సుప్రభాత కవిత : - బృంద
నింగివి నీవే!నింగిలోని నీలము నీవే!
నేలవు నీవే!నేలపైని హరితము నీవే!
పుడమిపైని పచ్చదనము నీవే!
పచ్చనాకుల పోషించు జీవము నీవే!

తరువువు నీవే!తలిరాకువు  నీవే!
తళ తళ మెరిసే ఆకు పై మెరుపు నీవే!
గిరివి నీవే గిరిని నిండిన సిరివి నీవే!
గిరిని తాకు మేఘాల జలసిరివి నీవే!

కురిసే మబ్బువి నీవే!తడిసే అడవివి నీవే!
సాగే  ఝరివి నీవే!సాగరానివి నీవే!
పసిడి పంట పైరువు నీవే!
పండే సస్యపు గింజవు నీవే!

పాడి ఆవువు నీవే!
పాల లోని వెన్నవు నీవే!
నీడవు నీవే!ఎండవు నీవే!
నడిపించు తోడువి నీవే!

వెలుగువు నీవే!
వేయి ఏనుగుల బలమూ నీవే!
వేడుకను వేదనను ఇస్తూ
వేలుపుగా వరములిచ్చేది నీవే!

కాలము నీవే!కాలుడివి నీవే!
కాల చక్రపు ఆగని వేగం నీవే!
ఆకలివి నీవే! అన్నమూ నీవే!
తనువున నిండిన తలపువి నీవే!

ఆదియు నీవే అనాదివి నీవే!
అంతయు నీవే అంతర్యామివి నీవే!
అంతరంగాన నీవే! అఖిల జగానికి
ఆధారమైన సర్వాత్మకుడవు నీవే!

ఆగ్రహించక  అనుక్షణము
ఆదరించి అనుగ్రహించే
అదిదైవమైన ఆదిత్యునికి
అంజలి ఘటిస్తూ....

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు