నీడల చెట్టు:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871
కొన్ని  
మనిషి పోలిక లోబతుకు చెట్లు
మరికొన్ని మనిషికే మార్గదర్శి 

పక్క పక్కనే ఎంత చక్కగా
రెపరెపలాడు చెట్టు
రోజూ చూసే కనుల,మనసులేని మాటగ
నిలిచే

బహుశా
శిల పాటగా మారుతుందేమో కానీ
నవ నాగరికతలో  
ఏకాకి సమూహం, సమూహ ఒంటరి 
ఆకుపచ్చ గాలి స్వేచ్ఛ 

కానీ
చిత్రంలో చిత్రం చెట్టు కలిమిడి
ఉపకారం దాహంతీర్చే స్వచ్ఛమైన నీరు
పరోపకారం సేదదేర చల్లని నీడ
మనిషికి నేర్పే జీవధార
ఎండకూ వానకూ ఎండీతడిసి 
క్షుద్బాధ దీర్చే జీవద్భాష దాని పేరు 

మాట ఏ గొంతులోదో గాని
చెట్టు 
నీతో రోజూ కలిపిన కూనిరాగం 
ఇప్పుడు పూడుకున్న స్వరం
పచ్చివెలక్కాయ ఎక్కెక్కి ఏడ్చే అనాధ

చెట్టు దైనందిన జీవ బోధిని
మనిషి ఆగ్రహ కుఠారం వేటు
నేలవాలిన దయామయి గీతం

ప్రజ్వలిత వెన్నెల నీవే నెలపై
నీడా ఆకలిదప్పిక నీవే
నీ కొమ్మలగాలి సోకకుండా 
బతుకు తెల్లారదు నాకు 
వడ చల్లగుండదు 
అదే అతడు
కనిపించీ కనిపించని అసలు మనిషి


కామెంట్‌లు