కుందేలు తెలివి ఎలుకల సాయం...:- --- కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి- 9441561655
  అడవిలో పక్షులతో పాటు వివిధ రకాల జంతువులు నివసించేవి. అందులో ఒక తెలివైన కుందేలు ఉండేది. అది అన్ని జంతువులతో పాటు ఎలుకలతో కూడా స్నేహంగా ఉండేది. ప్రతిరోజు   కుందేలు ఎలుకలు కలిసి ఆడుకునేవి. ఇలా కొంతకాలం గడిచింది.
       అదే అడవిలో  జిత్తుల మారి నక్క  కూడా ఉండేది. దానికి బద్ధకం ఎక్కువ. కష్టపడకుండానే ఆహారం సంపాదించాలని కోరిక ఉండేది . సులువైన మార్గం ఆలోచించింది. కుందేళ్లు నివసించే ప్రాంతానికి చేరుకుంది. రాత్రిపూట వచ్చి రోజుకొక కుందేలును ఆహారం గా తినడం మొదలుపెట్టింది. నానాటికి కుందేళ్ళ సంఖ్య తగ్గుతున్న విషయం తెలివైన కుందేలు గ్రహించింది. ఎలాగైనా నక్క ఆలోచనకు అడ్డుకట్ట వేయాలని అనుకుంది.
      ఒక రోజున తమ స్నేహితులైన ఎలుకలతో మీటింగ్ పెట్టింది. నక్క చేస్తున్న మోసాన్ని వివరించింది. "నక్క బారి నుంచి కాపాడడానికి సహాయం చేయాలి" అని కోరింది. "ఏ సహాయమైనా చేస్తాం" అని         ఎలుకలన్నీ అన్నాయి . ఎలుకల సహాయంతో తను నివసించే ఇంటి చుట్టూ వెడల్పు  కలిగిన గొయ్యిని తవ్వించింది . దానిపైన కట్టెపుల్లలు, ఆకులతో  కనబడకుండా కప్పించింది. ఇక ఆరోజు రాత్రి కుందేలు భయపడకుండా నిశ్చింతగా నిద్ర పోయింది.
       నక్క ప్రతిరోజు లాగానే ఆహారం కోసం బయలుదేరింది. కుందేలు నివసించే ఇంటి దగ్గరకు చేరుకుంది. ఒక్కసారిగా నక్క ఇంట్లోకి దూరేందుకు ప్రయత్నించింది. ఇంకేముంది   వగల మారి నక్క దబాల్న గోతిలో పడిపోయింది. నక్క ఎన్ని అరుపులు అరిచినా  కాపాడే దిక్కు లేక   గోతిలోనే చచ్చిపోయింది.  తెల్లారిన తర్వాత కుందేలు  నక్క చనిపోయిన విషయాన్ని చూసింది. నక్క పీడ విరగడ అయినందుకు  సంతోషించింది. ఆపద సమయంలో సహాయం చేసిన  ఎలుకలకు కుందేలు కృతజ్ఞత  తెలిపింది.
           

కామెంట్‌లు