సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయములు-853
'అధికస్యాధికం ఫలమ్" న్యాయము
*****
అధికస్యా అంటే అధికము, మరింత ఎక్కువ,అధికాస్యాధికం అనగా ఎక్కువలో ఎక్కువ లేదా అధికమైనది.ఫలం అనగా పండు లేదా ఫలితం, లాభం , ప్రయోజనం అనే అర్థాలు ఉన్నాయి.
అధికస్య అధిక ఫలం అనేది ఒక సామెత.దీని అర్థం ఏమిటంటే ఎక్కువ చేసేవాడికి ఎక్కువ ఫలితం ఉంటుంది. అనగా అది వ్యక్తిగా  వ్యక్తిగతంగా పడే కష్టం కావచ్చు.చేసే పూజలు కావచ్చు. ఎంత ఎక్కువగా చేస్తే అంత ఎక్కువగా ఫలితాలు ఉంటాయని శ్రమ జీవులు, భక్తులు నమ్ముతుంటారు అనే అర్థంతో ఈ న్యాయమును మన పెద్దవాళ్ళు ఉదాహరణగా చెబుతుంటారు.
ఇందులో ఒకటి శారీరక రెండు మానసిక శ్రమకు సంబంధించినది. ఈ శ్రమకు తగిన ఫలితం అంటే ఇక్కడ మనం సంపాదన అని భావించాలి.చేసే దానికంటే అధికంగా కష్టపడేది మరికొంత అదనపు సంపాదన కోసమే. చాలా మంది పెద్దలు చెబుతుంటారు ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే అనగా "వయసులో ఉన్నప్పుడే బాగా కష్టపడాలి.నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలి" అంటుంటారు. రాళ్ళంటే తెలియనిదేముంది డబ్బులే.అలాగే "గొడ్డుకు తిన్నది లాభం.మనిషికి ఉన్నది లాభం"అని కూడా అంటారు. అలా ఉండాలంటే అధికంగా కష్టపడాలి. చీమలా కూడబెట్టుకోవాలి. అలా అధిక కష్టం చేసి దాచుకున్నదే కష్ట కాలంలో ఎవరిని యాచించకుండా, ఇబ్బంది పడకుండా కాపాడుతుంది.
అలా అధికంగా కష్టపడి స్వయం కృషితో అటు చదువులో కానీ,ఇటు సంపాదనలో కానీ ఎన్నో మంచి ఫలితాలను పొంది అత్యంత  ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్ళు ఎందరో మన చుట్టూ ఉన్న సమాజంలో కనిపిస్తూ ఉంటారు.
మరి అన్ని సందర్భాలకు,అన్ని వేళలా ఈ న్యాయము వర్తిస్తుందా? అని ప్రశ్నించుకుంటే సమాధానం రాదనే వస్తుంది. ఒకే రకమైన పని చేసేవారిలో అధికంగా కష్టపడినా,మామూలుగా కష్టపడినా ఇచ్చేది వారందరికీ ఒకే రకమైన మొత్తమే.
 ఇక భక్తుల విషయానికి వద్దాం. కొండంత దేవుడికి కొండంత పూలూ పళ్ళూ పెడితేనే అనుగ్రహిస్తాడని మోక్షాన్ని ఇస్తాడని కొందరు అనుకుంటూ ఉంటారు. ఎంతెంతో శ్రమ చేసి సేకరించి పూజ కార్యక్రమాలు గొప్పగా నిర్వహిస్తూ ఉంటారు. అలా ఎంత అధికంగా చేసినా మనిషిగా ఆ వ్యక్తిలో దయ, కరుణ,మంచి తనం, మానవత్వం లేనప్పుడు  భగవంతుడు మెచ్చుతాడా? సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోని మనిషి ఎన్నెన్ని పూజలు ఎంత అధికంగా చేసినా అది అసలైన ఫలితాలను భగవంతుడు ఇవ్వడనే పెద్దల మాటల్లోని అంతరార్థం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
అందుకే అన్నింటికీ ఈ "అధికస్యాధికం ఫలం" న్యాయము వర్తించదని ఈ న్యాయము ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం.
సంపాదనలో, పొదుపులో స్వయం కృషిలో ఎంత ఎక్కువగా శ్రమ చేస్తే అంత మంచిది.దాని వలన ఫలితాలు బోలెడు.అలాగే సాటి మనుషుల విషయంలో  సహాయం, సహకారం, పరోపకారమైన మంచి పనులను ఎంత ఎక్కువగా చేస్తే అంతగా ఆత్మ తృప్తి,ఆనందం లాంటి ఫలాలు అందుతాయని   ఈ న్యాయము ద్వారా మనం గ్రహించాలి.

కామెంట్‌లు