ఆకలిదప్పులు మరచి చేసే అల్లరి చేష్టలకు
విసిగిన యశోదలా ఎప్పుడు... ఎక్కడ... ఎలా...!
దండిస్తుందోనని సందేహంతో
కలిగిన భయంతో కూడిన అమిత భక్తి గెలిపించింది విజేతగా…!
నేడే విడుదల రండి చూడండి
వెండితెర పై అని ఆకర్షణీయంగా
వర్ణచిత్రాలు కనిపించి పిలిచినట్లు స్వాగతిస్తుంటే
అమ్మ పెదవి దాటక మునుపే ఇంటిపని ముగించి
అనుమతికై ప్రదర్శించే వినయపూర్వక భక్తి
నిలిపింది సవ్యసాచిలా…!
ప్రగతి సూచికైన ప్రొగ్రెస్ కార్డును ఒక చేతపట్టి
కాళ్ళకు బంధాలయ్యే దుస్తులను మరో చేత ఒడిసిపట్టి
బుగ్గలపై ఆమె చేసే తీపి సంతకానికై
ఉరుకుల పరుగులతో తన ఒడిలో వాలి
అనుభూతిని ఆస్వాదించే ప్రేమపూర్వక భక్తి
కలుపుతుంది ఐక్యసూత్ర బంధంలో…!
అమ్మో! ఇంకేమైనా ఉందా...!?
ఇలా చెప్పుకుంటూ పోతే
అమ్మకి అవుతుంది అష్టోత్తరమే కాదు శతసహస్రం…
అత్తమ్మలు… అమ్మమ్మలు… నానమ్మలైన అమ్మలే కాదు… అయ్యలలో సైతం
వెల్లువై వరదలా పొంగుతుంది… అమ్మ నామ స్మరణానందం
జీవకోటి ఉనికి జగతిన ఉన్నంతకాలం!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి