చిన్నప్పటి జ్ఞాపకాలు :- భైరగోని రామచంద్రముల- చరవాణి :9848518597

అమ్మ చంకనుండి కిందికి దిగితే 
నాన్న చేయి పట్టుకొని నడిపించిన జ్ఞాపకాలు గుర్తొస్తున్నవి.

అమ్మ ఇంట్లో ఏదైనా చేసిన 
అంగడి నుండి ఏదైనా కొనుకొచ్చిన 
పొలం దగ్గర నుండి ఏ కాయో పండో తెచ్చిన 
అక్కలతో కొట్లాడి ఎక్కువ గుంజుకొని తిన్న జ్ఞాపకాలు గుర్తొస్తున్నవి.

చిన్నప్పుడే రెండు పిలక జుట్లేసుకొని 
అక్కతో కలిసి పలక బలపం పట్టుకొని 
బడికి పోయిన దినములు 
పలక పట్టుకొని మా సత్తయ్య సార్ 
మా ధర్మయ్య సార్ దిద్ధించిన 
ఓనమాలు ఇప్పటికి గురుతొస్తున్నవి.

బడికి పోయేటప్పుడు మా అవ్వ ఆటాన రూపాయి ఇస్తే 
పిప్పరమెట్లు చక్కర గోళీలు కొనుక్కొని చప్పరించినవి 
గురుతోస్తున్నవి.

ఉన్న ఊరిలో ఏడు చదివి 
పక్క ఊరిలో పది వరకు 
చదువుటకు వెళ్లిన 
మా దోస్తులతో గడిపిన రోజులు 
నన్ను నా తెలుగు గురువు 
కమలాకర్ గారు చదువులో
ప్రోత్సహించినది గురుతోస్తున్నవి.

బడి లేనప్పుడు బావి దగ్గరకు పోయి 
పొలం పనులు చేసినది 
బర్రెలు కాసినది 
మామిడి ఈత సిలుపక్కపండ్లు తెచ్చుకొని తిన్నది 
ఊరిలో చిందుభాగోతం చిరుత ల రామాయణం ఆడుతుంటే 
కాల్చిన చింత గింజలు బఠానీలు తినుకుంటు చూసిన 
రోజులు గురుతోస్తున్నవి.

ఎండాకాలం వచ్చిందంటే ఎనీల వెలుగులో పిల్లలంత కలిసి 
ఆడిన అష్టచెమ్మ పులిజూదము దొంగ పోలీస్ ఆటలు 
అరుగుల మీద కూర్చోపెట్టుకొని అమ్మమ్మలు తాతమ్మలు చెప్పిన పంచతంత్రం చందమామ పరమానందయ్య బుద్దుని జాతక కథలు గురుతోస్తున్నవి.

ఉన్నత చదువులు చదివి 
ఉద్యోగంలోకి వచ్చిన 
భూమి సూర్యుని చుట్టూ తిరిగినట్లు 
నా మనస్సు చిన్ననాటి జ్ఞాపకాల చుట్టూ తిరుగుతున్నది.

=============================================
భైరగోని రామచంద్రముల-  చరవాణి :9848518597.
స్కూల్ అసిస్టెంట్, తెలుగు 
ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రాజ్ భవన్, సోమాజిగూడ,
హైదరాబాద్, 500041.

కామెంట్‌లు