శ్రుతిలయలు: సరికొండ శ్రీనివాసరాజు
 10వ తరగతి పరీక్షా ఫలితాలు వచ్చాయి. శ్రుతికి 542 మార్కులు వచ్చాయి. తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేవు. "మామూలు స్థాయి నుంచి ఎంతో కష్టపడి మంచి మార్కులు తెచ్చుకున్నావు బంగారు తల్లీ!" అని మెచ్చుకున్నారు. ఇంతలో శ్రుతి ఫ్రెండ్ లయ వచ్చింది. శ్రుతి మార్కులు కనుక్కొని అభినందించింది. లయ మార్కులు తెలుసుకొని శ్రుతి మరియు తల్లిదండ్రులు మెచ్చుకున్నారు. "అలా ఫ్రెండ్స్ దగ్గరకు వెళదాం లయా! ఈ సంతోషాన్ని వాళ్ళతో పంచుకుందాం." అన్నది శ్రుతి. "అలాగే." అన్నది లయ.
      శ్రుతిలయల క్లాస్ మేట్స్ స్రవంతి, చందన, స్వాతి, సుష్మ ఒకచోట కలుసుకొని ఆనందాన్ని పంచుకుంటున్నారు. వాళ్ళకు వరుసగా 585, 578, 582, 580 మార్కులు వచ్చాయట. "నీకెన్ని మార్కులు వచ్చాయి లయా?" అన్నది స్రవంతి. "587" అన్నది లయ. అలాగే శ్రుతి మార్కులు కూడా కనుక్కున్నారు. చెప్పింది శ్రుతి. నలుగురూ పగలబడి నవ్వారు. "లయా! మనం అయిదుగురం మంచి పార్టీ చేసుకుందాం. పాపం! శ్రుతిని వదిలెయ్యి. బాధలో ఉంది. అయినా శ్రుతికి మనతో కలిసే అర్హత లేదు." అన్నది స్వాతి. "నా మార్కులతో నాకు బాధే లేదు. నేను 9వ తరగతి వరకూ సగటు విద్యార్థినిని. 10వ తరగతికి వచ్చినప్పటి నుంచీ బాగా పట్టుదలతో చదివి, మరిన్ని మార్కులు మెరుగు పరుచుకున్నాను. నా మార్కులతో నా తల్లిదండ్రులు వెరీ వెరీ హ్యాపీ. మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదు." అన్నది శ్రుతి.
      "ఎంత మాట అన్నావు శ్రుతీ! శ్రుతి లేనిదే ఈ లయ ఉండదు. ఇద్దరం ప్రాణ స్నేహితులం. అయినా చిన్నప్పటి నుంచీ ఏం నేర్చుకున్నాం? చదువు కంటే మంచి ప్రవర్తన ముఖ్యం అని. మన ఉన్నతని చూసి గర్వ పడకూడదు. ఇతరులను హేళన చేయరాదు. నువ్వు ఎవ్వరి జోలికీ పోవు. ఎవ్వరినీ బాధ పెట్టవు. నీలో కల్మషం లేదు. నువ్వు చాలా చాలా చాలా మంచిదానివి. నిన్ను ఎలా వదులుకుంటాను. శ్రుతి లేనిదే లయ లేదు. మనం శ్రుతిలయలం బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్.." అన్నది లయ. సంతోషించింది శ్రుతి. ఇదంతా వెనుక నుంచి వీరికి తెలియకుండా గమనిస్తున్న శ్రావణి టీచర్ వీళ్ళను దగ్గరకు తీసుకుని మెచ్చుకుంది. "మీ ఇద్దరికీ మంచి బహుమతి ఇస్తా!" అన్నది. మిగతా నలుగురు సిగ్గుతో తల దించుకున్నారు.

కామెంట్‌లు