న్యాయములు-829
"ఆచారః ప్రథమో ధర్మః" న్యాయము
*****
ఆచారః అనగా ఆచారాలు.ప్రథమో అనగా మొదటి.ధర్మః అనగా ధర్మము.
ఆచారములను పాటించడమే మొదటి ధర్మము.
ముందుగా ఆచారం అంటే ఏమిటో? ధర్మం అంటే ఏమిటో? ఆచారాలను పాటించడం ధర్మం ఎందుకు అవుతుందో వివరంగా తెలుసుకుందాం.
ఆచారం అంటే నడత మనం ఎలా నడుచుకోవాలో చెప్పేది,ఆచరణీయమైనది,క్రమం తప్పకుండా ఆచరించే పద్ధతి లేదా ఆనవాయితీ.ఇవి గతం నుండి పరంపరగా మన వాళ్ళు ఆచరించి చూపించినవి ఆచారాలు.బుద్ధిమంతులు, పండితులు, మేధావులు,ధర్మ వేత్తలు,కుల మత పెద్దలు,వేద శాస్త్ర కోవిదులు మొదలైన వారెందరో బాగా ఆలోచించి,చర్చ చేసి అనగా తర్కించి మనిషిని వ్యక్తిగతంగా, సామాజిక పరంగా ఉన్నతంగా నిలిపేందుకు ప్రవేశపెట్టిన నియమ నిబంధనలతో కూడిన ఆలోచనలే ఆచారాలు.ఇవి చాలా వరకు మనిషిని, మనసును ఒకానొక పద్ధతి ప్రకారం నడిపించేవి. ఇందులో సదాచారాలు, దురాచారాలు, అనాచారాలు అని మూడు రకాలుగా ఉన్నాయి. ఇవే కాకుండా మూఢాచారాలు,మత పరమైన ఆచారాలు అనేవి కూడా ఉన్నాయి.
వీటిల్లో దురాచారాలను, అనాచారాలను, మూఢాచారాలను వదిలేద్దాం. సదాచారాలను, మత పరమైన మంచి ఆచారాలను పాటిద్దాం.
సదాచారాలు అంటే తనకూ లోకానికి క్షేమాన్ని, శ్రేయస్సును కలిగించే పనులు. అవి శుచి శుభ్రత,సత్యం పలకడం, త్రికరణ శుద్ధిగా జీవించడం మొదలైనవి సదాచారాలు.వీటిని పాటించడమే ధర్మమని మన పెద్దవాళ్ళు చెబుతుంటారు.
ఇక మత పరమైన ఆచారాల్లో పండుగలు జరుపుకోవడం, వివాహ పద్ధతులు, పుట్టిన రోజు వేడుకలు,అంత్యక్రియలు మొదలైనవి.ఇవి ఆయా జాతి ప్రజల సాంస్కృతిక వారసత్వం నుంచి ఒక తరం నుండి మరో తరానికి అందుతూ ఉంటాయి.
సదాచారం లేదా మంచి ఆచారం "యద్యదా చరతి శ్రేష్టఃతత్తదేవ ఇతరో జనః" అనగా శ్రేష్ఠుడైన వ్యక్తి చేసే ఆచరణే ఇతరులకు మార్గదర్శకం అవుతుంది. అలా వ్యక్తి లేదా ప్రభువు అనాచారాల జోలికి పోకుండా ధర్మ మార్గంలో నడవాలి.ఎప్పుడైతే వ్యక్తి లేదా రాజు ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మ మార్గంలో నడుస్తాడో అతడు ధర్మపరుడు అవుతాడు. అలా ధర్మపరుడు ఎప్పుడైతే అవుతాడో అతడున్న చోట సాక్షాత్తూ భగవంతుడే నివసిస్తాడు.అందుకే మన పెద్దలు "ఆచార ప్రభవో ధర్మః- ధర్మస్య ప్రభురచ్యుతః అన్నారు.
ఆచారం అంటే ఏమిటో మనం కొంత వరకు తెలుసుకోగలిగాం. ఇక ధర్మం అంటే ఏమిటో చూద్దాం.
ధర్మం గురించి వివిధ మతాలు వివిధ రకాలుగా నిర్వచించడం జరిగింది. సనాతన ధర్మం ప్రకారం ఏ ప్రవర్తనా నియమావళి,మూల సూత్రాలు మరియు ఏ న్యాయము చేత వ్యక్తిగత, సామాజిక, మతపరమైన జీవితము సజావుగా నడుపబడుతుందో,ఏ కారణం చేత సర్వ జీవ జాలం ప్రకృతి లోని ప్రతి పదార్ధము, శక్తి ఒకదానితో ఒకటి అనుసంధానింపబడి మనుగడ సాధిస్తాయో,ఏ కారణము చేత ఈ ప్రపంచము,బ్రహ్మాండ మండలం తమ అస్తిత్వాన్ని నిలుపుకుంటున్నాయో అట్టి దానిని ధర్మమని నిర్వచించారు.
బౌద్ధ మతం ధర్మాన్ని గురించి చెబుతూ "కనిపిస్తున్న, కనిపించని వాటన్నింటినీ నడిపించే ప్రకృతి నియమావళిని, బుద్ధుని ప్రవచనాలను, మార్గదర్శకాలను, నాలుగు ఆర్య సత్యాలను, సాధన ద్వారా సత్యాన్ని సాక్షాత్కరింపజేసుకుని నిర్వాణాన్ని పొందే మార్గాన్ని "ధర్మం" అని అంటుంది.
జైన మతం ప్రకారం జీవగురువులు ప్రవచించిన మరియు బోధించిన పరిశుద్ధ జీవన మార్గాన్ని, కల్మషం లేని సాధన ద్వారా అనంత సత్యాన్ని సాక్షాత్కారింప జేసుకునే మార్గాన్ని ధర్మం అని చెప్పింది.
సిక్కు మతం ప్రకారం ధర్మం అంటే గురువులు చూపిన న్యాయబద్ధమైన, సత్ప్రవర్తనను నేర్పిన బాధ్యతా యుతమైన, లోక కల్యాణ కారకమైన మార్గాన్ని తద్వారా నిత్య సత్యాన్ని గ్రహించి పరమాత్ముని పొందే మార్గాన్ని ధర్మం అని చెప్పింది.
ఇలా ఒక్కో మతము ఒక్కో విధంగా నిర్వచించినప్పటికీ స్థూలంగా ఇందులోని అంతరార్థం ఏమిటంటే మానవులు తమకు కలిగిన సత్ సంకల్పాల ద్వారా ఇతరులకు ఎలాంటి నష్టం కలిగించకుండా ఉండటమే ధర్మమని చెప్పవచ్చు.
ఆచారాలను పాటించడమే ధర్మమని , అందులోనూ సదాచారాలను పాటించడమే అసలైన ధర్మమని మనం చెప్పుకున్నాం కదా!ఎవరైతే మానవులు తాము ఆచరిస్తున్న సదాచారాల వల్ల సకల మానవులలో ఉత్తములుగా ఉండి తోటి మానవుల చేత దైవ సమానులుగా పూజింపబడుతూ ఉంటారో వారిలో శాంతి,దయ,అహింస, సత్యము, ఉపకారము, సానుభూతి, సౌశీల్యం మొదలగు సుగుణాలన్నీ ఉంటాయి.అలాంటి వారు కారణజన్ములే. ఎందుకంటే వాళ్ళు ఎల్లప్పుడూ ధర్మాచరణ చేస్తూ ఉంటారు. ఎలాంటి చెడు పనులు చేయకుండా ధర్మం, నీతిని ఆచరిస్తూ మంచి పనులు చేస్తూ ఉంటారు.
ఆచారానికి ధర్మం రక్షణ కవచం లాంటిది.ధర్మాన్ని మనం ఆచరిస్తే ఆ ధర్మమే మనల్ని ఈ సమాజంలో ఉన్నత హృదయులుగా గుర్తింపు పొందేలా చేస్తుంది. కాబట్టి సదాచారములను పాటించడమే మొదటి ధర్మమని "ఆచారః ప్రథమో ధర్మః న్యాయము" ద్వారా మన పెద్దలు చెప్పిన మంచి మాటలను వినయంగా స్వీకరిద్దాం . విధేయతగా ఆచరిద్దాం. ఒక మంచి సమాజాన్ని నిర్మిద్దాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి