మానవతే అభిమతం :- పద్మ త్రిపురారి - జనగామ
మనిషి మనిషిని ప్రేమించమన్నది ప్రతి మతం 
మానవతకు ప్రతి రూపమై నిలవడమే దాని అభిమతం 

దయా దాక్షిణ్యతల కలనేతే 
ప్రతి మత హితం 
దయలేని రాక్షసత్వమవ్వాలి హతం.

కరుణ కార్పణ్యాల బోధనే ప్రవచనం 
కరుణ లేని హృదయమవ్వాలి 
పతనం 

దాన ధర్మము చేయమన్నది ప్రతి మతం
దానవులై ఉసురు తీయుట 
ప్రత్యక్ష నరకం 

మనిషి మనీషిగ ఎదగడమే సకల మతాల సారం.
సాదు స్వభావ పెరుగుదలే 
ఆచార వ్యవహారం 

అయినా,మీకేల లేదు కనికరం 
కాళకూటులై కాటు వేయుట విచారం 

పసి మనసుల రోదనలు కరిగించలేని కర్కషత్వమేల?
వేసారిన మగువల వేదన మీకు వినిపించలేదా?

ఆనంద విహారులై నడయాడిన వారి నందము 
నరరూప రాక్షసులై హరించిన పాపానికి నిష్కృతి లేదా?

నిష్క్రమించవద్దు
హృదయ మలినాన్ని కడిగే వరకు 
నిద్రించవద్దు సహృదయులై మెలిగే వరకు.
నియమబద్ధులవ్వాలి, మహోన్నత శాంతి కొరకు 
నిరంతర దీక్ష పూనాలి 
విశ్వశాంతి కేతనమెగిరేవరకు
ప్రతినబూనాలి మనసు లేని ప్రతి చర్యకు చరమగీతము పాడేవరకు.

అపుడే,అపుడే భరతమాత నుదిటి రుధిర ధారల, ఆర్తనాదాలకు శాంతి.శాంతి.శాంతి.

 

కామెంట్‌లు