అందరూ బాగున్నారా పిల్లలు.నా పేరు ఎడ్లబండి. ఇప్పటి పిల్లలకు ఎడ్లబండి అంటే ఏమిటో తెలియదు మరీ! అందుకే నేను నా గురించి ఒక సారి తెలియజేద్దామని మీ ముందుకు వచ్చాను.
నా గురించి వింటారు కదా! పిల్లలు. సరే! మరి. మాట్లాడుకుందాము. ప్రకృతిలో అనేక రకాల చెట్లు ఉంటాయి కదా! వాటిలో ఒక రకమైన చెట్టు తుమ్మచెట్టు.తుమ్మచెట్టు గురించి కూడా రెండు మాటలు మీకు చెపుతాను పిల్లలు.
తుమ్మచెట్టు చాలా గుబురుగా ఉంటుంది దాని పువ్వులు పసిడి వర్ణంలో ఉంటాయి తెలుసా!. తుమ్మకాయలను మీ అమ్మలు, తాతలు, నాన్నలు చిన్న తనంలో కాళ్ళకు గజ్జెలుగా కట్టుకొని సంతోషంగా ఎగిరేవాళ్లు, ఆడుకునేవాళ్ళు. ఈ తుమ్మకాయలు వెండి వర్ణంలో ఉంటాయి పిల్లలు.
ఈ విధంగా ప్రాణం ఉన్న తుమ్మచెట్టును వడ్రంగి వాళ్ళు నరికి వేసి కొన్ని రోజులు కర్రను ఎండబెట్టి నన్ను (బండి )తయారు చేశారు. ప్రాణం ఉన్న చెట్టును నరికి వేయడం నాకు చాలా బాధగా ఉంది. అయినప్పటికీ వ్యవసాయం చేసేవారికి చాలా అవసరాలు తీరుస్తున్నాను. కాబట్టి అప్పటి నుండి నాకు కొంచెం బాధ తగ్గింది.
నన్ను రైతులు ఏవిదంగా ఉపయోగించుకుంటున్నారంటే పెండను పొలంలో వేయడానికి అంటే వ్యవసాయ పొలానికి, భూమికి ఎరువులు చేరవేయడానికి, పండిన ధాన్యాన్ని ఇంటికి చేరవేయడానికి, మార్కెట్ కు తీసుకెళ్లడానికి నన్ను ఉపయోగిస్తారు.
అయ్యో! పిల్లలు మీకు ఒక విషయం చెప్పడం మరిచిపోయాను. రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో నన్ను ఒక వాహనంగా ఉపయోగించుకున్నారు. పల్లె ప్రజలు మరియు పట్నం ప్రజలు కూడా నన్ను ఉపయోగించుకున్నారు.
పిల్లలు ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పడం మరిచిపోయాను. ఎడ్లు జంతువులలో ఒక రకమైన జంతువులు. ఎడ్లను పొలం దున్నడానికి ఉపయోగిస్తారు. అలాగే ఒక వాహనం నడవాలంటే ఇప్పుడు మనం పెట్రోలు డీజిల్ ఏ విదంగా ఉపయోగిస్తున్నామో ఆ విధంగా ఎడ్లను నేను (బండి )నడవడానికి ఉపయోగించుకున్నాను. అందుకే ఎడ్లకు బండికి అవినాభావ సంబంధము ఉంది. అందుకే నన్ను ఎడ్ల బండి అంటారు.
ఆ రోజుల్లో చిన్న పిల్లలు ఎడ్లబండి ఎక్కటానికి చాలా సంతోషంగా ఉండేవారు. పట్నం నుండి ఎవరైనా బంధువులు ఎడ్లబండిలో వస్తున్నారంటే ఎదురుగా వెళ్ళి పిల్లలు సంభరంగా
ఉండేటోళ్ళు.
అరేరే... ఇంకొక విషయం మీతో చెప్పడం మరిచిపోయాను. ధనవంతుల పిల్లలను ఎడ్లబండిలోనే ఆ రోజుల్లో బడికి పంపేవారు.మన మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావును చిన్న తనములో బడికి పంపడానికి నన్నే (బండి )వాడుకున్నారు.
ఈ విధంగా నన్ను పేద నుండి ధనవంతుల వరకు నా సేవలు ఉపయోగించుకున్నారు.ఈ మధ్యకాలంలో పెట్రోల్ డీజిల్ తో నడిచే వాహనాలు వచ్చి నా వినియోగము తగ్గించుకున్నారు. గ్రామాలలో ఇప్పటికి నన్ను (ఎడ్లబండిని ) ఉపయోగించుకునేవాళ్ళు ఉన్నారు.
పిల్లలు నా గురించి తెలుసు కున్నారు కదా! ఇక సెలవు మరీ! ఉంటాను.
సర్వే జన సుఖినో భవంతు
======================================
భైరగోని రామచంద్రము :-చరవాణి :9848518597.
స్కూల్ అసిస్టెంట్, తెలుగు
ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రాజ్ భవన్, సోమాజిగూడ,
హైదరాబాద్, 500041.
ఎడ్లబండి ( స్వగతం ): - భైరగోని రామచంద్రము :-చరవాణి :9848518597.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి