విచిత్ర సంప్రదాయం:- - యామిజాల జగదీశ్
 నార్వేలో, ఒక అందమైన సంప్రదాయం ఉంది. 
ఒక రెస్టారెంట్ క్యాష్ కౌంటర్ వద్దకు ఒక మహిళ వచ్చి, "5 కాఫీలు, 1 సస్పెండ్" అని చెబుతుంది. ఆమె 5 కాఫీలకు డబ్బు చెల్లిస్తుంది. కానీ 4 మాత్రమే తీసుకుంటుంది. 
అనంతరం, ఒక వ్యక్తి లోపలికి వచ్చి, "4 లంచ్‌లు, 2 సస్పెండ్" అని అంటాడు. అతను 4 లంచ్‌లకు డబ్బు చెల్లిస్తాడు కానీ 2 మాత్రమే తీసుకుంటాడు. మరొక వ్యక్తి వచ్చి "10 కాఫీలు, 6 సస్పెండ్" అని ఆర్డర్ చేస్తాడు. అతను 10కి డబ్బు చెల్లిస్తాడు కానీ నాలుగే తీసుకుంటాడు.
కొంచెంసేపు అయిన తరువాత, ఒక పేద వృద్ధుడు రెస్టారెంట్ లోపలికి వచ్చి, "ఏదైనా సస్పెండ్ కాఫీ ఉందా?" అని అడుగుతాడు.
సర్వర్ ఆయనకు "అవును ఉన్నాయి!" అని సమాధానమిస్తాడు. అతనికి వేడివేడిగా ఓ కప్పు కాఫీ ఇస్తాడు. 
మరొక వ్యక్తి వచ్చి "సస్పెండ్ లంచ్" అంటాడు. సర్వర్ అతనికి వేడి భోజనం, ఓ వాటర్ బాటిల్ ఇస్తాడు.
ఈ సంప్రదాయం రోజంతా కొనసాగుతుంది.
ఒక సమూహం వారు తీసుకునే దానికంటే ఎక్కువకే డబ్బులు చెల్లిస్తుంది. 
మరొక సమూహమేమో డబ్బు చెల్లించకుండా ఆహారం, పానీయాలను స్వీకరిస్తుంది. 
ఇంతకూ తీసుకున్న దానికన్నా ఎక్కువ దానికి డబ్బు చెల్లించే వారెవరనేదీ, అలాగే ఉచితంగా తీసుకునే వారెవరనేదీ ఎవరూ వెల్లడించరు‌. ఇదంతా రహస్యంగా జరిగిపోతుంటుంది. తామే సహాయం చేసామని చేసిన వారు చెప్పుకోరు. పైగా ఇందులో ఏముంది చెప్పుకోవడానికి అని చిరునవ్వుతో వెళ్ళిపోతారు. ఇదెంత అందమైన ఉదాహరణో కదూ. ఇది నార్వే పౌరుల దయ, దాతృత్వాన్ని ప్రదర్శించే ఉన్నత సంప్రదాయంగా ఇప్పటికీ కొనసాగుతుండటం విశేషం.

కామెంట్‌లు