టీవీలో 24 గంలు వచ్చే యుద్ధ వార్తలని అనుసరిస్తున్న సుదర్శన్..ఇంత ముఖ్యమైన సందర్భంలో ఇంట్లో తిని కూర్చోవటం తప్ప తనేమి చెయ్యలేకపోతున్నానని మథన పడసాగాడు.
చిన్నప్పుడు ఎన్ సి సి లో చేరటానికి భయపడిన సందర్భం గుర్తుకు వచ్చి.."ఛీ ఛీ తనెంత మూర్ఖుడు? సరైన అవగాహన లేక..వాళ్ళు చేయించే వ్యాయామాలకి భయపడి..అందులో చేరటానికి వెనకాడాడు. అప్పట్లో ఆరోగ్యం సుకుమారంగా ఉండి.. 'ఒక రోజు విందు ఒక రోజు మందు' గా ఉన్నందు వల్ల అమ్మ కూడా తనని ఎన్ సిసి లో చేరటానికి ఒప్పుకోలేదు.
ఆ తరువాత జీవితంలో ఎప్పుడూ ఎన్ సి సి గురించి ఆలోచించలేదు.
జీవితం ప్రశాంతంగా నడుస్తున్నంత సేపు..నా చదువు, నా ఉద్యోగం, నా కుటుంబం అని ఆలోచిస్తారే కానీ..మన ఈ ప్రశాంత జీవితానికి కారకులైన సరిహద్దు రక్షణ రంగం గురించి నా బోటి వారు అసలు ఆలోచించరు.
ఇలాంటి అసాధారణ పరిస్థితులు వచ్చినప్పుడు హఠాత్తుగా బాల్యంలో చేరని ఎన్ సిసి, స్కౌట్స్ గుర్తుకి వచ్చినందుకు సిగ్గనిపించింది సుదర్శన్ కి.
"ఏమండీ ఇదిగో టీ, బిస్కెట్స్. ఉదయం నించీ టీవీ వదలకుండా యుద్ధ వార్తలు చూస్తున్నారు, నీరసం వస్తుంది" అంటూ నవ్వుతూ వచ్చింది అరవింద.
"ఆ:( ఎంత సేపు చూసి ఏం లాభం..నా బోటి వాళ్ళ వల్ల దేశానికి ఏమి లాభం లేదు..భూమికి భారం, తిండి దండగ తప్ప" అన్నాడు శ్మశాన వైరాగ్యంతో!
"అలా ఎందుకనుకోవాలి? పుట్టిన ప్రతి వాళ్ళు రక్షణ రంగంలో చేరి..సరిహద్దుల్లో ప్రత్యక్ష యుద్ధం చెయ్యాలని ఏమి లేదు. మీరు చేసే అనవసర ఖర్చులు తగ్గించుకుని ఆ డబ్బు దేశ రక్షణ నిధికి విరాళంగా ఇవ్వచ్చు. ఇప్పుడే చదివాను.. శృంగేరి లాంటి ఆధ్యాత్మిక పీఠాలు 30-40 కోట్ల ధనాన్ని దేశ రక్షణ నిధికి పంపిస్తున్నారుట."
"మీ లాగా ఆలోచించే కొంత మంది మిత్రులు కలిసి డబ్బు పోగు చేసి..సరిహద్దుల్లో వారికి అవసరమైన ఆహారం, మందులు, దుస్తులు పంపించే ఏర్పాట్లు చెయ్యచ్చు. మన చిన్నప్పుడు సినిమా నటులు ప్రాకృతిక విపత్తులు, చైనా, పాకిస్తాన్ వాళ్ళతో యుద్ధాలు వచ్చినప్పుడు జోలెపట్టి అలా ప్రజల నించి విరాళాలు సేకరించారు అని విన్నాం కదా"
"యుద్ధం వచ్చింది అని వార్తలు విని..చూసి, తాత్కాలికంగా ఆవేశ పడి..తన్నేస్తా, పొడిచేస్తా అని కాకుండా... మన నగరంలో ఉండే కంటోన్ మెంట్ ప్రాంతానికి వెళ్ళి..కింది స్థాయి ఉద్యోగులు.. అంటే..సిపాయిలు, లాన్స్ నాయక్, హవల్దార్, సుబేదార్ ల కుటుంబాలకి ధైర్యం చెప్పి..’సామాన్య పౌరులమైన మేమంతా మీకు వెన్నుదన్నుగా ఉంటాం’ అని భరోసా ఇవ్వచ్చు. వారికి మనో ధైర్యాన్ని కలిగించవచ్చు. వారికి అవసరమైన ఆర్ధిక సహాయం చెయ్యచ్చు. వారి పిల్లలకి ఫీజులు కట్టి చదువులు చెప్పించచ్చు."
"వారి ఇంట్లో వృద్ధులకి ధైర్యం చెప్పచ్చు. అవసరమైన వైద్య సహాయాలు అందించి మందులని సరఫరా చెయ్యచ్చు. యుద్ధంలో తమ వ్యక్తిని పోగొట్టుకున్న కుటుంబంలో పిల్లలని మనం దత్తత తీసుకుని..వారి భవిష్యత్తుకి భరోసా ఇవ్వచ్చు. మనసుండాలే కానీ మార్గాలు బోలెడు" అన్నది అరవింద మాతృ హృదయంతో
"అవును..నువ్వన్నట్టు తమ పుట్టిన రోజు పండుగ నాడు తండ్రి యుద్ధరంగంలో ఉన్నాడు, తమ దగ్గరలేడు అని వారి పిల్లలు చిన్నపుచ్చుకోకుండా పుట్టిన రోజు పండుగల లాంటివి మనం జరిపించచ్చు" అన్నాడు సుదర్శన్ తను కూడా మాట కలుపుతూ!
"ప్రత్యక్ష యుద్ధమే చెయ్యక్కరలేదు..శతృవులని చీల్చి చెండాడక్కరలేదు! ఇలాంటివన్నీ దేశ రక్షణకి మన వంతుగా చేసే "చంద్రునికో నూలు పోగు లాంటి చర్యలే! దిగులు పడకండి" అంటూ..
"అన్నట్టు..మీ కొలీగ్ మారేడ్ పల్లి లో కంటోన్ మెంట్ కి దగ్గరలో ఉంటున్నాడు అన్నారు కదా..వాయు పురిలో అతనికి తెలిసిన వైమానిక కుటుంబాల వారిని కలిసి మాట్లాడి రండి. నీటిలో మునిగిపోయే వారికి గడ్డి పరక దొరికినా బోలెడు ధైర్యం వస్తుంది" అని అరవింద కర్తవ్య బోధ చేసింది.
“అందుకే కదోయ్.. భార్యని 'కరణేషు మంత్రి' అన్నారు. నీ కర్తవ్య బోధని అనుసరించి మా మిత్రులందరినీ ఉత్తేజ పరిచి, కార్య రంగంలోకి దిగుతాను" అన్నాడు సుదర్శన్.
"ఈ ఉత్సాహం, ఆలోచన నిరంతరం మన సామాన్య జీవితంలో కూడా ఉండాలి. సమస్య వచ్చినప్పుడు ఆవేశపడి ఉద్వేగంగా ఆలోచించటం కాదు. మన బోటి సామాన్య పౌరులు కడుపు నిండా తిని, కంటి నిండా నిద్రపోతున్నామంటే.. సరిహద్దుల్లో మన సోదర సోదరీమణులు నిరంతరం చేస్తున్న త్యాగమే కారణం అనే స్పృహ ఉంటే చాలు" అన్నది అరవింద.
[కాశ్మీర్ ఉగ్రవాదులని నిర్మూలించటంలో తమ ప్రాణాలు, నిద్రాహారాలు పణంగా పెట్టిన సోదరీ సోదరులందరికీ ఈ కథ అంకితం.]


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి