బడికి ఎదురుగా ఉన్న సాక్షి కిరాణం షాపు వద్ద రకరకాల పుస్తకాలు వేలాడుతున్నవి. అందులో " నన్ను చదవండి" అనే కథల పుస్తకం కూడా ఉంది.వాటిని చూస్తే పిలుస్తున్నట్టే అనిపిస్తది. లంచ్ సమయంలో బయటకు వచ్చిన పిల్లల దృష్టి రంగురంగుల పుస్తకాలపై పడేది . అందులో ఆరవ తరగతి చదివే అరుణ తదేకంగా ఆ పుస్తకాల వైపే చూసింది. ఆమె మనసు కథల పుస్తకం పై పడింది. "పుస్తకం అమ్మ వంటిది చదివితే భలే కమ్మగుంటదని , చినిగిన చొక్కా అయిన తొడుక్కో ఒక మంచి పుస్తకం కొనుక్కో " అన్న మాటలు క్లాసులో టీచర్ చెప్పిగా గుర్తుకు తెచ్చుకుంది. తన స్నేహితులు మాత్రం చాక్లెట్స్ కొనుక్కుని వెళ్లారు. పుస్తకం కొనడానికి అరుణ దగ్గర సరిపోను డబ్బులు లేక ఆరోజు నిరాశతో వెళ్లిపోయింది. తనను కొంటారనుకున్న కథల పుస్తకం నిరాశ పడింది . తనను కొని విజ్ఞానం, వినోదం పొందుతారని పుస్తకం ఆశ. కానీ ఎవరు కొనలేకపోవడం తనలో తాను బాధ పడింది.
ఒక రోజున పెద్దాయన వచ్చాడు. పుస్తకాలను చూసాడు. పుస్తకాలకు ఆనందం వేసింది. ఆయన సిగరెట్, అగ్గిపెట్టె కొనుక్కొని వెళ్ళాడు. పుస్తకాలన్నీ బాధపడ్డాయి. సాయంత్రానికి ఓ పంతులమ్మ వచ్చింది . ప్రతి పుస్తకాన్ని తిప్పి తిప్పి చూసింది. ఏవేవో కొనుక్కుని వెళ్ళింది. వెంటనే కథల పుస్తకానికి ఏడుపు వచ్చింది.ఇలా రోజూ వచ్చిన పిల్లలు , పెద్దలు చూస్తున్నారు కానీ ఎవరూ కొనడం లేదు.
ఇంకో రోజున ఓ యువకుడు వచ్చి పుస్తకాలను పట్టిపట్టి చూశాడు. పేజీ పేజీ తిప్పాడు. నన్ను ఈ రోజు కొంటాడని కథల పుస్తకానికి సంతోషం కలిగింది. కానీ ఆ కుర్రాడు సినిమా పత్రిక కొనుక్కొని వెళ్ళాడు. పుస్తకాలకు కోపం వచ్చింది. పాపం ఏం చేస్తాయి వేలాడుతూ వచ్చేవారిని పోయే వారిని చూస్తూ ఉండేవి. ఇలా కొన్ని దినాలకు అన్ని పుస్తకాలు అమ్ముడుపోయాయి. కానీ కథల పుస్తకం ఒక్కటే అలాగే ఉండింది. దాన్ని ఎవరూ కొనడం లేదు. ఎండకు ఎండి వానకు తడిసి తన అందాన్ని కోల్పోయి రూపమే మారింది . ఎంతకూ ఎవరూ కొనక పోయేసరికి షాపు వాడు చెత్త కుప్పలో వేశాడు.
అటుగా బడికి వెళ్తున్న అరుణ దృష్టి కథల పుస్తకం పై పడింది. చెత్త కుండి దగ్గరికి వెళ్లి పుస్తకాన్ని చేతికి తీసుకొని శుభ్రంగా తుడిచింది. కళ్ళకు అద్దుకుని తన సంచిలో పెట్టుకుంది. పుస్తకానికి ఎనలేని సంతోషం కలిగింది.
హైమావతి కథల పుస్తకంలోని కథలన్నింటినీ బాగా చదివింది. చదివిన కథలను తరగతి గదిలో స్నేహితులకు చెప్పుతుండేది. స్పష్టంగా, ధారాళంగా చదివేది. కథల పోటీలో బహుమతులు కూడా గెలుచుకుంది. ఆమెను పాఠశాల ఉపాధ్యాయులు మెచ్చుకునేవారు.
ఇలా ఓ పదిహేను సంవత్సరాలు గడిచింది. హైమావతి పెద్దదయింది. మంచి ఉద్యోగం సంపాదించింది. కుటుంబ జీవితాన్ని చక్కగా గడుపుతుంది.
ఒక రోజున తన పిల్లలు బీరువాలో ఉన్న పుస్తకాన్ని తీశారు. ఆ కథల పుస్తకాన్ని తిరిగేస్తూ.. "ఎందుకు అమ్మ ఈ పుస్తకం ? పేజీలు చినిగిపోతున్నాయి... పాతబడింది కదా! బయటపడేయోచ్చు కదా!" అని తల్లితో అన్నారు. అప్పుడు తల్లి "ఆ పుస్తకమే నన్ను గొప్పగా తీర్చిదిద్దిందని, అందులోని ఒక్కొక్క కథ జీవితంలో ఎంతో ఉపయోగపడిందని అంది. నన్ను మార్చిన పుస్తకం ఇది. అందుకే ఇంతకాలం భద్రంగా దాచి పెట్టాను. దీనివల్లనే నేను ఇంతగా ఎదిగాను. ఇది నా ప్రియనేస్తం. చదువుకునే రోజులలో పుస్తకాన్ని కొనాలని అనుకున్నా డబ్బులు లేక కొనలేకపోయాను. ఎవరు కొనలేక కొట్టువాడు చెత్త కుండీలో పడేస్తే నా కంట కనబడింది . దాన్ని ఎంతో భద్రంగా దాచాను. నేను చనిపోయే వరకు ఈ కథల పుస్తకాన్ని కాపాడవలసిన బాధ్యత మీదే. ఈ పుస్తకాన్ని అచ్చు వేయించి కొంతమందికి ఉచితంగా అందజేస్తాను. మీరు కూడా పాఠ్యపుస్తకాలే కాకుండా ఇటువంటి కథల పుస్తకాలను చదివే అలవాటు చేసుకోండి." అంటూ ఆ కథల పుస్తకాన్ని తన యెదన హత్తుకుంది. ఇంతగా ప్రేమిస్తున్నందుకు ఆ కథల పుస్తకానికి ఎక్కడ లేని ఆనందం కలిగింది.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి