దుబారా ఖర్చు : - సరికొండ శ్రీనివాసరాజు
 వార్షిక పరీక్షలు ప్రారంభం అయ్యాయి. 9వ తరగతి విద్యార్ధి సోము ముందు కూర్చున్న రామును స్కేల్ అడిగాడు. రాము ఇవ్వలేదు. కాసేపటికి పెన్సిల్ అడిగాడు. రాము ఇవ్వను అన్నాడు. రాము ఏది అడిగినా ఇవ్వడం లేదని వేరొకరినీ ఆడుకున్నాడు సోము. మరునాడు హిందీ పరీక్షకు కూడా ఇదే పని. సోము రామూని అవీ ఇవీ అడగటం రామూ  నిరాకరించడం, సోము వేరొకరిని ఆ వస్తువులు అడిగి తీసుకోవడం ఇదే కొనసాగింది. మరునాడు ఇంగ్లీషు పరీక్షకు కూడా ఇదే పని.
     తర్వాత రోజు గణిత పరీక్ష. ఈసారి కంపాస్ బాక్స్ తో సహా చాలా వస్తువులు అవసరం అయ్యాయి. సోము స్కేల్, పెన్సిల్, బ్లాక్ పెన్, కంపాస్ బాక్స్ ప్రతి ఒక్కటీ వారినీ వీరినీ ఆడుకుంటున్నాడు. కానీ ఈరోజు ఒక్క విద్యార్థి కూడా కనీసం ఒక్క వస్తువూ సోమూకు ఇవ్వడం లేదు. సోమూ బిక్క ముఖం వేశాడు. వారినీ వీరినీ బతిమాలుతున్నాడు. ఎవ్వరూ ఇవ్వడం లేదు. సోమూకు ఏడుపు వచ్చినంత పని అయ్యింది.
      ఆ తరువాత బయటికి వచ్చాక సోము అందరి మీదా అరవడం మొదలు పెట్టాడు. వారు "రాము నీకు ఏ వస్తువూ ఇవ్వవద్దని మాకు గట్టిగా చెప్పాడు." అన్నారు. సోమూ రాము వద్దకు చేరి, పెద్ద గొడవ మొదట పెట్టాడు. "నువ్వు ఒకప్పుడు నాకు ప్రాణ స్నేహితునిలా ఉండేవాడివి. ఇప్పుడు పెద్ద శత్రువువు అయ్యావు. నీ అంతు చూస్తా!" అని బెదిరించాడు. "తల్లిదండ్రుల వద్ద డబ్బులు వసూలు చేసి, రోజూ కూల్ డ్రింకులు, లేస్, కుర్ కురేలు, సమోసాలు, పానీ పూరీలు వంటి అడ్డమైన చెత్త తింటున్నావు. వాటితో రోగాలు కొనుక్కోవడం తప్ప మరే ఉపయోగం లేదు. అవే డబ్బులు దాచుకుంటే చదువుకు ఆవసరమైన వస్తువులు కొనుక్కోవచ్చు కదా! ఆ మాత్రం తెలివి లేదా? వచ్చే సంవత్సరం 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఎవరి మెటీరియల్ వారే తెచ్చుకోవాలి. ఇంకొకరిని అడిగితే పేపర్ లాక్కుని బయటకి పంపిస్తారు తెలుసా!" అన్నాడు రాము.
      అప్పటి దాకా వీరికి తెలియకుండా వీరి వెనుక నిలబడి వింటున్న గణిత ఉపాధ్యాయుడు  వేంకటేశం గారు రాము దగ్గరకు వచ్చి, రామూని మెచ్చుకున్నాడు. సోమూను చివాట్లు పెట్టాడు. సోము క్షమించమని వేడుకున్నాడు. "రేపు మీ తల్లితండ్రులను తీసుకుని రా! వారితోనే మాట్లాడుతా." అన్నారు ఉపాధ్యాయులు వేంకటేశం గారు.  

కామెంట్‌లు