త్రిలింగసంగమ హృదయంగమ భాషగా
నానారాజన్యుల రాజభాష అయి
రసరమ్య భావాల కవిహృదయ కేదారమై
పరభాషాపదహృదయ పరిష్వంగ భాషగా మసలి
సుధీర గభీర ఆలోచనాలోచన భాషగా తనరి
ఏడురాగాల రుచిగల ఐంద్రచాపమై నిలిచి
అసమాన ఆత్మీయ అమృతధారలొలికి
ఒంపుసొంపుల ముత్యాల హొయలుగల భాషగా
పద్యమై, గద్యమై, గేయమై, గల్పికయై, కవితయై,
కథయై, ఆత్మకథయై, జీవితకథయై, వ్యాసమై
ఇలా నానా నామరూపధారియై అక్షరాస్యులు,
నిరక్షరాస్యులు, నాగరీకులు, జానపదులు
ఇలా అందరినోట కూడా జాణయై, పట్టపురాణియై
వేలయేండ్లుగా పదిలంగా నిలిచి,
దేశభాషలందు తెలుగు లెస్సగా భావింపబడి
ఔరా! అనిపించే అందాల అజంతభాషగా ఒనరిన మాత
ఏమిచెప్పను నా తెలుగు భాషామతల్లి వైభవము
అది అఖండ తేజోవిరాజిత దివ్య రమణీయ విభవము!!!
+++++++++++++++++++++++++
తెలుగు వైభవము:- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి