ఎత్తయిన మహిళ:- - యామిజాల జగదీశ్
 చరిత్రలో అత్యంత ఎత్తైన మహిళల్లో ఒకరు అన్నా హైనింగ్ బేట్స్! ఆమె ఎత్తు 7 అడుగులు 11 అంగుళాలు. (241 సెం.మీ.). ఆమె 1870లలో తన కన్నా మూడు అంగుళాలు తక్కువ ఉన్న భర్త మార్టిన్ వాన్ బ్యూరెన్ బేట్స్‌తో కలిసి ఫోటోకు పోజులిచ్చారు. ఆమె భర్త ఎత్తు ఏడు అడుగుల ఎనిమిది అంగుళాలు. అంటే 234 సెం.మీ.
స్కాటిష్ తల్లిదండ్రులకు 1846 ఆగస్టు 6 అన్నా పుట్టినప్పుడు బరువు 16 పౌండ్లు (7.26 కిలోలు). సాధారణమైన పొడవే. ఆమె 12 మంది తోబుట్టువులందరూ సామాన్యమైన ఎత్తే ఉండేవారు.
6 సంవత్సరాల వయస్సులో, ఆమె ఎత్తు 5 అడుగుల 2 అంగుళాలు (157 సెం.మీ.). అప్పటికి ఆమె తల్లి కంటే ఒకటి రెండు అంగుళాలు తక్కువ ఉండేది. పదో ఏటికల్లా
ఆమె ఎత్తు 6 అడుగులు. (183 సెం.మీ.). 15వ పుట్టినరోజు నాటికి, ఆమె 7 అడుగుల (213 సెం.మీ.) ఎత్తుకు చేరుకుంది. ఆమె 18 సంవత్సరాల వయస్సులో, ఆమె పూర్తి ఎత్తుకు చేరుకుంది.
అన్నా సాహిత్యం, సంగీతం, నటన, గానంలో రాణించేది. ఆమె పియానో ​​వాయించేది. షేక్స్పియర్ రాసిన విషాదాంత నాటకం మాక్‌బెత్ ( 1603 - 1607)లో ఒకసారి అన్నా ఓ ప్రముఖ పాత్రను పోషించింది.
ఆమె తన కాబోయే భర్తను నోవా స్కోటియాలోని హాలిఫాక్స్‌లోని సర్కస్‌లో కలవడానికి వెళ్ళింది. అక్కడ ఆమెను తక్షణమే ఒక ప్రమోటర్ నియమించుకున్నాడు. ఈ జంట కలిసి పర్యటించి చివరికి ప్రేమలో పడ్డారు. 1871లో లండన్‌లో  వివాహం చేసుకున్నారు.
అన్నా దంపతులకు ఇద్దరు పిల్లలు. వారిద్దరూ పుట్టుకతోనే విషాదకరంగా మరణించారు. ఆమె కుమారుడు కేవలం 11 గంటలు మాత్రమే జీవించాడు. 
బేటీస్ దంపతులు ఒహియో పరిధిలో నివాసమేర్పరచుకున్నారు. ఇంటి ప్రవేశ ద్వారం పద్నాలుగు అడుగుల (4.3 మీ) పైకప్పులను కలిగి ఉండేది. తలుపులు అదనపు వెడల్పు, ఎనిమిది అడుగుల (2.4 మీ) ఎత్తు ఉండేవి. ఇంటి వెనుక భాగంలో సేవకులు, అతిథుల కోసం సగటు పరిమాణంలో ఓ వాటా నిర్మించారు.
ఆ తర్వాత, బేట్స్ తన చివరి రోజులను ఓ పొలంలో గడిపారు. ఆమె 1877లో స్థానిక బాప్టిస్ట్ చర్చిలో చేరారు. మరణానికి కొద్ది రోజుల ముందు వరకు తన భర్తతో కలిసి చర్చిలో సేవలకు హాజరైంది.
అన్నా బేట్స్ తన 42వ పుట్టినరోజుకు ఒక రోజు ముందు, ఆగస్టు 5 (1888)న ఇంట్లో నిద్రలోనే గుండెపోటుతో మరణించింది .
జీవితకాలంలో ఆమె ఎందుకింత అసాధారణ ఎత్తు ఎదిగారనేది ఎవరికీ తెలీలేదు. 

కామెంట్‌లు