కశ్యప మహర్షి:- సి.హెచ్.ప్రతాప్
 సృష్టి ప్రారంభంలో బ్రహ్ముడు సముద్రంలో భూమిపై అన్ని జీవులను సృష్టించాడు. తన మానస కుమారుల్లో ఒకడైన మరీచికి కళ (కర్దమ ప్రజాపతి కుమార్తె) ద్వారా కశ్యపుడు జన్మించాడు. కశ్యప మహర్షి గొప్ప లక్షణాలు, గాంభీర్యం, బలం కలిగిన ఋషుల్లో ఒకడు. ఆయన 17 మంది భార్యల ద్వారా అనేక దేవతలు, అసురులు, మనుష్యులు, జంతువులు జన్మించటంతో విశ్వసృష్టిలో కీలక పాత్ర వహించాడు. అందుకే ఆయన్ను విశ్వసృష్టికర్తగా పురాణాలు పేర్కొంటాయి.కశ్యప అనే పదానికి తాబేలు అని కూడా అర్థం.కశ్యపను ఆకాశంలో ఒక నక్షత్రంగా కూడా గుర్తిస్తారు. ఆకాశంలో, ఉర్సా మేజర్ (డిప్పర్, గ్రేట్ బేర్, సప్తఋషి మండలం) ఉత్తర నక్షత్రరాశిలో కశ్యపగా గుర్తిస్తారు.
కశ్యపుడు ప్రసిద్ధ కశ్యప గోత్రానికి మూలస్థంభం. ఒక సంప్రదాయం ప్రకారం భూమిపై అన్ని జీవుల మూలం ఆయనే. గోత్రం తెలియని వారు కశ్యప గోత్రస్తులుగా పరిగణించబడతారు.
రామాయణంలో శ్రీరాముడు విశ్వామిత్రునితో సిద్ధాశ్రమానికి వచ్చినప్పుడు, అది కశ్యపుడు మరియు అదితి వెయ్యి దివ్య సంవత్సరాలు తపస్సు చేసిన స్థలంగా తెలుస్తుంది. వారు విష్ణువును "తపోమయ, తపోరాశి, తపోమూర్తి, తపాత్మక" అని స్తుతించి, ఆయన రూపంలో మొత్తం విశ్వాన్ని చూశారు.
విష్ణువు ప్రసన్నమై, వరం కోరమని చెప్పగా, కశ్యపుడు ఆయన తమ కుమారుడిగా జన్మించి దేవతలకు సహాయం చేయాలని కోరాడు. ఆ తపస్సు ఫలితంగా విష్ణువు వామనావతారంగా జన్మించి అసురులను అధిగమించడానికి కారణమయ్యాడు. ఆ స్థలాన్ని ఆ తర్వాత "సిద్ధాశ్రమం"గా పిలవబడేలా చేసారు.
సప్తర్షుల్లో ఒకడైన కశ్యపుడు ప్రజాపతిగా ప్రసిద్ధుడు. అతడు మరీచి మరియు కళల కుమారుడు. దక్ష ప్రజాపతి కుమార్తెలలో 13 మందిని, వైశ్వానరుని కుమార్తెలలో 2 మందిని వివాహం చేసుకున్నాడు.
ఆయన భార్యల ద్వారా అనేక జాతుల జీవులను సృష్టించాడు — దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వృక్ష లతల వంటి త్రణ జాతులు, సింహాలు, మృగాలు, పక్షులు, సర్పాలు, గోవుల వర్గం, అనూరుడు, గరుడుడు, నాగులు, కాలకేయులు, పౌలోములు మరియు పర్వతుడు అనే దేవర్షి, విభండకుడు అనే బ్రహ్మర్షి వంటి మహాత్ములను సంతానంగా పొందాడు.
కశ్యపునికి వినత వలన గరుత్మంతుడు, అనూరుడు జన్మించారు. కశ్యపునికి కద్రువ వలన నాగులు జన్మించారు. వారిలో వాసుకి, తక్షకుడు, అనంతుడు, కర్కోటకుడు, కాళియుడు, పద్మ, మహాపాదుడు, శంఖుడు, పింగళుడు ప్రముఖులు. తల్లి కారణంగా నాగులకు ‘కద్రుజ’ అనే పేరు వచ్చింది. భాగవత పురాణం ప్రకారం కశ్యపునికి ముని వలన అప్సరసలు జన్మించారు.  ఒక ప్రజాపతి. ఇతఁడు మరీచికి కళవలన పుట్టినవాడు.శ్రావణ శుద్ధ పంచమి హస్తా నక్షత్రంతో కూడి ఉన్నపుడు కశ్యప మహర్షి జయంతిని ఆచరిస్తారు

కామెంట్‌లు