జనహిత సంగీతం:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871
అది 
భావోద్వేగాలను లిఖించే ఆలోచన
దృశ్యాదృశ్యాల నడుమ 
క్రోడీకరించే వలయపరావలయం
కలాలెన్నో కదిలే నక్షత్రశాల కవిత
ఏ వాక్యం రాసినా
పుష్పించే తీరొక్క పువ్వు
దాని వాసన తిరిగే గాలి 
వికసితభావంలో అభివ్యక్తిలో కొత్తదనం
వస్తువూ దాని ప్రతిక్షేపం 
ముడిసరుకుల తొలిచే అందమైన
నగసిగలేలె మృగనయన 

చారలు మెరిసే జంబుకం
నటనల తేల
కాదది నిజ శార్దూలం 
కంచూ కనకం వర్ణమొకటి
గొంతుల ధ్వని పోలదుగా 

శక్తిమీర వదిలిన శరం 
లక్షించే గమ్యం ఒకటైన 
రక్షించే గమన అంచుల డ్రోన్ అక్షరం
 
ఏ మిషతో రాసేదైన కవిత్వం తృప్తిజీవనం
చుట్టూ అక్షర పహరాలో హమేషా
సామాజిక వీణ మీటిన
ప్రజా సంతృప్త ద్రావణం తడి అది
ఎలుగెత్తే పరమాణువు 
పుటం చెక్కే సాధారణ వేళ్ళదే మానవీయ కవిత్వం

ఓహో అహాలే కల్పించే అపోహదారి 
తాత్కాలికంగా నిన్నెత్తే జాకీలు
కానీ
అవి నిలబడని జాడలే! 
కాలంలో క్రీనీడలే!!
తత్వబోధ నేత్రంలో కనిపించని లోపలి దృశ్యంలో కవిత్వం
ఛేదించే నవీన సూత్రయజ్ఞమే 

మనసునూ గుండెనూపట్టి
తట్టే ఉద్వేగ ఉద్దీపన 
సామూహిక సామాజిక మహిత హిత తాత్విక రెక్కల చప్పుడే కవిత్వం 
ఒకానొక అంతర్మథనం చిలికే 
అపూర్వ సాహసోపేత అక్షరలయ

====================================

(నేడు ప్రపంచ పోయెట్రీ డే సందర్భంగా)

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Great expression on poetry, great concept and organised style. Salutes to the poet. & publishers