అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కాలనీ అంతా నిశ్శబ్దంగా ఉంది.
వీధులన్నీ నిర్మానుషమయ్యాయి
బిక్కు బిక్కు మంటూ వెలుగులు నీడలను
అనుసరిస్తున్నాయి
ఎక్కడో ఒక కుక్క అరుపు బావి లోతుల్లో
కన్నా మెల్లగా వినిపిస్తోంది
వేసవి వేడి సెగలను తట్టుకోలేని భూమి ఆ ప్రదేశాన్ని
నిప్పుల కుంపటి చేసింది ....
వీధి మలుపు నుంచి వచ్చిన ఒక కారు హెడ్ లైట్స్ తో రోడ్డంతా వెలుగు మాయమైంది ..
కారు ఒక ఇంటి ముందు ఆగింది... అందులోనుంచి ఒక
అమ్మాయి అలసిపోయినా కూడా ముఖంలో ఏదో ఎక్సైట్ మెంట్ .పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళి ఒక నెల రోజుల సెలవు మీద ఇండియాకు వచ్చింది ఆ అమ్మాయి.చాలా రోజుల తర్వాత తన కుటుంబ సభ్యులను కలుస్తున్నానన్న ఉత్సుకతతో కారు దిగింది.అమ్మ చేతితో అన్నం తినాలని కోరిక.నాన్నతో ఎన్నో విషయాలు మాట్లాడే అవకాశం కలిగిందన్న ఆనందం.తమ్ముడు,చెల్లెలుతో చీర్ అప్ కావచ్చన్న ఆశ... ఇవన్నీ ఆ అమ్మాయి అలసటను మటుమాయం చేసాయి.కాలింగ్ బెల్ ని మెల్లగా తన ముని వేళ్ళతో తాకింది.కొన్ని నిమిషాలు నిశ్శబ్దం....ఆ తరువాత ఇంటి మేయిన్ డోర్ తెరుచుకుంది. ఎదురుగా అమ్మ.... అమ్మా... అంటూ గట్టిగా అరుస్తూ కౌగిలించుకుంది అమ్మకు క్షణం పాటు అర్థం కాలేదు...
నిద్ర మబ్బు ఒక్కసారిగా తొలగిపోయి,అయేమయ స్ధితిలో తన ముందున్నది తన గారాల కూతురు అనీ
తెలుసుకొని కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు ఆ తల్లికి... ఒక్క
క్షణం కాలం స్తంభించి పోయింది.ఇద్దరి బుజాలు కన్నీటి
తడితో తడిచిపోయాయి.ప్రేమ, సంతోషం..రెండూ కన్నీళ్ళై ఇద్దరి కళ్ళల్లో నుంచి ప్రవహిస్తున్నాయి.పది నిమిషాలు గడిచాయి.నాన్న ఎక్కడ అని అడిగింది.. అమ్మాయి..పైన రూంలో పడుకున్నాడమ్మా.... అంది అమ్మ..అది డూప్లెక్స్ ఇల్లు.. మెల్లగా మెట్లెక్కి పైకి ఎక్కారు తల్లీ కూతుళ్ళు బెడ్ రూం డోర్ తీసి లైట్ వేసారు నాన్న అంటూ ఆ కూతురు నాన్నను లేపింది.హటాత్తుగా నిద్ర లేచి కళ్ళెదురుగా కన్న బిడ్డను చూసిన ఆనందంలో షాక్ కి గురయ్యాడు.బిడ్డ అంటూ అరుస్తూ కింద పడిపోయాడు..ఆ తర్వాత ఈ కుటుంబ సభ్యుల ఆందోళన..భయం..టెన్షన్..అటు తర్వాత ఇంటి ముందు అంబులెన్స్ ...ఆ తర్వాత హాస్పిటల్.. డాక్టర్లు స్ట్రోక్ అని నిర్ధారణ ..గుండె వాల్వ్ కి స్టెంట్..... కట్ చేస్తే....
వైవాహిక జీవితం సమస్యలో పడింది.
ఒక్కగానొక్క కూతురుని పెంచి పెద్ద చేయాలి...ఎలా
అనుకుంటా తాను ప్రైవేటు స్కూల్లో చేసుకుంటూ పై చదువులు చదువుకుంది.ఇప్పుడు తాను ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకుంది.తన కూతురిని ఇంజనీరింగ్ వరకు మంచి కాలేజీలో చదివించింది.కూతురికి పై చదువులకు కోసం విదేశాలకు వెళ్ళాలన్న కోరిక..ఆ విషయం అమ్మకు చెప్పింది.ఆ తల్లికి బయటకు పంపించే ఉద్దేశ్యం లేదు.ఎందుకంటే తాను లేకుంటే ఉండలేదు.తూర్పున సూర్యుడు ఉదయించే సమయం నుండి రాత్రి పడుకునేంత వరకు తన కూతురు కోసమే తను జీవితం అంకితం.ప్రతి క్షణం తన కూతురు గురించి ఆలోచిస్తూ,తనతో వీలయినంత ఎక్కువ సమయం గడుపుతూ తన మిగిలిన జీవితానికి ఒక అర్థం వెతుక్కుంటూ ఉంది ఆ తల్లి.అయినా గారాల కూతురు పట్టుపడుతుందని అమెరికాకు పంపింది పై చదువుల కోసం,కూతురిని క్షణం విడిచి ఉండలేదు ఆ తల్లి,
తన కోసమే బతుకుతుంది.తెలివిలో తనను మించిన
కూతురిని చూసి గర్వపడుతుంది.కష్టపడి తన సంపాదన
తో కాంప్రమైజ్ కాకుండా బిడ్డను చదివించింది.అదే
కష్టంతో బిడ్డను పై చదువుల కోసం విదేశాలకు పంపించింది.భర్తతో విడిపోయి పదిహేను సంవత్సరాలు
అయ్యింది.విడాకులు వచ్చిన నెల లోపలనే అతడు ఇంకో
పెళ్ళి చేసుకున్నాడు.కానీ ఆ అవకాశం ఆమెకు లేదు.
భార్యతో విడాకులు తీసుకున్నా,భార్య చనిపోయినా భర్త
వెంటనే పెళ్ళి చేసుకుంటాడు.ఆ ఆప్షన్ భార్యకు లేదు.
ఇంకో పెళ్ళి చేసుకునే స్వేచ్చ లేకపోవడం ఇంకా సమాజంలో ఉంది.అంటే భర్త మాత్రం అన్నీ మర్చిపోయి
రెండో పెళ్లి చేసుకోవచ్చు కానీ భార్య మాత్రం అతని జ్ఞాపకాలతో శేష జీవితాన్ని గడపాలని సమాజం చెపుతుంది.ఒక్క పెళ్లితోనే జన్మకు సరిపడా అనుభవాలు
వచ్చినాయి.అమ్మో .. మళ్లీ పెళ్ళా..అంటూ భయపడే వాళ్ళు కూడా ఉన్నారు.ఉధ్యోగం చేసుకుంటా ఒంటరి, స్వేచ్ఛా జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతున్న వాళ్ళూ చాలా మంది ఉన్నారు....
బిడ్డను విదేశాలకు పంపింది కానీ ఆ తల్లి
బిడ్డ జ్ఞాపకాల్లో నిత్యం మునిగి తేలుతుంది.క్లాసు రూంలో
పిల్లలకు పాఠాలు కూడా చెప్పలేకపోతుంది.క్లాసు అయిపోయాక ఏదో పరధ్యానం, ఒంటరి తనం తనని వేధిస్తుంది.భర్తతో విడాకులు అయ్యాక ఇలాంటి ఫీలింగ్
కలుగలేదు కానీ, సంవత్సరం క్రితం బిడ్డను అమెరికాకు
పంపినప్పటి నుంచి తాను ఉండలేకపోతుంది.అదే కదా..
తల్లి ప్రేమ.ఆ రోజు కూడా క్లాస్ అయిపోయాక స్కూలు గ్రౌండ్లో ఎండకు కుర్చీ వేసుకుని కూర్చుంది.దూరంగా పిల్లలు గ్రౌండ్లో ఆడుకుంటున్నారు.బిడ్డ ఫోన్ చేసి రెండురోజులు అయ్యింది.ఏదో ప్రాజెక్ట్ ఉందటా నన్ను డిస్టర్బ్ చేయకు మమ్మీ అని చెప్పింది.ఏదో వివరించలేనీ
బాధ మనసును తొలుస్తుంది... ఆలోచిస్తూ పరధ్యానంగా
శూన్యంలోకి చూస్తూ కూర్చుంది.కారు ఒకటి స్కూల్లోకి
వస్తుంది.ఈ మధ్య గురుకుల పాఠశాలల్లో అధికారుల
ఆకస్మిక తనిఖీలు ఎక్కువైయ్యాయి.వాళ్ళెవరైనా వచ్చారేమోననీ కుర్చీ నుంచి లేచి నిల్చుంది.కారు డోర్
తెరుచుకుంది...బ్లూ కలర్ జీన్స్ వైట్ కలర్ టాప్ వేసుకున్న ఒక అమ్మాయి కిందికి దిగింది.ఆ అమ్మాయి నడుచుకుంటూ తన వైపు వస్తుంది...మసకమసకగా ఉంది..ఆ అమ్మాయి ముఖం పోల్చుకోలేక పోతుంది.
తన వైపే వచ్చి ముందు నిలబడి కొంచెం దూరంలో నిలబడి చేతులు కట్టుకొని చూస్తూ తన వైపే చూస్తుంది.
ఒక్క క్షణం గాలి స్తంభించింది.పంచభూతాలు తమ తమ పనులను నిలిపివేసాయి.ఉలిక్కిపడి పరధ్యానం నుంచి
బాహ్య ప్రపంచానికి వచ్చింది, గాలి ఒక్క సారిగా ముఖాన్ని చెంప చెళ్లుమనిపించింది.ఎదురుగా బిడ్డ...
వావ్... బిడ్డ ... నువ్వేనా... నాకు అర్ధం కావట్లేదు..
ఇక్కడ నువ్వేంటి బేటా.. అంటూ అరుస్తూ గట్టిగా పట్టుకొని హత్తుకుంది.మమ్మీ అంటూ బిడ్డ ఏడుస్తుంది..
అమ్మ హృదయం అప్పటికే నీరైపోయింది.దాని ఫలితం
కళ్ళల్లో కన్నీళ్లు.. బిడ్డను గట్టిగా హత్తుకొని ఏడుస్తుంది.
గ్రౌండ్లో ఆడుకుంటున్న పిల్లలు చుట్టూ ఈగల్లా మూగారు.
అక్కడి పరిస్థితి అర్థం కాక చేష్టలుడిగి చూస్తున్నారు.
ప్రిన్సిపాల్ మిగితా స్టాఫ్ అక్కడేదో జరుగుతుందనీ హుటాహుటిన గ్రౌండ్ కి చేరుకున్నారు.... మేడమ్ మా అమ్మాయి యూఎస్ లో ఎంఎస్ కోసం వెళ్ళింది.సెలవు
మీద ఇండియాకు వచ్చింది.సడన్ సర్ప్రైజ్... నాకు కూడా
తెలియదు తాను వస్తున్నట్లు.. అంటూ అందరికీ పాఠం ఒప్పజెప్పినట్లు పరిచయం చేసింది.టీచర్లు, పిల్లలు అందరూ సంతోషంగా కొట్టిన చప్పట్లతో ఆ ప్రదేశమంతా మార్మోగిపోయింది.తనను తాకిన ఆ చప్పట్ల శబ్దానికి ఆకాశం ఉలిక్కిపడింది.నిండు గర్భిణిలుగా ఉన్న మబ్బులు వర్షించడానికి సన్నద్దం అయ్యాయి.కారు
బయలుదేరింది.పక్కన తన భుజం మీద తల వాల్చి కూతురు.ఆనందంతో తల్లి మనసు జెట్ స్పీడ్ తో గగనాన
విహరిస్తుంది.కారు వంద స్పీడుతో హైదరాబాద్ వైపుకు పరుగులు పెడుతుంది.చాలా సేపటి తర్వాత వర్షం తాలూకు మట్టి వాసన తల్లీబిడ్డలను నిద్ర పుచ్చింది....
కట్ చేస్తే....
ఉదయం అయిదు గంటలకు అలారం పెట్టుకున్నాను.ఎందుకంటే తర్వాత రోజు ఉదయం జగిత్యాల ఊరికి పోవాలి.ఆక్కడి నుంచి కరీం నగర్ వెళ్ళాలి.మొత్తం మూడు రోజుల క్యాంప్.హైదరాబాద్ నుంచి బస్సులో అయిదు గంటలు,కారులో నాలుగు గంటల జర్నీ.ముందు రోజు రాత్రి అలారం పెట్టుకొని పడుకున్నాను నిద్ర పట్టింది.సరిగ్గా నాలుగు గంటలకు ఎవరో డోర్ కొడుతున్నారు.సడెన్ గా మెలుకువ వచ్చింది.లేచి టైం చూసాను.ఉదయం నాలుగైయ్యింది.ఈ టైంలో ఎవరు అనుకుంటూ డోర్ తెరిచాను.ఆశ్చర్యం...
నాన్న అంటూ నా పెద్ద బిడ్డ వచ్చి నన్ను గట్టిగా పట్టుకుంది.కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరిగాయి.రెండు సంవత్సరాలు అయ్యింది బిడ్డను చూసి,ఎంఎస్ కోసం యూకే వెళ్ళింది...మాటలు రావడం లేదు.....కొంచెం
సేపు వరకు అర్థం కాని పరిస్థితి.గట్టిగా ఏడ్వలేని స్థితి.
సంతోషం,బాధ ..రెండూ కలిసి ఆనంద భాష్పాలై ముఖాన్ని తడిపేసాయి.కాస్తా స్థిమితపడి, బిడ్డను నా పక్కన కూర్చోబెట్టుకుని కొంచెం సేపు అలాగే చూస్తూ ఉండిపోయాను.బిడ్డ మాట్లాడుతూనే ఉంది.బిడ్డ మాట్లాడుతుంటే చూడ ముచ్చటగా ఉంటుంది.గుక్క
తిప్పుకోకుండా నవ్వుతూ తాను మాట్లాడుతుంటే విన సొంపుగా ఉంటుంది.నా ఇద్దరు బిడ్డలు నా బంగారాలు.
వాళ్ళ కోసమే ఈ నా జీవితం... ఉద్యోగ ధర్మం.....
ఏడు గంటలకు కారులో జగిత్యాలకు బయలు దేరాను...
ఉషోదయపు కిరణాలు కొత్తగా కనిపిస్తున్నాయి....
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి