సునంద భాషితం :- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయములు-763
అంకోల బీజ న్యాయము
******
అంకోల అనగా ఊడుగ చెట్టు. బీజము అనగా విత్తనము,మూలము అనే అర్థాలు ఉన్నాయి.
అంకోల బీజానికి అంకోల చెట్టుకు ఉన్న ప్రత్యేకతను గురించి ఈ న్యాయము చెబుతోంది.
ఈ అంకోల చెట్టు లేదా ఊడుగ చెట్టు గురించి చదువుతుంటే "ఇది నిజమా! ఏమిటీ!ఈ సృష్టి విచిత్రం!" అనిపిస్తుంది.దీనిని మన పూర్వీకులు గమనించి ఓ న్యాయముగా చెప్పడం చూస్తుంటే వారి నిశిత పరిశీలనకు జేజేలు పలుకుతూ వినమ్రంగా చేతులు జోడిస్తాం.
ఇంతగా ఆకట్టుకునే , ఆశ్చర్య పరిచే అంకోల లేదా ఊడుగ చెట్టు గురించి తెలుసుకుందాం.
 
ఈ అంకోల చెట్టు ఓ విచిత్రమైన స్వభావం కలిగి ఉంటుందట.ఈ చెట్టు కాయలు బాగా పండి కింద పడి పోతాయి.సహజంగా ఏ చెట్టు కాయలైనా పండిన తర్వాత తొడిమ ఊడి కింద పడి పోవడమనేది మనందరికీ తెలిసిందే.
అలాగే ఈ అంకోల చెట్టు కాయలు కూడా అలాగే పండిన తరువాత కింద పడి పోతాయి.ఇక్కడే ఓ విశేషం వుంది.అదేమిటంటే  క్రింద పడివున్న కాయల గింజలు లేదా విత్తనాలు ఉరుములు మెరుపులు వచ్చిన సమయంలో  (అది కూడా ఆరుద్ర నక్షత్రం  రోజున వచ్చే ఉరుములు మెరుపులకు మాత్రమే) వెళ్ళి మళ్లీ చెట్టుకు అతుక్కు పోతాయట.అదండీ ఈ అంకోల చెట్టు విత్తనాల యొక్క ప్రత్యేకతట.
మరో విచిత్రం ఏమిటంటే కొన్ని సమయాల్లో అనగా ఉరుములు మెరుపులు  వచ్చినప్పుడు ఆ గింజలు ఒకదాని వెనుక ఒకటి చీమల బారులా పాకుతూ దూరంగా వెళ్తాయట.
ఇంకో  విశేషం ఏమిటంటే ఈ అంకోల గింజల తైలాన్ని రెండు రాళ్ళకు పూసి దగ్గరగా పెడితే అవి రెండూ ఒకదానికొకటి కొట్టుకుంటాయట( ఈ వింతలూ ,విశేషాలూ పెద్ద వాళ్ళు చెబుతుంటే నా చిన్నప్పుడు వినడం జరిగింది).
అలాగే గూగుల్ లో ఈ అంకోల చెట్టుకు సంబంధించిన సమాచారం వెదుకుతూ ఉంటే కనబడింది. చదువుతుంటే చాలా ఆశ్చర్యం కలిగింది.భలే వింతగా కూడా అనిపించింది.
వింతలూ,విశేషాలకన్నా  మించిన ప్రాముఖ్యత ఆయుర్వేదంలో ఈ అంకోల చెట్టుకూ , దాని విత్తనాలకూ ఉంది.ఈ చెట్టు యొక్క వేర్లు, పండ్లు, విత్తనాలను ఉపయోగించి ఆయుర్వేదంలో మందులను తయారు చేస్తారు.మూత్ర సంబంధిత రుగ్మతలు, జ్వరము, రక్తస్రావము, పిచ్చి కుక్క కాటు,కండ్ల కలకలు మొదలైన వ్యాధుల నివారణకు వీటిని ఔషధంగా ఉపయోగిస్తారు.
ఈ అంకోల లేదా ఊడుగ చెట్లలో మూడు రకాల చెట్లు ఉన్నాయి.అవి తెల్ల ఊడుగ,నల్ల ఊడుగ,ఎర్ర ఊడుగ అనే రకాలు ఉన్నాయి.దీనిలో నల్ల ఊడుగ చెట్టు చాలా అరుదుగా ఉంటుందట.ఆ చెట్టు విత్తనాలకే మహిమలు ఉన్నాయని అంటుంటారు.
రాలిన విత్తనాలు మళ్ళీ చెట్టుకు అతుక్కోవడాన్ని ఉదహరిస్తూ భగవంతునికి భక్తునికి మధ్య ఉండవలసిన భక్తిపరమైన అనుబంధం ఈ విధంగా వుండాలని  దానిని" అంకోల బీజ న్యాయము" ద్వారా గ్రహించవచ్చని మన పెద్దలు, ఆధ్యాత్మిక వాదులు చెబుతుంటారు.
  ఇదే విషయాన్ని ఆది శంకరాచార్యులు శివానందలహరిలో ప్రస్తావించడం విశేషం. మరి ఈ అంకోల బీజానికి సంబంధించి ప్రస్తావించిన శ్లోకాన్ని  చూద్దామా.
"అంకోలం నిజ బీజ సంతతి రసయస్కాంతోపలం సూచికా/సాధ్వీ నైజ విభుం లతా క్షితి రుహం సింధు స్సరిద్వల్లభమ్/ప్రాప్నోతి యథా తథా పశుపతేః పాదారవింద ద్వయం/చేతో వృత్తి రుపేత్య తిష్టతి సదా సా భక్తి రిత్యుచ్చతే!!"
అనగా ఊడుగ చెట్టు విత్తనాలు కింద రాలి మళ్ళీ చెట్టునే చేరునట్లు,సూది సూదంటురాయిని/అయస్కాంతాన్ని అంటుకున్నట్లు,పతివ్రత తన భర్తను వదలకుండా ఉండునట్లు, నదులు సముద్రమును చేరినట్లు భక్తుని మనసు భగవంతుని పాదములనే అంటిపెట్టుకుని ఉండటాన్ని భక్తి అంటారు.
అలాంటి భక్తియే తల్లి శిశువును కాపాడినట్లుగా  భక్తుని కాపాడుతుందని వారు చెప్పారు.
 ఇదే కాకుండా ఈ ఊడుగ  చెట్టు గురించి  పూర్వం పల్లెటూరి స్త్రీలు , జానపదులు పాడుకునే  వాళ్ళు. వారు తమ పిల్లలను ఊడుగు చెట్టుకు ఉయ్యాల గట్టి,ఆ ఉయ్యాలలో పసిబిడ్డను పడుకోబెట్టి "ఊడిగ చెట్టుకు ఉయ్యాల గట్టి/ఊపమని మీ అమ్మ ఊరు తిరిగొచ్చు" అంటూ జోలపాట పాడేవారట. 
మొత్తంగా ఈ న్యాయము ద్వారా భగవంతుడు భక్తుడికి మధ్య ఉండాల్సిన బంధం గురించే కాకుండా చెట్టు  యొక్క విత్తనాల మహిమ గురించి, జానపదుల జీవితాలకు ఈ చెట్టుతో గల అనుబంధం గురించి తెలుసుకోగలిగాం.
మనము కూడా "అంకోల బీజము "వలె పని అనే దైవానికి నిరంతరం అతుక్కుని పోవాలి. నిరంతర మంచి పనుల సాధనను సాటి మానవులే కాదు ఆ భగవంతుడు కూడా మెచ్చుకుంటాడు.మన శ్రమైక జీవితాన్ని చూసి, మనలోని భక్తికి మెచ్చి   తల్లిలా సంరక్షిస్తాడు.ఇదండీ! అంకోల బీజ న్యాయములోని అంతరార్థం.

కామెంట్‌లు