 

 3) మౌని అమావాస్య - ఇది 2 పూర్ణిమల మధ్య వచ్చే మాఘ శుద్ధ అమావాస్య. ఈరోజునే నాగ సాధువులుగా మారాలనుకునే వారికి సన్యాస దీక్షను ఇస్తారు. సాధకులు ఈ రోజున మౌనాన్ని పాటిస్తూ, తపస్సు చేసుకుంటారు మరియు ఉపవాస దీక్షను పాటిస్తారు. 

 4) వసంత పంచమి - అక్కడ ఉండే కల్పవాసీలు ఈ రోజున జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతీ మాతకు కృతజ్ఞతగా పసుపు రంగు దుస్తులు ధరించి,అమ్మవారి ఆశీస్సుల కొరకు పూజిస్తారు. 

 5) మాఘ పూర్ణిమ/మహా మాఘీ - ఈ రోజున ప్రయాగలో పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే అత్యంత శ్రేష్టమైనదని, తద్వారా వారికి తప్పకుండా మోక్షం కలుగుతుందని భావిస్తారు. 

 6) మహాశివరాత్రి - ఈ రోజుతో కుంభమేళాలు ముగుస్తాయి. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి, శివుడిని పూజిస్తారు. 

ఎక్కడైతే కుంభమేళా నిర్వహించడం జరుగుతుందో, అక్కడి నదీజలాల్లో పవిత్రస్నానాలు ఆచరించడం అనేది మేళా సందర్భంగా పాటించే అతి ముఖ్యమైన ఆచారం. 

కానీ పైన పేర్కొన్న 6 ముఖ్యమైన రోజుల్లోని కొన్ని వేళల్లో..... గ్రహాలు, నక్షత్రాల ప్రత్యేక స్థానం కారణంగా ఆ నదీజలాలు మరింత దైవత్వాన్ని సంతరించుకుంటాయని; కావున ఆ రోజుల్లో, ముఖ్యంగా ఆ ఘడియల్లో నదీస్నానం ఆచరిస్తే సకల దోషాలు - సమస్త పాపాలు తొలగి, జనన మరణ చక్రం నుండి మోక్షం లభిస్తుందని హిందువులు బలంగా విశ్వసిస్తారు. వీటినే 'అమృత స్నానాలు/రాజ స్నానాలు/షాహీ స్నానాలు' అని కూడా అంటారు. 

ఈ ముఖ్యమైన రోజుల్లో తొలుత నాగ సాధువులు పుణ్యస్నానాలు చేసాకనే; మిగతా సాధు సంతులు, అఘోరాలు, భక్తులు స్నానాలు ఆచరిస్తారు. ఈ ముఖ్యమైన రోజుల్లో పవిత్రస్నానాలు చేసేందుకు భక్తులు భారీగా తరలివస్తారు. 

ప్రస్తుతం జరుగుతున్న మహా కుంభమేళాలో ఈ ప్రత్యేకమైన 6 రోజులు వరుసగా... 13,14,29 జనవరి 2025; 03,12,26 ఫిబ్రవరి 2025 తేదీలలో వస్తున్నాయి. 

ప్రతిరోజు సంధ్యా సమయంలో నదీమ తల్లులకి హారతులు ఇచ్చే అద్భుత దృశ్యాన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు నదీ తీరాల వద్ద భక్తులు భారీ సంఖ్యలో గూమి గూడుతారు. 

కావున కుంభమేళా ప్రత్యేక రోజుల్లో మరియు సాయంకాల హారతి వేళల్లో సందర్శించినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. 

 సాధారణంగా కుంభమేళా అనేది 4 రకాలు. 
 1)మాఘమేళా
ప్రతీ సంవత్సరం మాఘ మాసంలో కేవలం ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం ఒడ్డున 'మాఘమేళా' జరుగుతుంది. మాఘ మాసంలో జరగడం వలన, దానికి ఆ పేరు వచ్చింది. ఇది 45 రోజుల పాటు సాగుతుంది. ఈ రోజులలో భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ప్రదేశాన్ని సందర్శించి, పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. అందుకే దీనిని 'మినీ కుంభమేళా' అని కూడా పిలుస్తారు. 

మరికొంత మంది మాఘమాసం మొత్తం ప్రార్థనలలో గడుపుతారు. ఈ కాలాన్ని 'కల్పవాస్' అని, దానిని పాటించే వారిని 'కల్పవాసి' లు అని పిలుస్తారు. సంస్కృత పదమైన కల్పవాస్ లో కల్పం అంటే సుదీర్ఘ కాలం, వాసం అంటే నివసించడం అని అర్థం. పేరు సూచించినట్లుగా, కల్పవాసం చేసేవారు పవిత్ర నదుల వద్ద ఒక నిర్దిష్టకాలం నివసిస్తూ... ఉపవాసం, స్వీయ క్రమశిక్షణ, ఆత్మ పరిశీలన, ఆధ్యాత్మిక శుద్ధికి కట్టుబడి ఉండటం వంటివి పాటిస్తూ వుంటారు. ఈ ఆచారాన్ని పాటించడం వల్ల శారీరక, మానసిక క్రమశిక్షణ మరియు ఆధ్యాత్మిక ఆంతరంగిక శుద్ధి కలుగుతాయని భావిస్తారు. 

అయితే ఈ మాఘమేళాలు కేవలం మాఘ మాసానికే పరిమితం కాలేదు. ప్రతి 12వ సంవత్సరం, మాఘ మేళా.... కుంభమేళాగా రూపాంతరం చెందుతుంది. 

 2.అర్థ కుంభమేళా : 
ఇది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ (లేదా) హరిద్వార్ లో జరుగుతుంది.ఇది 2 పూర్ణ కుంభమేళాల మధ్య జరుగుతుంది. 

 3.పూర్ణ కుంభమేళా
ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని లలోని ఏదో ఒక ప్రదేశంలో జరుగుతుంది. 

 4.మహా కుంభమేళా : 
12 పూర్ణ కుంభమేళాలు పూర్తయ్యాక, అంటే 144 సంవత్సరాలకు(12x12 = 144 సం॥) ఒకసారి జరిగే కుంభమేళాను 'మహా కుంభమేళా' అని పిలుస్తారు. అయితే, 144 ఏళ్లకు జరిగే ఈ మహా కుంభమేళాను కేవలం త్రివేణి సంగమం అయినటువంటి ప్రయాగరాజ్ లోనే నిర్వహిస్తారు. 

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్నది పూర్ణ కుంభమేళానే. కానీ 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన సందర్భంగా, అంటే 144 సంవత్సరాల తర్వాత వచ్చినది కాబట్టి దీనిని "మహా కుంభమేళా - 2025" గా పేర్కొంటున్నారు. 

చివరిసారిగా 2013 లో పూర్ణ కుంభమేళాను & 1881 లో మహా కుంభమేళాను ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించారు. 

కుంభమేళా చరిత్ర సుమారు 850 ఏళ్ళ నాటిదని చెప్తారు. 

కుంభమేళాను నిర్వహించటం అనే సాంప్రదాయం ఎప్పుడు మొదలయింది అనేదానిపై అనేక కథనాలు ఉన్నప్పటికినీ...... పురాణాలు, జ్యోతిష్య శాస్త్రం, చరిత్ర ఏమి చెబుతున్నాయో ఒకసారి పరిశీలిద్దాము. 

* పురాణాల ప్రకారం..... 
కొన్ని వేదాలు మరియు పురాణాల్లో కొన్ని చోట్ల 'కుంభ్' అనే పదం వినియోగించబడింది. కానీ అది కుంభమేళాకు సంబంధించినది కాదని; 'కలశం/కుండ', 'భూమి' అనే అర్థంలో మాత్రమే ఆ పదం వాడబడినదని చెబుతారు. 

పురాణ ఇతిహాసాల్లో 'కుంభమేళా' అనే పద ప్రస్తావన లేకపోయినా; కొన్ని విశేషమైన రోజుల్లో ప్రజలు ఎక్కువ సంఖ్యలో నదీ తీరాలకు చేరుకొని, పవిత్రస్నానాలు ఆచరించడం, అక్కడ ఉత్సవాలు జరుపుకోవడం వంటి వాటి ప్రస్తావన కనిపిస్తూనే వుంటుంది. కారణమేమనగా, సనాతన ధర్మంలో నదులు సదా అత్యంత పూజనీయమైనవి కాబట్టి. 

నదుల వద్ద వేడుకలు, ఉత్సవాలు జరుపుకోవడం వంటివి తర్వాత కాలంలో - కుంభమేళాలుగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయని చెబుతారు. 

 *ప్రధానంగా కుంభమేళాకి సంబంధించి పురాణాల్లో 3
కథలు ప్రచారంలో ఉన్నాయి.* 

 1.క్షీరసాగర మథన ఘట్టం :
దుర్వాస మహర్షి శాపం వలన సమస్త శక్తి సంపత్తులను కోల్పోయిన దేవతలు... వాటిని తిరిగి పొందడానికి కావలసిన అమృతం కోసం.... రాక్షసుల(దానవులు) తో క్షీరసాగర మథనం చేయాలనే శ్రీ మహా విష్ణువు సూచన మేరకు, వారితో దేవతలు క్షీరసాగర మథనానికి పూనుకుంటారు. 

పాలకడలిని చిలకడానికి కవ్వంగా 'మందర పర్వతం' ముందుకు రాగా, దానిని ఒడిసి పట్టుకోవడానికి తాడుగా శివుడి మెడలో వుండే వాసుకి (పాము) ముందుకు వచ్చింది. పాము తలభాగం వైపు రాక్షసులు, తోక భాగం వైపు దేవతలు నిలబడి పాలకడలిని చిలుకుతారు. 

ఆ క్రమంలో అమృతం కన్నా ముందు.... హాలాహలం(పరమేశ్వరుడు దానిని కంఠంలో నింపుకుంటాడు), ఐరావతం, ఉచ్చైశ్రవము అనే గుర్రం, కామధేనువు,అప్సరసలు, పారిజాత వృక్షం, సారంగం అనే విల్లు, పాంచజన్యం అనే శంఖం, కౌస్తుభమణి, నవగ్రహాలలో ఒకరైన చంద్రుడు, సకల ఐశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవి; తర్వాత ఆమె అక్క, సకల దరిద్రాలను ఇచ్చే అలక్ష్మీ, ఇలా వరుసగా ఒక్కొక్కటిగా పుట్టుకొస్తాయి. 

ఆఖరిగా దేవ వైద్యుడిగా పేరుగాంచిన 'ధన్వంతరి'.... దేవదానవులు ఎంతగానో ఎదురచూస్తున్న అమృత కలశంతో పాలకడలి నుండి బయటకు వస్తాడు. 

ఇలా దేవదానవుల మధ్య అమృతం కోసం జరిగిన పోరు దాదాపు 12 రోజుల పాటు సాగుతుంది. ఆ సమయంలోనే శ్రీ మహావిష్ణువు 'మోహిని' అవతారమెత్తి, ఆ అమృత కలశం రాక్షసుల చేతికి చిక్కకుండా పట్టుకుపోతున్న సమయంలో ఓ 4 అమృతపు చుక్కలు భూమి పై గల ప్రయాగ్ రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని అనే 4 క్షేత్రాల్లో గల నదుల్లో పడ్డాయని కథనం. 

అమృతపు చుక్కలే కాదు, కలశమే జారిపడిందనే కథనం చేతితో రాసిన స్కాందపురాణం లో ఉందని చెప్పబడుతుంది. 

పురాణాల ప్రకారం... దేవతల ఒక దైవిక రోజు, భూమి పైన ఒక ఏడాదితో సమానం. అమృతం కోసం దేవ దానవుల మధ్య 12 రోజుల పాటు సాగిన యుద్ధం, భూమిపైన 12 సంవత్సరాలతో సమానం. కావున 12 సంవత్సరాలకి ఒకసారి కుంభమేళా జరుగుతుందని ఐతిహ్యము. 

 2.గరుడుడు   అతని తల్లికి సంబంధించిన కథ : 
గరుత్మంతుడు... తన తల్లి 'వినత' ను, అతని పినతల్లి అయిన 'కద్రువ' బానిసత్వం నుండి తప్పించేందుకు స్వర్గం నుండి అమృత కలశం తెస్తుండగా... 4 చుక్కలు, పైన పేర్కొన్న 4 ప్రదేశాలలో జారిపడ్డాయని మరో కథనం. 

 3.విష్ణుమూర్తి , గరుడులకు సంబంధించిన కథ : 
అమృత కలశాన్ని విష్ణుమూర్తి వద్దకు చేర్చే క్రమంలో, గరుత్మంతుడు నాలుగు చోట్ల ఆగి విశ్రాంతి తీసుకున్నాడని, ఆగిన ఆ నాలుగు చోట్ల అమృత కలశం ఉంచబడటంతో, దానికి గుర్తుగా ఆ 4 చోట్లా వేడుకలు (ప్రస్తుత కుంభమేళాలు) జరుపుకుంటారని తెలియజేస్తుంది. 

ఈ విధంగా కుంభమేళా అనే పేరు 'అమృత కలశం' నుంచి వచ్చిందని, అమృతంతో ఆ నాలుగు నదులు అత్యంత పవిత్రతను మరియు కొన్ని సమయాల్లో అమృత తత్వాన్ని సంతరించుకుంటాయని; కావున ఆ నాలుగు చోట్లా కుంభమేళాలు జరగడం ఆనవాయితీగా వస్తోందని చెబుతారు. 

పద్మ పురాణం & శివ పురాణాల్లో 'కుంభమేళా' అనే పదం కనిపించకపోయినా......కొన్ని నిర్దిష్టమైన సమయాల్లో, నదీ తీరాల్లో ఉత్సవాలు జరగడానికి కావలసిన ఖగోళ గ్రహ కలయికలు, కదలికల గురించి కనిపిస్తుంది.
వీటి ఆధారంగానే ఉత్సవాలు (మేళాలు) ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలో తెలియచేస్తారు. ఈ పురాణాలు ప్రయాగలో మాఘస్నానం అత్యంత పవిత్రమైనదని పేర్కొన్నాయి. 

అగ్ని పురాణం మరియు అనేక పురాణాల్లో ప్రయాగ యొక్క వర్ణనా మహత్యం; ప్రజలు పెద్ద సంఖ్యలో నదీ సంగమాలలో పుణ్యస్నానాలు ఆచరించటం వంటి విశేషాల వివరణ ఉంది. 

* జ్యోతిష్య శాస్త్రం(సౌరమానం/బారుహస్పత్యమానం) ప్రకారం :
ఈ శాస్త్ర ప్రకారం - గురువు(బృహస్పతి), సూర్యుడు(రవి), చంద్ర గ్రహాల ప్రత్యేక స్థానాలను బట్టి కుంభమేళాలు ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలో నిర్ణయిస్తారు. 

జ్ఞానం మరియు విస్తరణకు ప్రతీక అయిన గురు గ్రహం ఒక్కోరాశిలో ఏడాదిపాటు ఉంటాడు. అలా 12 రాశులలో రాశి ప్రవేశం చేసి, తన ప్రదక్షిణను పూర్తి చేయడానికి 12 సంవత్సరాల సమయం పడుతుంది.
ఇలా గురు గ్రహ పూర్తి రాశి చక్ర ప్రదక్షిణ(భ్రమణము) మరియు సూర్య-చంద్ర గ్రహాలతో దాని అమరిక మరియు కదలికలు కుంభమేళా జరిగే సమయాన్ని, స్థానాన్ని నిర్దేశిస్తాయి. 

ఈ సమయంలో నదులు ఆధ్యాత్మిక శక్తిని సంతరించుకుంటాయని, కావున జ్ఞాన సముపార్జన మరియు ఆధ్యాత్మిక శక్తులను పొందడానికి ఇది సరైన సమయమని భావిస్తారు. 

 ఈ కుంభమేళాలు కేవలం 4 ప్రాంతాల్లో మాత్రమే నిర్వహిస్తారు. 
1. సూర్యుడు మేషరాశిలో, గురువు కుంభరాశిలో ప్రవేశించినపుడు - హరిద్వార్(ఉత్తరాఖండ్ రాష్ట్రం) లోని గంగానది తీరాన 
2. సూర్యుడు మకర రాశిలో, గురువు మేషరాశిలో ప్రవేశించినపుడు - త్రివేణి సంగమం(గంగ,యమున, సరస్వతి) అయిన ప్రయాగ్ రాజ్(ఉత్తరప్రదేశ్ రాష్ట్రం) లో 
3. సూర్యుడు & గురువు లిద్దరూ సింహరాశిలో ప్రవేశించినపుడు - నాసిక్(మహారాష్ట్ర) లోని గోదావరి నదీ తీరాన 
4. సూర్యుడు మేష రాశి, గురువు సింహరాశిలో ప్రవేశించినపుడు - ఉజ్జయిని(మధ్యప్రదేశ్ రాష్ట్రం) లోని శిప్రా నది తీరాన జరుగుతాయి. 

గురువు సింహరాశి ప్రవేశం అనంతరం జరిగే.... పైన పేర్కొన్న చివరి 2 కుంభమేళాలను 'సింహస్థ కుంభమేళాలు' అని కూడా పిలుస్తారు. 

* కుంభమేళాలు నిర్వహించడం వెనుక ఉన్న చరిత్రను గమనిస్తే.... 
అతి ప్రాచిన నేపధ్యం గల ఈ మేళాలు, చరిత్రకందని కాలం నుండే జరుగుతూ వస్తున్నాయని చెబుతారు. 

బౌద్ధుల ప్రధాన గ్రంధమైన 'మజ్జిమ నికాయ' లోని 1.7వ సెక్షన్ లో కేవలం ప్రయాగలో నదీ స్నానాలు ఆచరించినందు వలన చేసిన పాప కర్మలు తొలగవని; మన హృదయ పరిశుద్ధత, మనం చేసే మంచి కర్మలు మాత్రమే మంచి ఫలితాలు ఇస్తాయి అనే గౌతమ బుద్ధుడి బోధనలు ఉంటాయి.
ఆ పుస్తకంలో గల గౌతమ బుద్ధుడి (క్రీ.పూ. 563–483) బోధనలు హిందువుల నదీస్నాన ఆంతర్యాన్ని నిరసించినప్పటికినీ, వారు చేసిన ప్రయాగస్నాన ప్రస్తావన ద్వారా....నదీ తీరాల్లో పవిత్రస్నానాలు ఆచరించటం, మేళాలు జరిగే సాంప్రదాయం అతి పురాతనమైనదని అని అర్థమవుతుంది. 

ప్రయాగ్ రాజ్ లోని ఈ ఉత్సవాలను గుప్తుల కాలం(క్రీ.శ. 4-6 వ శతాబ్దం)లో కూడా నిర్వహించినట్లుగా; అప్పటి రాజులు కూడా నదీ ఒడ్డున పెద్ద పెద్ద ఆలయాలు నిర్మించి, పుణ్యస్నానాలకు ఘాట్లు ఏర్పాటు చేసి, ఈ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించే వారని; ఆ కాలంలోనే ఈ ఉత్సవాలు స్థానిక వేడుక నుంచి దేశస్థాయికి ఎదిగాయని; 12వ శతాబ్దం తర్వాత వీటి ప్రతిష్ట మరింత పెరిగిందని, వివిధ రాజ్యాలకు చెందిన రాజులు కూడా ఈ వేడుకల్లో పాల్గొని తగిన ఆర్థిక సాయం అందజేసేవారని; ముఖ్యంగా అక్బర్ కాలంలో ఈ ఉత్సవాల కోసం ప్రత్యేక నిధులు, భూ కేటాయింపులు జరిగాయని చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. 

క్రీ.శ. ఆరవ శతాబ్ధంలో హర్షవర్ధనుడు అనే రాజు ప్రయాగలో ప్రతి 5 సం॥ లకు ఒకసారి నదీ సంగమం దగ్గర ఘనంగా ఏర్పాట్లు చేసి, అక్కడ సమావేశాలు నిర్వహించి... ఆధ్యాత్మిక చర్చలు జరిపేవాడనీ; ఈ ఉత్సవం తర్వాత తన సంపదను అన్ని వర్గాల పేద ప్రజలకు దానం చేసేవాడనీ; ఆ తర్వాత ఆ ఆచారం అతని వారసులు కూడా కొనసాగించారని.....హుయెన్ త్సాంగ్ అనే ప్రఖ్యాత చైనా యాత్రికుడు, తన యాత్రా కథనమైన 'సి-యు-కి' లో తన భారతదేశ పర్యటన సందర్భంలో చూసిన అనుభవాలను రాసుకొచ్చాడు. 

16 వ శతాబ్దానికి చెందిన, మొఘలుల కాలానికి సంబంధించిన.... అబుల్ ఫజల్ రాసిన 'ఐన్-ఐ-అక్బరీ' అనే పుస్తకం; అదే శతాబ్దానికి చెందిన 'ఖా-ధే-అక్బరీ అనే మరో పుస్తకంలో కూడా ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమ తీరాన నాగ సాధువులు & ప్రజలు జరిపే పవిత్ర స్నానాల ప్రస్తావన కనిపిస్తుంది. 

పైన పేర్కొన్న చారిత్రక ఆధారాల్లో ప్రయాగ్ రాజ్ లోని నదీ సంగమ తీరంలో జరిగే ఉత్సవాల గురించి పేర్కొనబడినదే కానీ, కుంభమేళా అనే పదం ఎక్కడా కనిపించదు. 

17వ శతాబ్దానికి చెందిన, మొఘలుల కాలానికి సంబంధించిన మరో రెండు పుస్తకాలు 'ఖులాసత్-ఉత్-తవారిఖ్' ; 'చాహర్ గుల్షన్' లలో కుంభ్ అనే పదం కనిపిస్తుంది. వీటిలో హరిద్వార్ లో జరిగే కుంభ ఉత్సవాల ప్రస్తావన కనిపిస్తుంది. 

ప్రయాగలో జరిగే కుంభమేళాకి సంబంధించిన ఆధారాలు 'ఝాన్సీ గెజిటీర్' లో కూడా కనిపిస్తాయి. 

బ్రిటిష్ వారి కాలంలో కూడా ఈ కుంభమేళాలు నాలుగు చోట్ల జరుగుతుండేవని, వాటికి ఆంగ్లేయులు ప్రత్యేక ఏర్పాట్లు చేసేవారని, బ్రిటిష్ వారి కాలంలో జరిగిన ఒక కుంభమేళాలో మహాత్మా గాంధీ గారు కూడా పాల్గొన్నారని; అయితే ఈ తరహా కార్యక్రమాలు భారతీయులను ఒక్క తాటి మీదకు తీసుకొస్తున్నాయన్న కారణంతో క్రమంగా బ్రిటిష్ ప్రభుత్వం వీటిని వ్యతిరేకించి, పన్నులు విధించి, అణగదొక్కే ప్రయత్నం చేసిందని చారిత్రక సమాచారం. 

స్వాతంత్రం పొందిన తర్వాత తొలిసారిగా 1954లో అలహాబాద్(ఇప్పటి ప్రయాగరాజ్) లో కుంభమేళాను నిర్వహించారు. దీనికి అప్పటి ప్రధానమంత్రి శ్రీ.పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు కూడా హాజరయ్యారు. ఇది మనదేశంలో స్వాతంత్ర్యం తర్వాత జరిగిన మొదటి అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. 

అప్పటినుండి ఈ కుంభమేళా పరంపర నిరంతరాయంగా కొనసాగుతూ వస్తుంది. ప్రతిసారీ భక్తుల సంఖ్య ఎన్నో రెట్లు పెరుగుతూనే ఉంది.
 కుంభమేళాలకు గల చరిత్రను పరిశీలించినప్పుడు, "అఖాడా"ల గురించి ప్రత్యేకంగా చర్చించవలసి ఉంటుంది. 

8 వ శతాబ్దపు గొప్ప తత్వవేత్త, అద్వైత సిద్ధాంత కర్త, జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల వారు కుంభమేళాలను వ్యవస్థీకృతపరచి, ప్రస్తుత రూపు కల్పించారంటారు. 

శివానుగ్రహంతో, వారు అద్వైత సిద్ధాంత వ్యాప్తి, సంరక్షణకై.... దేశ వ్యాప్తంగా వున్న పండితులను, ఆధ్యాత్మిక వేత్తలను, సాధువులను కలిసేందుకు నదుల ఒడ్డునే వేదికలు ఏర్పాటు చేసి, చర్చా-గోష్టులు జరిపేవారనీ, అవే తర్వాత కుంభమేళాలుగా మారాయని ప్రచారంలో ఉంది. 

 'అఖాడా' అనే సంస్కృత పదానికి కుస్తీ బరి (లేదా) చర్చావేదిక అని అర్థం. ఈ ఆశ్రమాలు... సన్యాసులు, సంతులు, నాగ సాధువులకు ఆశ్రయం కల్పిస్తాయి. ఈ ఆఖాడాలు నాగ సాధువుల సమూహంగా చెప్పబడతాయి. 

కుంభమేళా లేదా ఇతర మతపరమైన కార్యక్రమాలు జరిగినప్పుడు మాత్రమే దర్శనమిచ్చే నాగ సాధువులు, అఘోరీ సాధువులు కుంభమేళాకు గల మరో ప్రత్యేకత. వారు లేకుండా కుంభమేళాలను అసలు ఊహించలేము. వీరు భవిష్యత్ తరాలకు భారతీయ సంస్కృతి-సాంప్రదాయాలను తెలియజేసే వారధులుగా పనిచేస్తారు. వీరిలో మహిళా సాధువులు మరియు అఘోరీలు కూడా ఉంటారు. కానీ వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. 

ఆదిశంకరులు హిందూ ధర్మం & ఆలయాలపై ఇతర మతాలవారు జరుపుతున్న దాడులను గమనించి, ఆ దాడులను అడ్డుకోవడానికి కేవలం శాస్త్ర విద్య మాత్రమే సరిపోదని; సనాతన ధర్మ పరిరక్షణకు శస్త్ర, అస్త్ర విద్యలు కూడా అవసరమని భావించి, వారు ప్రవేశ పెట్టిన దశనామి సంప్రదాయాల నుంచి వచ్చిన శస్త్రధారి,అస్త్రధారి నుండి పుట్టుకొచ్చినవే ఈ అఖాడాలు. 

శస్త్రధారులు - వీరు హిందూ గ్రంథాలను, సాంప్రదాయాలను రక్షిస్తూ ఉంటారు.
అస్త్రధారులు - వీరు శస్త్ర విద్యను అభ్యసించి, సనాతన ధర్మాన్ని రక్షించే మిలిటరీగా పనిచేస్తారు. వీరు కేవలం చేతులు,కర్రలతోనే పోరాటాలు చేస్తారు.అందుకే వీరి చేతుల్లో దండాలు కనిపిస్తుంటాయి. కత్తి, త్రిశూలం తదితర ఆయుధాలను ఎలా వాడాలో వీరికి బాగా తెలుసు. 

2019 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 13 అఖాడాలు ఉన్నాయి. వీటిలో ఏడింటిని ఆది శంకరులు స్థాపించారు. ఈ 13 అఖాడాలు వారి వారి సాంప్రదాయ పరంపరను కొనసాగిస్తాయి. వీటిలో.... 
* 7 శైవ అఖాడాలు (వీరు శివుడిని ఆరాధిస్తారు),
* 3 వైష్ణవ/బైరాగి అఖాడాలు (వీరు విష్ణు మూర్తిని కొలుస్తారు),
* మిగతా 3 ఉదాసిన్ అఖాడాలు (వీరు గురునానక్ పెద్ద కుమారుడు అయిన శ్రీ చంద్ బోధనలను అనుసరిస్తారు) ఉంటాయి.
* అలాగే వీటితో పాటు ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేకంగా 'కిన్నెర అఖాడా' ఏర్పాటు చేయబడింది. 

వీటిలో ఆది శంకరులు స్థాపించిన జూనా అఖాడా అతి పెద్దది. కిన్నెర అఖాడా దీని పరిధిలోనే వుంటుంది. 

కుంభమేళా జరిగే ప్రదేశంలో ఈ అఖాడాల కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి; ఉచిత భోజన & వసతి సదుపాయాలు కల్పిస్తారు. సాధు సంతులందరూ కలిసి తమ తమ ధర్మ ధ్వజాలను గాల్లో ఎగురవేస్తూ చేసే నగర ప్రవేశంతో కుంభమేళాలు ఆరంభమవుతాయి. నగర ప్రజలందరూ ఈ అద్భుతమైన శోభాయాత్రను వీక్షిస్తారు. ఆ ధర్మ ధ్వజాలను తమ శిబిరాలలో 72 అడుగుల ఎత్తులో స్థాపన చేస్తారు. ఆ ధర్మ ధ్వజాలన్నీ గాలిలో ఎగురుతూ, భక్తులకు గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి.
వీరు కొన్ని రోజుల పాటు ఆ శిబిరాల్లో ఉండి; కుంభమేళాలోని కొన్ని ప్రత్యేక ఆచార,వ్యవహారాల్లో పాల్గొంటూ; ధర్మ పరిరక్షణ పై ఉపన్యాసాలు, చర్చలు జరుపుతుంటారు. 

కొత్తగా సన్యాస దీక్ష తీసుకోవాలనుకునే వారికి కుంభమేళా అనేది ప్రత్యేకమైన సమయం కాబట్టి, వారు అక్కడి శిబిరాల్లో ఉన్న.... కొన్ని ఏళ్ల పాటు కఠోర తపస్సు చేసి, అసాధారణ ఆధ్యాత్మిక అభ్యాసాలకు ప్రసిద్ధి చెందిన, వివిధ హోదాల్లో గల గురు సాధువుల సమక్షంలో దీక్ష తీసుకొని, సన్యాస జీవితానికి నాంది పలుకుతారు. 

హిందూ మతంలో ఒక వ్యక్తి మరణాంతరం మాత్రమే పిండ ప్రదానం చేస్తారు. కానీ అఖాడాలో సన్యాస దీక్ష తీసుకోవాలంటే, వారు ముందుగా తమకు తామే పిండప్రదానం చేసుకోవలసి ఉంటుంది. ఈ ప్రక్రియతో వారు... వారి పూర్వీకుల రుణం నుండి, సామాజిక బంధాలు - బాధ్యతల నుండి పూర్తిగా విముక్తి చెందుతారని ఇది తప్పనిసరిగా చేయిస్తారు. 

అఖాడాల్లో చేరేవారికి తాత్కాలిక, శాశ్వత సన్యాస దీక్షలను అందించే సాంప్రదాయం ఉంది. కొత్తవారిని అఖాడాలో చేర్చుకునే ముందు, వారికి మొదట తాత్కాలిక సన్యాస దీక్షను అందిస్తారు. ఈ దీక్షను ఇచ్చేముందు సదరు వ్యక్తికి సన్యాసిగా జీవించే లక్షణాలు ఉన్నాయా/లేవా అని అన్ని రకాలుగా పరీక్షించి, అప్పుడు దీక్షను ఇస్తారు. ఆ తాత్కాలిక దీక్షలో వారు తగిన క్రమశిక్షణ చూపకపోతే వారిని అఖాడాలో చేర్చుకోరు. అదే సమయంలో సదరు సాధకుడికి సన్యాసి జీవితాన్ని గడిపే లక్షణాలు ఉన్నాయని నిర్ధారణ అయితే... వారికి కుంభమేళా సమయంలోనే శాశ్వత/సంపూర్ణ సన్యాస దీక్షను ఇస్తారు. 

సన్యాస అఖాడాల్లో వారి వారి స్వంత చట్టాలు ఉంటాయి. అందులో కఠిన నియమాలు పాటించాల్సి వుంటుంది. సభ్యులు ఎవరైనా ఆ నియమాలను అతిక్రమించినట్లయితే శిక్షలతో పాటు, కొన్నిసార్లు అఖాడాల నుంచి బహిష్కరణ వేటు తప్పదు. 

సాధకులు, ఇతర సాధుసంతులు... అక్కడి గురువుల నుండి జ్ఞాన సముపార్జన చేస్తారు. జ్ఞాన సాధన ద్వారా మోక్ష సాధన జరుగుతుందని, మానవ జన్మకు గమ్యం మోక్షమేనని, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ కుంభమేళాలు మంచి అవకాశమని వీరు భావిస్తారు. 

వీటన్నింటినీ చూస్తే అక్కడ జరిగేది జ్ఞాన కుంభ్ ని తలపిస్తుంది. కావున భక్తులందరూ కూడా పుణ్యస్నానాలు ఆచరించడం,ఇతర కార్యక్రమాలతో పాటు ప్రఖ్యాత సాధువులు మరియు గురువులు నిర్వహించే సత్సంగాలలో పాల్గొని... ధర్మ పరిరక్షణ; జనన,మరణ చక్రాలు; విముక్తి - మోక్షం మరియు ఇతర అంశాలపై వారు చేసే ప్రసంగాలు కూడా విని, వారి వద్ద నుండి జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. 

కుంభమేళా అనంతరం వివిధ అఖాడాల్లోని నాగ సాధువులందరూ, వారి నిష్క్రమణకి సూచనగా ధర్మ ధ్వజాలను అవనతం చేసి; వివిధ ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకుంటూ... వారి వారి ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోతారు. 

వివాదాస్పద వ్యక్తులను అఖాడాల్లో చేర్చుకోవడం;
అఖాడాల్లోని కొందరు హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతూ వారి పదవులను దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శల వల్ల ఈ అఖాడాల  ప్రతిష్ట మసక బారుతుంది. 

ప్రస్తుతం జరుగుతున్న మహా కుంభమేళాలో కొన్ని వేలమంది సాధుసంతులు, నాగ & అఘోరీ సాధువులు పాల్గొన్నారు. 

 నాగసాధువులు, అఘోరా సాధువుల గురించి : 

చాలా మందిలో సాధువులన్నా, సన్యాసులన్నా ఒక రకమైన చులకన భావం ఉంటుంది.
వారి కుటుంబ స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు బాగాలేకనో; సంసారిక జీవితంపై విరక్తితోనో లేదా చదువు పెద్దగా ఒంట బట్టని వారో, బ్రతకటం తెలియక & సంపాదించడం చేత కాని వారో సన్యాసం తీసుకుంటారని అనుకుంటారు.
కానీ ఇది పూర్తిగా వాస్తవం కాదని, వివిధ అఖాడాల్లో ఉన్న, ఉన్నత విద్యను అభ్యసించిన సాధువులను చూస్తే అర్థమవుతుంది. కొన్ని అఖాడాల్లోని సాధువుల్లో సాధారణ వ్యక్తులతో పాటు.... ప్రొఫెసర్లు, వైద్యులు, ఇంజినీర్లు, వివిధ రంగాల్లోని నిపుణులు ఉన్నారు.
ఇది వినడానికి ఒకింత ఆశ్చర్యం కలిగించినా కానీ నిజం. వారి వారి వ్యక్తిగత, వృత్తి జీవితాల్లో విజయవంతంగా సేవలందించి, తర్వాత సన్యాసాశ్రమంలో అడుగుపెట్టిన వారే స్వయంగా మీడియా ముఖంగా ఈ విషయాలను పంచుకోవడం జరిగింది. 

భౌతిక జీవనంలో వుండి సమాజసేవ చేసినప్పటికినీ, ప్రాపంచిక విషయాల పట్ల కోరిక వుంటుందని; కానీ ఈ ఆధ్యాత్మిక(సన్యాసం) మార్గం ద్వారా ఎలాంటి  స్వలాభాపేక్ష లేకుండా సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా దేశానికి, సమాజానికి ఇంకా ఎక్కువ సేవ చేయవచ్చునని వారు తెలిపారు. 

అంతే కాకుండా ఈ అఖాడాల్లో యువత సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. 
నిత్య సంఘర్షణల మయం అయిన మానవ జీవితాల్లో రోజురోజుకీ పెరుగుతున్న ఒత్తిళ్ళు, మానసిక అశాంతి కారణంగా... బంధాలు, బంధుత్వాలు, బాధ్యతలు భారమై, ప్రశాంత జీవనం కోసం సన్యాసిగా మారడమే సరైన మార్గమని భావించి... యువత కూడా సన్యాసం వైపు అడుగులు వేస్తున్నారు. 

ప్రస్తుతం జరుగుతున్న మహా కుంభమేళా-2025 లో మౌని అమావాస్య రోజున దాదాపు 20 వేలకు పైగా యువతీ యువకులు వివిధ అఖాడాల్లో సాధువులుగా దీక్షలు చేపట్టి, సన్యాసం తీసుకున్నారని; వారిలో దాదాపు 7 వేలకు పైగా మహిళలే ఉన్నారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీరిలో ఎక్కువమంది ఉన్నత చదువులు చదివి, మంచి వేతనాలతో పని చేస్తున్న వారే. 

సాధువులుగా మారే వాళ్లలో కేవలం హిందువులే కాక, ఇతర మతాలవారు మరియు విదేశీ యువత కూడా ఎక్కువ సంఖ్యలో ఉంది. 

ఈ ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టడం, అందులో కొనసాగడం అంత సులభం కాదని; ప్రాపంచిక సుఖాలను త్యజించే తెగువ, ధైర్యము కావాలని...వివిధ అఖాడాలకు చెందిన సాధువులు చెబుతున్నారు. 

వేరే సమయాల్లో ఎప్పుడూ పెద్దగా కనిపించని సాధు సంతులు, నాగ & అఘోరీ సాధువులు కుంభమేళా వంటి ప్రత్యేక సమయాల్లో మాత్రం తప్పక ప్రత్యక్షమవుతారు. వారంతా కలిసి, అప్పటివరకు వారు చేసిన సాధనలు, సంపాదించిన జ్ఞానము, తమ ఆలోచనలు మొదలైన వాటిని మిగతా సాధువులతో పంచుకోవడం; వాటిపై చర్చలు- విశ్లేషణలు జరపడం, సనాతన ధర్మం పై ఉపన్యాసాలు ఇవ్వడం వంటివి చేస్తారు. ఈ విధంగా వారు కూడా ఇతర సాధువుల నుండి జ్ఞాన సముపార్జన చేసి, కుంభమేళా తర్వాత తమ ప్రదేశాలకు తిరిగి వెళ్ళిపోతారు. 

సాధారణంగా చూడటానికి ఒకేలా కనిపించినా, నాగ సాధువులు మరియు అఘోరి సాధువుల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. వారి జీవనశైలి, వస్త్రధారణ, ఆచార వ్యవహారాలు.... విచిత్రంగానూ, ప్రత్యేకంగానూ ఉంటాయి.

 వారి మధ్య గల కొన్ని వ్యత్యాసాలు: 

1.నాగ సాధువులు చాలా మంది హిమాలయాలు, దట్టమైన అడవులు,కొండలు,గుహలు వంటి నిశ్శబ్ధ, ఏకాంత ప్రదేశాల్లో వుంటూ; వారి సమయాన్ని కఠోరమైన తపస్సు, ధ్యానంలో మరియు మతపరమైన బోధనలు చేయడంలో గడుపుతుంటారు. 

కొంత మంది నాగ సాధువులు కాశీ, హరిద్వార్, ఉజ్జయిని మరియు ఇతర పుణ్యక్షేత్రాలలో నివసిస్తూ & మరికొందరు భారతదేశమంతటా ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తూ, మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొంటారు. 

ఆధ్యాత్మిక, సనాతన ధర్మాన్ని రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు కాబట్టి వీరిని 'హిందూ మత రక్షకులు' గా పరిగణిస్తారు. 

అఘోరీ సాధువులు స్మశాన వాటికలు, హిమాలయాలు, ఇతర రహస్య ప్రదేశాలలో నివసిస్తూ కఠినమైన తపస్సు చేస్తారు. 

2.నాగసాధువులు కావాలంటే 12 సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేయాలి.
అఘోరాలు మోక్ష సాధనకై, కఠినమైన పద్ధతిలో జీవితాంతం తపస్సు చేస్తూనే ఉంటారు. 

3.నాగ సాధువులు - క్రమశిక్షణతో, వ్యవస్థీకృత జీవితాన్ని గడుపుతారు. 
అఘోరాలు - వామాచార పద్ధతి అంటే మంత్ర-తంత్ర సాధన; దశమహావిద్యలు, క్షుద్రం అభ్యసిస్తారు. స్మశాన వాటికలో నివసిస్తూ, శవాలపై కూర్చుని ధ్యానం చేస్తారు. అక్కడ తంత్ర సాధనలు చేసే సమయంలో కఠినమైన సవాళ్ళను ఎదుర్కొంటారు. 

4.నాగ సాధువులు - మాంసాహరం, మద్యం సేవించరు. సాత్వికాహారాన్ని తీసుకుంటారు.
అఘోరాలు - మాంసాహారంతో పాటు, జంతువుల పచ్చి మాంసాన్ని, సగం కాలిన శవాలను బయటకు తీసి ఆహారంగా భుజించటం వంటివి చేస్తారు. 

5.నాగ సాధువులు - కొందరు ఎముకలు కొరికే చలిలోనూ నూలుపోగైనా ధరించక, ఆకాశాన్ని తమ దుస్తులుగా భావిస్తూ, దిగంబరులుగా ఉంటారు. వీరిని 'తపోధనుల'ని అంటారు.
మరికొందరు కాషాయ రంగులో ఉండే ఏక వస్త్రాన్ని ధరిస్తారు.
మహిళా సాధువులు తప్పకుండా కాషాయ ఏక వస్త్రాన్ని శరీరంలోని కొంత భాగానికి చుట్టుకుంటారు. 

అఘోరాలు - చాలా వరకు నగ్నంగా ఉంటారు, కొంతమంది నల్లని బట్టలు ధరిస్తారు. 

6.నాగ సాధువులకు - భస్మం(బూడిద), చందనం, చిన్న కాషాయ బట్ట, కాళ్లకు ధరించేందుకు వెండి (లేదా) ఐరన్ కడియాలు, కుంకుమ, ఉంగరం, పంచకేశ్ (పంచతత్వానికి చిహ్నంగా జడవేసిన జట్టును ఐదుసార్లు చుట్టడం), పూల దండ, చేతుల్లో పటకారు వంటి ఆయుధం, కమండలం, ఢమరుకం, జడలు, తిలకం, మసి బొట్టు, విభూతి, రుద్రాక్ష, చేతిలో జపమాల వంటి 17 అలంకారాలు ఉంటాయి. 

అఘోరాలకు ఎలాంటి అలంకారాలు ఉండవు. వీరు శరీరంపై చితా భస్మం(కాలిన శవాల బూడిద), మెడలో రుద్రాక్ష మాల, మానవ పుర్రెలతో అత్యంత భయానకంగా ఉంటారు. అయితే ఇవి అలంకారానికి సంబంధించినవి కావు.
వీరి వేషధారణతో పాటు, ప్రవర్తన కూడా భీతిగొల్పే విధంగా ఉంటుంది.
మానవ పుర్రెలను ఆహార పాత్రలుగా ఉపయోగిస్తారు. పుర్రె అనేది వారి భక్తికి, ప్రాపంచిక అనుబంధాల నుండి నిర్లిప్తతకు చిహ్నంగా మరియు జనన మరణాల చక్రం గురించి వారికి గుర్తు చేస్తూ వుంటుంది. 

7.నాగసాధువులు - తమ జీవితాంతం బ్రహ్మచర్య నియమాన్ని పాటిస్తారు.
అఘోరాలకు - బ్రహ్మచర్య నియమాలు ఉండవు. 

 వీరి మధ్య ఉన్న సారూప్యతలను గమనిస్తే.... నాగ & అఘోరీ సాధువులిద్దరూ శివుడి ఆరాధకులే.అయితే నాగసాధువులు శివుని ఏకాంత రూపాన్ని ఆరాధిస్తే; అఘోరాలు కాలభైరవ స్వరూపాన్ని ఆరాధిస్తారు. వీరిద్దరూ అనునిత్యం శివనామ స్మరణలో కాలం గడుపుతారు.
అఘోరాలు శివుడితోపాటు, దత్తాత్రేయుడిని & మాతా పార్వతీ స్వరూపమైన తారా దేవిని కూడా పూజిస్తారు. మరియు గురువు అనుమతి, పర్యవేక్షణ లేకుండా వీరిద్దరూ ఏ పని చేయరు. 

ఎన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికినీ, నాగ & అఘోరా సాధువులిద్దరి జీవితం కష్టంగా ఉంటుంది.
 ప్రయాగలో జరిగే  మాఘమేళాలు & కుంభమేళాలను 'ప్రయాగ్ రాజ్ మేళా అథారిటీ (PMA)' నిర్వహిస్తుంది. ఇది 2017 లో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడినది. 

45 రోజుల పాటు సాగే ఈ మహాకుంభమేళా - 2025 కి, 45 రోజుల్లో 45 కోట్ల(450 మిలియన్ల) మంది సందర్శకులు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ ఆ అంచనాను తలక్రిందులు చేస్తూ, నెలరోజుల్లోనే 45 కోట్ల మంది భక్తులు ఇందులో పాల్గొని, నదీస్నానాలు ఆచరించారని; 11 ఫిబ్రవరి 2025 వ తేదీ వరకు గల గణాంకాలు చెప్తున్నాయి. దానితో ఈ మహా కుంభమేళా-2025 "ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం" గా చరిత్రలో నిలిచిపోయింది.
ఇదే విషయాన్ని వివిధ దేశాల ప్రముఖ టి.వి. ఛానళ్ళు కూడా ప్రస్తావించాయి. 

అదేవిధంగా ఈ మహా కుంభమేళా - 2025 "ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్" గా మరో రికార్డును సొంతం చేసుకుంది. ఇసుక వేస్తే రాలనంత భక్తులు,యాత్రికులతో రహదారులు కిక్కిరిసిపోవడంతో దాదాపు 300 కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. 

2019 లో ప్రయాగలో జరిగిన కుంభమేళాలో ప్రయాగ్ రాజ్ మేళా అథారిటీ (PMA) 3 విభాగాల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డు లను నెలకొల్పింది. 
అవి:
 1."అతి పెద్ద పారిశుద్ధ్య డ్రైవ్" - (స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమ ప్రచారంలో భాగంగా); 

 2."అతి పెద్ద హ్యాండ్ పెయింటింగ్ థీమ్" - 'పెయింట్ మై సిటీ' కార్యక్రమంలో భాగంగా దాదాపు 8 వేల మంది వ్యక్తుల చేతి నమూనాలతో, 8 గంటల్లో 'జై గంగే' అనే
కుడ్యచిత్రాన్ని రూపొందించారు. అది ప్రపంచంలోనే అతిపెద్ద చిత్రంగా నమోదు అయింది.
గతంలో 4500 కు పైగా వ్యక్తులు పాల్గొన్న, దక్షిణ కొరియా పేరిట వున్న రికార్డును ఇది బద్ధలు కొట్టింది. 

 3."బస్సుల అతిపెద్ద కవాతు" -  కుంభమేళా లోగోతో ఉన్న 503 బస్సులను ప్రయాగ్ రాజ్ లో ఒకేసారి ప్రారంభించి, ఒకేసారి 3.2 కిలో మీటర్ల పాటు నడిపించారు. ఈ పరేడ్ ను కుంభమేళా సమయంలో అక్కడి రవాణా వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందని ప్రదర్శించడానికి... ప్రయాగ్ రాజ్ మేళా అథారిటీ మరియు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు కలిసి నిర్వహించాయి.
గతంలో అబుదాబి నెలకొల్పిన రికార్డు(390 బస్సులు) ను ఇది చెరిపివేసింది. 

2017లో, భారతీయులు అత్యంత పవిత్రంగా భావించే ప్రయోగ్ రాజ్ లో జరిగే కుంభమేళాను... యునెస్కో(UNESCO) - ప్రపంచ వారసత్వ సంస్కృతి జాబితా లో చేర్చింది. కోట్లాది మంది భక్తులు హాజరయ్యే ఈ కుంభమేళాకు వారసత్వ సంస్కృతి హోదా కల్పించడం సరైందేనని; అంతేకాకుండా ప్రపంచంలో శాంతి సామరస్యాలతో జరిగే అతి పెద్ద యాత్రికుల సమ్మేళనంగా దీనిని అభివర్ణించింది. 

ప్రయాగ్ రాజ్ లో జరగుతున్న ఈ మహా కుంభమేళా - 2025 కి అధిక భక్తుల తాకిడిని ఉద్దేశించి, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడానికి భారతప్రభుత్వం 98 ప్రత్యేక రైళ్ళను నడిపిస్తుంది. 

ఈ కార్యక్రమాన్ని సజావుగా జరపడానికి మరియు భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయాలు
కల్పించడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆధునిక సాంకేతికత & అధునాతన హంగులతో అన్ని రకాల చర్యలు చేపట్టింది. 

ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమ తీరంలో దాదాపు 1,60,000 టెంట్లు; 1,50,000 టాయిలెట్లు మరియు తాత్కాలిక ఆసుపత్రులతో 4 వేల హెక్టార్ల విస్తీర్ణంలో
 'అతిపెద్ద తాత్కాలిక టెంట్ సిటీ' ను నిర్మించారు. అచట చిన్న ఆపరేషన్ల నుండి....పెద్ద సర్జరీలు చేయడానికి ఆధునిక వైద్య సౌకర్యాలతో కూడిన ప్రతీ విభాగం ఏర్పాటు చేయడంతో పాటు, దేశంలోని ఎంతోమంది వివిధ వైద్య రంగ నిపుణుల (స్పెషలిస్టులు)ను మరియు 133 అంబులెన్స్‌లు (125- జనరల్ అంబులెన్స్ లు; 7- రివర్ అంబులెన్స్ లు)ను ప్రభుత్వం అక్కడ సిద్ధం చేసింది. 

వీటితో పాటు భక్తులకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలను అందించడానికి మరియు ఆరోగ్య అత్యయిక పరిస్థితులు (మెడికల్ ఎమర్జెన్సీలు) ను ఎదుర్కోవడానికి ప్రయాగలోని వివిధ ఆసుపత్రులు మరియు 200 యూనిట్ల బ్లడ్ బ్యాంకులను అందుబాటులో ఉంచింది. 

మహాకుంభమేళా జరుగుతున్న ప్రదేశంలో వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ కదలికలను; ఎంట్రీ పాయింట్లు, స్నానపు ప్రదేశాలు & ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో జరుగుతున్న కార్యకలాపాలు & భద్రతను పర్యవేక్షించడానికి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(AI) ఆధారిత నిఘా వ్యవస్థతో కూడిన 2700 కి పైగా CC కెమెరాలు & డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు; వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన వార్ రూమ్స్ లో భద్రతా సిబ్బందిని నియమించింది. 

వీరితో పాటు క్షేత్ర స్థాయిలో 40,000 మంది పోలీసు బలగాలను మోహరించింది. భక్తుల రద్దీ ఎక్కువయినపుడు ఎలాంటి ప్రమాదాలు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా మరియు ఎలాంటి భద్రతా సవాళ్ళు ఎదురవకుండా వార్ రూమ్ సిబ్బంది, ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి భద్రతా సిబ్బందికి సూచనలు చేస్తూ, అప్రమత్తం చేస్తారు. 

నదీ తీరాలను పర్యవేక్షించడానికి మొదటిసారిగా నీటి అడుగున డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నారు. 

ప్రపంచమంతా తరలి వస్తున్న, మహా కుంభమేళా - 2025 జరుగుతున్న ప్రయాగ్ రాజ్ నగరానికి.... దీనితో పాటు, ఎన్నో ఆధ్యాత్మిక మరియు చారిత్రాత్మక విశిష్టతలు ఉన్నాయి. 

ప్రయాగ అంటే సంగమం అని, ప్రయాగ్ రాజ్ అంటే సంగమాలకు రాజు అని పేర్కొంటారు.
ఇది భారతదేశంలోని అత్యంత పవిత్రమైన తీర్థయాత్ర కేంద్రంగా పరిగణించబడటంతో, దీనిని "తీర్థరాజ్" అని కూడా పిలుస్తారు. 

భూలోక ధామంగా ప్రసిద్ధి చెందిన ప్రయాగకి, కుంభమేళా లేని సమయంలో కూడా పవిత్ర త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించడానికి భక్తులు ఏడాది పొడవునా తరలివస్తుంటారు.
నదీ తీరం నుండి త్రివేణి సంగమ(3 నదులు కలిసే) ప్రదేశంలో చెక్కలతో ఏర్పాటు చేసిన ప్లాట్ ఫామ్ ల వద్దకి పడవల్లో చేరుకొని, అచట కుంభ స్నానాలు ఆచరిస్తారు. గంగానది నీరు స్పష్టమైన రంగులో, యమునా నది నీరు ఆకుపచ్చ రంగులో ఉంటాయి; సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. 

ఇక్కడి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం మోక్షదాయమే కాక; దానివల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్యాన్ని పొందుతారని, ఇక్కడ చేసే దానధర్మాల వలన మామూలు కంటే ఎక్కువ రెట్ల పుణ్య ఫలం లభిస్తుందని, మరియు పితృకార్యాలు నిర్వహిస్తే పితృదేవతలకు ఉత్తమ గతులు లభిస్తాయని, వంశాభివృద్ధి జరుగుతుందని నమ్మకం. 

హిందూ పురాణాల ప్రకారం, సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ ప్రదేశంలో అనేక యాగాలు చేయడం వలన ఈ ప్రాంతానికి 'ప్రయాగ' అనే పేరు వచ్చిందని, ఆ తర్వాత 1584లో అప్పటి మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్..... ప్రయాగను 'ఇలహాబాద్' (అంటే అల్లా నివాసించే ప్రదేశం) గా పేరు మార్చగా, చివరకు బ్రిటిషు వారు ఉచ్చారణ సౌలభ్యం కోసం 'అలహాబాద్' అని పిలవడం ప్రారంభించారని చారిత్రక సమాచారం. తర్వాత 2018లో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అలహాబాద్ ను 'ప్రయాగ్ రాజ్' గా పేరు మార్చడం జరిగింది. 

1887లో స్థాపించబడిన అలహాబాద్ విశ్వవిద్యాలయం భారతదేశంలోని నాలుగవ పురాతన మరియు అత్యుత్తమ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా పేరుగాంచింది. ఒకప్పుడు దీనిని "ఆక్స్ ఫర్డ్ ఆఫ్ ఈస్ట్" గా పిలిచేవారు. 

అలహాబాద్ (ఇప్పటి ప్రయాగ్ రాజ్) నగరానికి "ప్రధాన మంత్రుల నగరం" అన్న ఖ్యాతి ఉంది. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, గుల్జారీ లాల్ నందా, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్ మొదలైన ప్రముఖులంతా అలహాబాద్ వాసులే. 

2011 గణాంకాల ప్రకారం, ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో అలహాబాద్ 40 వ స్థానంలో నిలిచింది. 

ఇలాంటి మరెన్నో ప్రత్యేకతలను ఈ ప్రదేశం సొంతం చేసుకుంది. 

 కుంభమేళాకు హాజరయ్యే వారు పవిత్ర స్నానాలు ఆచరించడంతోపాటు; సంగమ సమీపంలో గల ఆలయాలను, ప్రయాగలోని వివిధ పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తుంటారు. 
వాటిలో ముఖ్యమైనవి : 

 1.అలహాబాద్ కోట : త్రివేణి సంగమ సమీపంలో గల ఈ కోటను 16 వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి అక్చర్ కట్టించాడు. మొఘలుల శిల్ప కళా శైలిని ఈ కోటలో మనం చూడవచ్చు. ఈ కోట ప్రాంగణంలో ప్రసిద్ధి చెందిన పాతాల్ పురీ ఆలయం; అక్షయావట్ అనే అతి పురాతన, పవిత్రమైన మర్రి చెట్టు ఉంటాయి. 

 2.బడే హనుమాన్ ఆలయం : 
గంగా నది ఒడ్డున గల ఈ ఆలయంలో హనుమంతుడు భూమి ఉపరితలం నుండి కనీసం 6 అడుగుల దిగువన మరియు 20 అడుగుల పొడవుతో శయన భంగిమలో దర్శనం ఇస్తాడు. 

 3.మాధవేశ్వరి/అలోపి దేవి ఆలయం : 
ఇది అష్టాదశ (18) శక్తి పీఠాలలో పద్నాలుగవది. ఈ ఆలయంలో ఏ దేవతా విగ్రహం ఉండదు. ఇది విగ్రహారాధన లేని ఏకైక శక్తి పీఠం. విగ్రహానికి బదులుగా, సాధారణంగా దేవతను ప్రతిష్టించే ప్రదేశం పైన చెక్క తో చేసినటువంటి ఒక ఊయల(డోలి) వేలాడుతూ ఉంటుంది. ఆ ఊయలలో అమ్మవారు అదృశ్యరూపంలో ఉంటుందని అక్కడి ప్రజల విశ్వాసం. 

 4.నాగవాసుకి ఆలయం : 
హిందూ పురాణ గ్రంథాల ప్రకారం, క్షీరసాగర మథనం అనే అద్భుతమైన ఘట్టంలో పాలకడలిని చిలకడానికి తాడుగా ఉపయోగపడ్డ సర్పాల రాజు వాసుకి, చిలికే క్రమంలో కలిగిన గాయాల నుంచి ఉపశమనం పొందడానికి, శ్రీ మహావిష్ణువు సూచన మేరకు ప్రయాగ్ రాజ్ వెళ్ళి అక్కడి చల్లని సరస్వతీ నదిలో సేదదీరుతాడు.
కోలుకొని తిరిగి వెళ్ళే క్రమంలో అక్కడి దేవతలు, మానసపుత్రులు, ఋషులు... ఆయనను శాశ్వతంగా అక్కడే వుండాలని విజ్ఞప్తి చేయగా, ఆయన కొన్ని షరతుల మేర అంగీకరించడంతో, ఆయన పేరున ఈ ఆలయాన్ని నిర్మించారని ప్రతీతి. మహా కుంభమేళా - 2025 సందర్భంగా ఈ ఆలయ జీర్ణోద్ధరణ జరిగింది. 

 5.ఆదిశంకర విమాన మండపం : 
130 అడుగుల ఎతైన ఈ ఆలయం శ్రీ ఆది శంకరాచార్యుల వారి జ్ఞాపకార్థంగా నిర్మింపబడింది. దీనిని దక్షిణ భారత శైలిలో నిర్మించారు. ఈ ఆలయం పైఅంతస్తుల నుండి త్రివేణి సంగమ అందమైన దృశ్యం కనిపిస్తుంది. 

 6.దశాశ్వమేధ ఘాట్ లో గంగా హారతి : 
ఈ ఘాట్ లో సాయంత్రం జరిగే గంగా హారతి భక్తులను మంత్రముగ్ధులను చేయడమే కాకుండా, అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది . 

 7.తేలియాడే రెస్టారెంటు : 
గంగానదిలో తేలియాడే రెస్టారెంటు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. గంగా నదిలో పడవ ప్రయాణం, ఆ పడవలో కూర్చొని భోజనం, అలాగే అందులో నుండి గంగానది ఒడ్డున జరిగే కార్యక్రమాలను వీక్షించడం వంటివి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. 

 8.అలహాబాద్ మ్యూజియం : 
సుందరమైన చంద్రశేఖర్ ఆజాద్ పార్కులో గల ఈ మ్యూజియంలో ప్రయాగ్ రాజ్ సాంస్కృతిక వారసత్వాన్ని భద్రపరిచారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వివిధ గ్యాలరీలను దర్శించి, ఎన్నో శాస్త్రీయ అంశాలను తెలుసుకోవచ్చు. ఇది సౌర విద్యుత్తుతో నడుస్తున్న & విద్యుత్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించిన దేశంలోనే మొట్టమొదటి మ్యూజియం. 

 9.ఆనంద్ భవన్ : 
ఇది భారతదేశ మొదటి ప్రధానమంత్రి శ్రీ. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి అధికారిక నివాసం. దీన్ని మ్యూజియంగా మార్చి, దేశ స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన ఆనవాళ్లను ఇక్కడ ఉంచారు. 

పైన పేర్కొన్న వాటితో పాటు, మరెన్నో ఆలయాలు మరియు చారిత్రక ప్రదేశాలతో....ప్రయాగ్ రాజ్... అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానాల (ఇంటర్నేషనల్ ట్రావెల్ డెస్టినేషన్స్) లలో ఒకటిగా పేరొందింది. 

కుంభమేళాకు వెళ్ళే వ్యక్తులు వారి & వారి కుటుంబ సభ్యుల భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 

భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల తప్పిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కావున అక్కడికి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు (లేదా) ఏదైనా గుర్తింపు కార్డును తమ వెంట ఉంచుకోవాలి. పిల్లలకు, పెద్దలకు వారి కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచాలి. వారు గనుక ఒకవేళ తప్పిపోయినట్లయితే... వారి క్షేమ సమాచారాన్ని, వారి కుటుంబ సభ్యులకు అందించడానికి అక్కడి భద్రతా సిబ్బందికి సులువవుతుంది. 

నదిలో స్నానాలు ఆచరించే సమయంలో, అక్కడ ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను దాటి లోనికి వెళ్ళడం శ్రేయస్కరం కాదు. మరియు ఆ సమయంలో అక్కడ జన సమూహం ఎక్కువగా ఉన్నట్లయితే, కొంచెం దూరంగా వెళ్ళి రద్దీ లేని ప్రాంతాల్లో స్నానాలు ఆచరించడం ఉత్తమం. 

దారి కోసం గూగుల్ మ్యాప్స్ & వాతావరణ పరిస్థితులను భారత వాతావరణ శాఖ (ఐఎండీ - ఇండియా మెటియొరలాజికల్ డిపార్టుమెంటు) వారి వెదర్ అప్ డేట్స్ ద్వారా తెలుసుకోవచ్చు. 

అక్కడే బస చేయాలనుకునే వారు ముందుగానే టెంట్/ రూమ్/కాటేజ్‌ లను బుక్ చేసుకోవాలి. చలికాలం కావడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. 

భారీ జన సమూహం కారణంగా - నదీ తీరం చేరుకోవడానికి, స్నానాలు ఆచరించడానికి, ఇతర ప్రదేశాలను సందర్శించడానికి చాలా సమయం పట్టొచ్చు. కావున వాటర్ బాటిళ్లు, ఆహార పదార్థాలను తమ వెంట ఉంచుకోవడంతో పాటు; శానిటైజర్, మాస్క్‌లను తప్పనిసరిగా వాడాలి. 

మోసాలు, దొంగతనాలు జరిగే అవకాశం వుంటుంది కాబట్టి మన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. 

నాగసాధువులు... భజనలు, నృత్యాలు చేస్తూ చేసే ఊరేగింపులప్పుడు మరియు ఇతర ముఖ్యమైన రోజుల్లో భక్తులు తాకిడి ఎక్కువగా ఉండి, తొక్కిసలాటలు జరిగే ప్రమాదం ఉంటుంది. 

కుంభమేళాల సమయంలో ఉండే అత్యధిక భక్తుల రద్దీ & నియంత్రణ లోపం కారణంగా అనేక సందర్భాల్లో తొక్కిసలాటలు జరిగి ఎంతో మంది మరణించగా, మరెంతో మంది గాయపడ్డారు. 

స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారిగా, 1954లో  ప్రయాగలో జరిగిన కుంభమేళా సమయంలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 1000 మంది చనిపోయారు. ఇది కుంభమేళా చరిత్రలో అత్యంత ఘోరమైన జన సమూహ విపత్తులలో ఒకటిగా మిగిలిపోయింది.
2003 నాసిక్ కుంభమేళాలో 39 మంది, 2010 హరిద్వార్ కుంభమేళాలో 10 మంది, 2013 ప్రయాగలో జరిగిన కుంభమేళా సమయంలో అలహాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 36 మంది మరణించారు. 

ప్రస్తుతం ప్రయాగలో జరుగుతున్న మహా కుంభమేళా లో మౌని అమావాస్య అనే ముఖ్యమైన రోజున అమృతస్నానం కోసం జనం ఎగబడటంతో తొక్కిసలాట జరిగి దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోగా, 90 మంది వరకు గాయపడ్డారు. 

రోజు రోజుకి పెరుగుతున్న భక్తజన సందోహం వలన ఇలాంటి దుర్ఘటనలు మరలా జరిగే అవకాశం వున్నందున, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి, వచ్చిన కార్యక్రమాలను పూర్తి చేసుకొని, తమ తమ ప్రాంతాలకు క్షేమంగా తిరిగి చేరుకోవాలి.
అలా ఈ అద్భుతమైన యాత్రను సురక్షితంగా పూర్తి చేసుకోవాలి. 

ఇలాంటి యాత్రలకు వెళ్ళలేని వారు కుంభమేళా జరుగుతున్న ప్రదేశాన్ని, దాని యెుక్క విశిష్టతను స్మరించుకొని.....ఆ నదీమ తల్లులకు  ప్రణామాలు అర్పిస్తే సరిపోతుంది. 

144 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ

విశ్వ వేడుక
కు ప్రత్యక్షంగా వెళ్ళలేకపోయినా, ప్రసార మాధ్యమాల ద్వారా అయినా చూసి తరించే మహదవకాశం కలిగినందుకు సంతోషించాలి. ఈ అవకాశం కూడా చాలామందికి తమ జీవితకాలంలో లభించకపోవచ్చు. 

ఇంతటి మహత్తరమైన వేడుకలు & సంస్కృతి, సాంప్రదాయాలకు వేదిక అయిన 'భరతభూమి' లో పుట్టిన ప్రతి జీవి జన్మ ధన్యమే అని భావిస్తూ...... ముగిస్తున్నాను.
కామెంట్‌లు
prasadklv చెప్పారు…
చాలా బాగుంది.విపులంగా వివరణ ఇచ్చారు.మంచి వ్యాసం.అభినందనలు మీకు.
Srigiri Nilayam చెప్పారు…
చాలా వివరంగా చెప్పారు. ధన్యవాదాలు !!