కవీశ్వరా!:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
గొంతులు
ఎండితే
కవితామృతముత్రాగించి తృప్తిపరచు
కవీశ్వరా!

పెదవులు
వదరుతుంటే
తేనెపలుకులందించి చిందించు
కవీశ్వరా!

అవయవాలు
అశుద్ధమైతే
అక్షరజల్లులుచల్లి శుభ్రపరచు
కవీశ్వరా!

చెమటలు
కారుతుంటే
కవనగాలులువీచి అలసటతీర్చు
కవీశ్వరా!

కటికచీకట్లు
ఆవరిస్తే
కవనజ్యోతులువెలిగించి ధైర్యమివ్వు
కవీశ్వరా!

మదులు
మొద్దుబారితే
కవనభావాలుకుమ్మరించి చైతన్యపరచు
కవీశ్వరా!

కళ్ళు
కమ్మనిదృశ్యాలు కాంక్షిస్తుంటే
కవనసౌందర్యాలుకనపరచి కుతూహలపరచు
కవీశ్వరా!

నోర్లు
చప్పబడితే
కైతారుచులువడ్డించి తినిపించు
కవీశ్వరా! 

వీనులు
శ్రావ్యతనుకోరుతుంటే
కవితాగానమువినిపించి హాయిగొలుపు
కవీశ్వరా!

నాసికలు 
మూసుకుంటుంటే
కవనసౌరభాలువెదజల్లి ఆనందపరచు
కవీశ్వరా!


కామెంట్‌లు