ఎప్పుడూ బయటకు చెప్పనివి
ఎందుకో కావాలని అనిపించేవి
ఎక్కడా వెదికినా దొరకనివి
ఎన్నో దాచిన మది కదా మనది!
తడిసిన తలుపుల బరువుకు
కురిసే కన్నుల నీటిని
చెదిరే సహనపు వాకిటిలో
వగచె చింతల చీకటిని.....
మరిగే బాధల సెగలకు
రెప్పల వెనక నిలిచిన
చిన్ని బిందువులన్నీ చేరి
చిన్న ధారగా కురిసే చెక్కిట...
నిలిచిన తెలియని చారికలను
తడిమిన తెలిసే వెతలెన్నో!
కదిపిన పలికే కథలెన్నో!
మరువక దాచిన స్మృతులెన్నో!
వెంటాడే చేదు నిజాలు
వేటాడే చిక్కుల సమస్యలు
వేధించే పచ్చినిజాలు
వెన్నంటి వుండే దురదృష్టాలు!
అంతులేని ఆశల ముంగిట
అలుపు లేక ఊగే ఊహలు
ఆదరించే అవకాశం లేక
ఆగిపోయిన ఆపేక్షలు...
అడుగున అన్నీ అదిమేసి
అందంగా నవ్వుల ముస్తాబుతో
అసహజపు సంతోషం పండిస్తూ
అతి సహజంగా గడిపేస్తున్న బ్రతుకులు
అంతులేని వింతలమయమై
అలవికాని విలువలు మోస్తూ
అల్లకల్లోలమైన అంతరంగాలను
అలరించే అరుణోదయానికి
🌸🌸సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి