సునంద భాషితం:- ,వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయములు-845
"కాంచనమ్ కార్యసిద్ధిః" న్యాయము
*****
కాంచనం అనగా బంగారు, వికారమైన, బంగారము, కాంతి,సంపద,చంపకము. కార్యం అనగా చేయదగినది, పని చేయదగినది, ప్రయోజనము. సిద్ధి అనగా పరిపూర్ణత, సాఫల్యం, విజయం అనే అర్థాలు ఉన్నాయి.
ధనమే కార్యసిద్ధిని చేస్తుంది.అనగా ధనం ఉంటే ఏ పనైనా అలవోకగా చేయొచ్చు అని అర్థము.
సంపద ఉంటే సాధించలేని కార్యమంటూ లేదు.ఈ సంపద లేదా డబ్బు తోనే మానవుడు తన అన్ని అవసరాలు తీర్చుకుంటున్నాడు. డబ్బు జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. "డబ్బు లేని వాడు డబ్బుకు కొరగాడు" అనే సామెత ఇందువల్లనే పుట్టింది.
అందుకే గేయ రచయిత ఆరుద్ర గారు ఈ న్యాయానికి దగ్గరగా ధనం  విలువ గురించి రాసిన సినీ గేయాన్ని చూద్దాం.
"ధనమేరా  అన్నిటికీ మూలం -ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం"-అంటూ రాసిన ఈ గేయంలో మానవుడు తాను సృష్టించిన ధనానికి దాసుడు అవుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తూ అసలైన ధనం ఏ ఏ తావుల్లో వుందో చెబుతారు.
ఒకప్పుడు కులాన్ని బట్టి, మతాన్ని, వారి ఆచార వ్యవహారాలను, సంస్కృతి సంప్రదాయాలను పద్ధతి,ఓద్దికను చూసి గౌరవించే వారు.
 కానీ నేడు ఎవరూ వాటికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కేవలం డబ్బు కే ప్రాధాన్యత ఇస్తున్నారు.
మనం తరుచూ ప్రసార మాధ్యమాల్లో వింటూ ఉన్నాం.కోట్లాటలూ, దోపిడీలు, దొంగతనాలు అన్నీ ఈ ధనం మూలంగానే జరుగున్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అన్నదమ్ముల అనుబంధం మధ్య కుటుంబ సభ్యులలో ఏమాత్రం తేడా వచ్చినా ధనం సమస్య అనేది చిన్న నిప్పు రవ్వలా రగులుకుని పచ్చని బంధాలను విడదీస్తుంది.వృద్ధులను వృద్ధ ఆశ్రమాలకు నెట్టి వేస్తోంది.
 ప్రముఖ కథా రచయిత్రి ఇల్లిందల సరస్వతీ దేవి గారు రాసిన తీయని పలకరింపు కథ నేటి సమాజ పోకడలకు అద్దం పడుతుంది. ధనం సంపాదించినన్ని  రోజులు అతన్ని ఎంతో గౌరవంగా చూసిన ఇంటిల్లిపాదీ అతడి సంపాదన ఆగిపోగానే కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వని పరిస్థితి.చివరికతను  ఇంట్లోంచి వృద్ధాశ్రమానికి వెళతాడు.
 ధనంతో ఎన్ని అవసరాలు తీర్చుకున్నా అంతకంటే ముందు మనిషి మనిషికీ మధ్య డబ్బుతో ముడిపడని మానవీయ బంధాలు ఉన్నాయనేది ప్రతి ఒక్కరూ గ్రహించాలి.
అవసరాలు తీర్చే డబ్బు ఎంత ఉన్నా ఆత్మ సంతృప్తిని ఇచ్చేవి ఆత్మీయమైన బంధాలేననీ ప్రతి వ్యక్తి గుర్తిస్తే, డబ్బుకు మనిషికి మధ్యఁ ఉన్న బంధం ,అనుబంధాల మధ్య ఉన్న తేడాను గుర్తించవచ్చు.
కాంచనం కార్యసిద్ధి" న్యాయము ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే " కుక్క తోకను ఊపాలి కానీ తోకే కుక్కను ఊపకూడదు. సంపద కావాలి అన్ని అవసరాలకు.కానీ అదే అవసరం కాకూడదు.

కామెంట్‌లు