బీట్రిక్స్ పాటర్: - - యామిజాల జగదీశ్


 "ది టేల్ ఆఫ్ పీటర్ రాబిట్" రచనతో బీట్రిక్స్ పాటర్, ఆంగ్ల సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్నారు‌. ఆమె రచయిత్రి మాత్రమే కాదు. బొమ్మలు కూడా వేసేవారు. 
బీట్రిక్స్ పాటర్ కు చిన్నప్పటి నుంచే  జంతువులన్నా ప్రకృతి అన్నా వల్ల మాలిన ప్రేమ. ఆమె తన సోదరుడితో కలిసి అధ్యయనం చేసి గీసిన చిత్రాలనేకం. 
1902లో, ఆమె రాసిన "ది టేల్ ఆఫ్ పీటర్ రాబిట్" విశేష ఆదరణ పొందింది. దీంతో చిన్న పిల్లల రచయిత్రిగా పాటర్ విశేష ఫలితాలను సాధించారు. దాదాపు రెండు దశాబ్దాలలో, ఆమె 24 పుస్తకాలను ప్రచురించారు. ఆమె మనోహరమైన కథలు సున్నితమైన దృష్టాంతాలతో అన్ని తరాలనూ ఆకర్షించింది.
కథ చెప్పడంతో పాటు, పాటర్ ప్రకృతిని ఆసక్తిగా గమనించేవారు. మైకాలజీ (శిలీంధ్రాల అధ్యయనం)పై ప్రత్యేక ఆసక్తి పెంచుకున్నారు. 
1897లో మహిళలు సభలకూ సమావేశాలకూ హాజరు కావడానికి అనుమతి  లేనప్పటికీ, ఆమె లిన్నియన్ సొసైటీకి శిలీంధ్ర బీజాంశ పునరుత్పత్తిపై ఒక పత్రాన్ని  సమర్పించి సంచలనం సృష్టించారు. సైన్స్, ప్రకృతి పట్ల ఆమెకున్న మక్కువ కథలల్లడానికి వీలైంది. 
బీట్రిక్స్ పాటర్ గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు... 
ఆమె మరణించి 82 సంవత్సరాలైనా  బీట్రిక్స్ పాటర్ పుస్తకాలు ఇప్పటికీ చాలా కుటుంబాలలో ప్రముఖంగా కనిపిస్తుంటాయి. 
బీట్రిక్స్ ఆమె అసలు పేరు కాదు.
పాటర్ 1866లో జన్మించారు. వాస్తవానికి ఆమె అసలు పేరు హెలెన్.
ఆమె తమ్ముడు బెర్ట్రామ్ తో కలిసి పెంపుడు జంతువులను ఎంతో ప్రేమతౌ పెంచుకున్నారు. వారి నర్సరీలో పంచ్ అనే కప్ప, ముళ్ల పంది, న్యూట్స్, పక్షులు, రెండు బల్లులు, తాబేలు, గబ్బిలాలు, సాలీ అనే పాము, అలాగే నత్తలు ఉండేవి.
ఇంటి దగ్గరే చదువుకున్న.
పాటర్ ఎప్పుడూ పాఠశాలకు వెళ్ళలేదు.
తండ్రి రూపర్ట్ పాటర్, బియాట్రిక్స్‌ ను బొమ్మలు గీయమనిప్రోత్సహించారు.  ఆమె ప్రాక్టీస్ చేయడానికి ఆయన తన స్వంత స్కెచ్‌లను ఇచ్చారు.
బియాట్రిక్స్ 12 సంవత్సరాల వయస్సులోనే బొమ్మలు గీయడం ప్రారంభించారు. 
ప్రకృతి గురించి వీలైనంత ఎక్కువ నేర్చుకున్నారు.
చాలా మంది టీనేజర్లలాగా బియాట్రిక్స్ ఒక డైరీని రాసుకునేవారు. కానీ ఆమె ఎవరికీ అంతుపట్టని విధంగా రాసేవారు. ఒక రహస్య సంకేతాలతో రాయడం వల్ల ఆమె మరణించిన తర్వాత కూడా ఆమె డైరీలోని విషయాలు ఎవరికీ అర్థం కాలేదు.
ఆమె ప్రకృతి పట్ల ఆకర్షితురాలై, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తన పెయింటింగ్స్ లలో చూపేవారు.  బీట్రిక్స్‌ను ఎక్కువగా ఆకర్షించినవి శిలీంధ్రాలు. దీంతో ఆమె ఒక ప్రతిభావంతులైన శాస్త్రీయ చిత్రకారురాలయ్యారు. శిలీంధ్ర బీజాంశాలు ఎలా పునరుత్పత్తి చేస్తాయో తన సొంత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ “ఆన్ ది అంకురోత్పత్తి ఆఫ్ ది స్పోర్స్ ఆఫ్ అగారిసినీ ” అంటూ ఓ కీలక పత్రాన్ని రాసారు
ది టేల్ ఆఫ్ పీటర్ రాబిట్ రచనను ఆమె 1893లో అనారోగ్యంతో బాధపడుతున్న నోయెల్ మూర్‌ కోసం రాశారు. ఆమె స్కెచ్‌లతో చిత్రీకరించిన లేఖ ఆ అబ్బాయిని కట్టిపడేసాయి. ఈ విషయం తెలిసి ఆమె, అతని కోసం మరిన్ని కథలు రాశారు. తర్వాతి రోజుల్లో అది సుప్రసిద్ధ నవలగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ ప్రసిద్ధ నవల తన పెంపుడు కుందేలు బెంజమిన్ బన్నీ నుండి ప్రేరణ పొందినట్లు ఆమె చెప్పుకున్నారు. 
ఇక్కడో విషయం చెప్పుకోవాలి ఉంది. మొదట్లో ఈ నవలను పబ్లిషర్లెవరూ ప్రచురించడానికి ఇష్టపడలేదు. దాంతో
ఆమె స్వయంగా 1901లో ఈ పుస్తకాన్ని ప్రచురించారు. 1902లో ఆమె 36వ ఏట ఫ్రెడరిక్ వార్న్ & కో ఈ పుస్తకాన్ని పునర్ముద్రించడానికి ముందుకొచ్చింది. మొదటి సంవత్సరంలో 20,000 పుస్తకాలు అమ్ముడయ్యాయి. చాలా డిమాండ్ ఉండటంతో ఆరుసార్లు పునర్ముద్రించాల్సి వచ్చింది! ఇప్పుడు ఇది అన్ని కాలాలలో అత్యధికంగా అమ్ముడైన పిల్లల పుస్తకాల్లో ఒకటిగా రికార్డు పుటలకెక్కింది. నిజానికి, ప్రపంచవ్యాప్తంగా ఇది 100 మిలియన్లకు పైగా కాపీలు అమ్ముడయ్యాయి. ఇప్పుడు ఏకంగా 35 భాషలలోకి అనువదించబడింది.
బీట్రిక్స్ పాటర్ చాలా తెలివైన వ్యాపారవేత్త. తన జంతు పుస్తకాలను చదివేవారు కథలకు సంబంధించిన ఇతర వస్తువులను కొనుగోలు చేస్తారని ఆమె గుర్తించారు. ఆమె పీటర్ రాబిట్ బొమ్మను తయారు చేసారు. అలాగే తన నవలలోని మిగిలిన పాత్రలనూ బొమ్మలుగా చేసి జనంలోకి తీసుకుపోయారు.
ఈ క్రమంలో ఆమె భారీ విజయాన్ని సాధించినప్పటికీ, తల్లిని మాత్రం ఒకింత నిరాశపరిచారు. 
1905లో, పాటర్ కు తన ప్రచురణకర్త నార్మన్ వార్న్‌తో నిశ్చితార్థమైంది. అయితే, ఆమె తల్లిదండ్రులకు అది నచ్చలేదు. అతను తమ కుమార్తెకు ఏమాత్రం తగిన వాడు కాదన్నది వారి అభిప్రాయం. దురదృష్టవశాత్తు, నిశ్చితార్థం జరిగిన కొన్ని వారాలకే వార్న్ లుకేమియాతో మరణించారు.
1906లో వార్న్ మరణించిన తర్వాత, బియాట్రిక్స్ లేక్ డిస్ట్రిక్ట్ గ్రామంలోని హిల్ టాప్ ఫామ్ అనే చిన్న వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేయాలనే ప్రణాళికలతో ముందుకు సాగారు. ఆ పొలం ఆమెకు స్వర్గధామంగా మారింది. వ్యవసాయ నిర్వహణ నేర్చుకోవడంతో పాటు ఆమె పెయింటింగ్, రాయడానికి దీనినే కేంద్రంగా చేసుకున్నారు. ది టేల్ ఆఫ్ టామ్ కిట్టెన్ (1907), ది టేల్ ఆఫ్ జెమిమా పుడ్ల్ డక్ (1908), ది టేల్ ఆఫ్ సామ్యూల్ విస్కర్స్ (1908) వంటి ఆమె ఉత్తమ పుస్తకాలు ఇక్కడి నుంచి వచ్చినవే. ఆమె చివరి పుస్తకం 
 ది టేల్ ఆఫ్ లిటిల్ పిగ్ రాబిన్సన్. ఇది 1930లో వెలువడింది. 
తన జీవితంలోని చివరి దశాబ్దాలలో, పాటర్ లేక్ ల్యాండ్ రైతుగా మారారు. 1943లో హెర్డ్విక్స్ షీప్ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఎన్నికైన మొదటి మహిళ ఆమె. 
1943లో 77 వి ఏట ఆమె కన్నుమూశారు. ఆమె 14 ఆస్తినంతా  బ్రిటన్ నేషనల్ ట్రస్ట్‌కు అప్పగించారు.


కామెంట్‌లు