న్యాయములు-850
అనన్య లభ్యః శబ్దార్థః న్యాయము
*****
అనన్య అనగా ప్రత్యేకమైనది, సాటిలేనిది.విశిష్టమైనది,వేరొకటి ఏదీ లేనిది వేరొకరిది కానిది.లభ్య అనగా అభించినది, పొందినది, అందుబాటులో ఉన్నది. శబ్దార్థ అనగా పదము యొక్క అర్థము , పదము యొక్క నిర్వచనము, శబ్దము మరియు దాని అర్థము యొక్క సంబంధము అనే అర్థాలు ఉన్నాయి
శబ్దము యొక్క అర్థము ఆ శబ్దము వలననే తెలుసుకొన వలయును గానీ మఱొక విధముగ తెలుసుకోవడం వీలుపడదు అని అర్థము.
దీనికి సంబంధించిన శ్లోకమును చూద్దాం. " యావా నేవ హి అనన్య లభ్యోర్థః శబ్దా ద్గమ్యతే స సర్వః శబ్దార్థః" అని తంత్ర వార్తికము.అనగా మఱియొక శబ్దముచే నలభ్యమై యొక శబ్దముచే పొందబడు నర్థమంతయు ఆ శబ్దమునకే అర్థమగుచున్నది.
దీనిని ఇంకా విపులంగా చెప్పాలంటే ఏ అర్థమున ప్రయోగింపబడు శబ్దము ఆ అర్థమునకే వాచకమగును. ఆ అర్థము ఆ శబ్దము యొక్కయే వాచ్యము అగును.
దీనికి సంబంధించిన ఓ ఉదాహరణ ఏమిటంటే సుఖ విశేషమునకు ఉపయోగింపబడిన స్వర్గ శబ్దము సుఖ విశేష వాచకమును; ఆ సుఖ విశేషము ప్రయుజ్యమాన స్వర్గ శబ్దము యొక్క వాచ్యమును అవును.
ఎలా అంటే "అనన్య లభ్యః శాస్త్రార్థః" అనునట్లు. శాస్త్రార్థము శాస్త్రము చేతనే తెలుసుకొన వీలవుతుంది కానీ మఱొక దాని మూలమున తెలుసుకొన వీలుపడదు.
శబ్దము మరియు శాస్త్రము గురించి మనకు తెలిసింది ఏమిటంటే శబ్దము గురించి తెలుసుకోవాలంటే శబ్దము చేతనే అనగా దాని అర్థము మరియు ధ్వని ద్వారానే అర్థము అవుతుంది.శబ్దము మరియు దాని యొక్క అర్థము మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తుంది. శబ్దము కేవలం ధ్వని మాత్రమే కాకుండా దానికో అర్థము ఉంటుంది. అది ఏ భాషలోనైనా సరే. రైలు అనే శబ్దం వినగానే రైలు యొక్క అర్థము అనగా అదొక వాహనము అని అర్థము అవుతుంది. అనగా ఉచ్ఛారణ అనగా ధ్వని ద్వారానే రైలు అనే శబ్దం యొక్క అర్థము తెలుస్తుంది.
చిరునవ్వు అనే శబ్దం వినగానే మనకు చిరునవ్వు యొక్క అర్థము తెలుస్తుంది.అంటే అది ఎలా వుంటుందో మదిలో మెదులుతుంది.అది పెదవులపై విరిసే ఆనందం అని అర్థం అవుతుంది.
ఇలా జంతువులు అయితే జంతువుల శబ్దములు, పక్షుల గురించి అయితే పక్షుల శబ్దములు, వృక్షములు అయితే వృక్షముల శబ్దములు .. ఇలా ఏ అర్థమునకు ప్రయోగింపబడతాయో ఆ అర్థముల చేతనే పఠింపబడుతాయి.మరొక విధముగా తెలుసుకొనుట వీలు పడదు అనే అర్థంతో మన పెద్దలు ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
ఉదాహరణకు శోకము అనే శబ్దము వినగానే ఆ శబ్దము యొక్క అర్థము బాధ,వేదన, దుఃఖము మొదలైన సమాన పదాలైన శబ్దాలు మదిలో మెదిలి శోకము అనగా దుఃఖము అని అర్థము అవుతుంది.
ఇలా ప్రతి శబ్దం యొక్క అర్థము శబ్దము మరియు దాని అర్థము మధ్య గల సంబంధం ద్వారా మనం తెలుసుకోగలం.అనగా శబ్దం అర్థము శబ్దమే చెబుతుంది. దీనినే ఆంగ్లంలో "sound is the meaning of the sound itself" అంటారు.అనగా శబ్దము అర్థం తెలుసుకోవడానికి శబ్దాన్ని వినాలి.
మరి అర్థం సూచించని శబ్దాలు కూడా ఉంటాయి . వాటిని ధ్వనులు అంటాం.ధ్వని అర్థాన్ని ఇవ్వొచ్చు,ఇవ్వక పోవచ్చు. పసి పిల్లలు చేసే కొన్ని ధ్వనులకు అర్థం ఉండదు. ఏ అర్థం చెప్పకపోతే అది కేవలం ధ్వని మాత్రమే అవుతుంది.అర్థంతో కూడితే అది శబ్దం అవుతుంది. శాస్త్రార్థము తెలుసుకోవడానికి శాస్త్రము ద్వారా ఎలా తెలుసుకోవాలో అలాగే శబ్దము యొక్క అర్థము మరొక శబ్దం ద్వారా మాత్రమే తెలుసుకోగలం.
ఆయా వ్యక్తులకు ఆపాదించబడిన శబ్దాలే వారి వ్యక్తిత్వం సూచించే శబ్దాలు అవుతాయి. ఉదాహరణకు సత్య హరిశ్చంద్రుడు ఎల్లప్పుడూ సత్యమునే పలుకుతాడు.హరిశ్చంద్రుడు అనగానే ఒకానొక సత్యం అనే శబ్దము హరిశ్చంద్రుని సత్య సంధతను తెలియజేస్తుంది.
ఈ "అనన్య లభ్యః శబ్దార్థః న్యాయము లోని అంతరార్థము గ్రహించి మనం కూడా మంచి శబ్దాలకు ప్రతీకలుగా మారుదాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి