బాల సాహిత్యంలో తెలంగాణ భాషాపరిమళాలు:- - డాక్టర్ సాగర్ల సత్తయ్య - 7989117415

  సాహిత్యం మొత్తానికి మూలం బాల సాహిత్యమే. సాహిత్య శాఖలన్నిటిలోనూ బాల సాహిత్యం ప్రధానమైనది. రేపటి సమాజాన్ని మనం ఆశించిన రీతిలో తయారు చేయడంలో దాని పాత్ర గణనీయమైనది. తెలంగాణ అస్తిత్వ ఉద్యమాల నేపథ్యంలో సాహిత్యంలో దాదాపు అన్ని ప్రక్రియలలోనూ తెలంగాణ భాష కనిపిస్తున్నది. కానీ బాల సాహిత్యంలో ఈ తరహా ఆలోచన చేసిన వారు ఎవరూ కనిపించరు. తెలంగాణ  బాల సాహిత్యంలో మాండలిక  ప్రయోగంతో కథలు రాసిన మొదటి వ్యక్తి పెండెం జగదీశ్వర్. వీరి బడిపిలగాల్ల కతలు తెలంగాణ భాషలో తొలి బాలల కథా సంకలనం. అయితే మాండలికాలతో బాల సాహిత్యాన్ని పరిపుష్టం చేసే ప్రయత్నం ఇతర మాండలికాలలో ఒక దశాబ్దానికి పూర్వమే జరిగింది. రాయలసీమ మాండలికం లో నామిని సుబ్రహ్మణ్యం నాయుడు'మా అమ్మ చెప్పిన కతలు' , ఉత్తరాంధ్ర మాండలికంలో బమ్మిడి సరోజిని జగదీశ్వరరావుల 'అమ్మ చెప్పిన కతలు' ఆయా మాండలికాలలో తొలి సంకలనాలుగా కనిపిస్తున్నాయి.
           తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ నేపథ్యంలో తెలుగు భాషా భోధన ఏవిధంగా ఉండాలి? ఏది తెలంగాణ భాష? ఏది ఆంధ్ర భాష? అనే అంశంపై నేడు విస్తృతమైన చర్చ జరుగుతున్నది. నూతన తెలంగాణ రాష్ట్రంలో రూపొందించుకున్న పాఠ్య పుస్తకాలలో కూడా భాష పట్ల పండితులు పూర్తి ఏకాభిప్రాయానికి వచ్చినట్లు కనిపించదు. ఈ సంకీర్ణ సమయంలో తెలంగాణ పిల్లల భాషను రికార్డు చేసే గొప్ప ప్రయత్నమే బడిపిలగాల్ల  కతలు. పిల్లలు చెప్పుకొనే జానపద కథల ద్వారా పిల్లల యొక్క నిజమైన భాషను జగదీశ్వర్ ఒడిసిపట్టే ప్రయత్నం చేసారనిపిస్తుంది. బాల సాహిత్యంలో తెలంగాణ భాషను ప్రవేశ పెట్టాలనే వినూత్న ఆలోచనతో దాదాపు రెండేళ్ల పాటు శ్రమించి గ్రామీణ ప్రాంతాలలోని పిల్లల భాషను పరిశీలించి, పరిశోధించి, వారి ఉచ్ఛారణను గమనించి శాస్త్రీయంగా, ప్రామాణికంగా ఒక అవగాహనకు వచ్చిన తరువాత 2015 లో ఈసంకలనాన్ని ప్రకటించారు.
         తెలంగాణ భాషలో వచ్చిన రెండవ బాలల కథా సంకలనం 'గమ్మతి గమ్మతి కతలు' కూడా జగదీశ్వర్ రాసిందే. నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. జగదీశ్వర్ కథల్లో కాళోజీ చెప్పిన పలుకుబడుల భాష సరళంగా సహజ సుందరంగా సాగుతుంది. కథా కథనం గమనించినట్లయితే పిల్లల నోటినుండి జాలువారినట్లుగానే అక్షరబద్దం చేయడం చూడవచ్చు. ఎక్కడ కూడా కృత్రిమత్వం గానీ, కృతకంగా గానీ కనిపించదు.
            నేడు ప్రామాణికంగా చెప్ప బడుతున్న భాష కంటే సామాన్య జన వ్యవహారంలో ఉన్న జీవద్భాష యే పిల్లలను ఎంతో ఆకర్షిస్తున్నది.ఈ భాష లో ఉన్న సజీవ సౌందర్యం అరువు తెచ్చుకున్న భాషలో మచ్చుకైనా కనబడదు. ఈ జీవద్భాషను ముందు తరాలకు అందించడానికి బాలసాహిత్యాన్ని ఒక వాహకంగా ఎంచుకొని స్పష్టమైన భాషాస్పృహతో, బాలల మనస్తత్వాన్ని అతిదగ్గరగా గమనించిన అనుభవంతో రాసిన కథాసంకలనాలివి. సునిశితమైన హాస్యం, వినసొంపైన మాండలికం జగదీశ్వర్ కథాసంకలనాలకు వన్నె చేకూర్చాయి. గ్రామీణుల భాషను, జాతీయాలను, సామెతలను, నుడికారాన్ని పిల్లలకు హత్తుకునేలా రాయడం జగదీశ్వర్ శైలిలోని ప్రత్యేకత.
             పెండెం జగదీశ్వర్ తెలంగాణ భాషలో రాసిన 'వొంకాయంత వొజ్రం', 'నాకోసం యెవలేడుస్తరు?' అనే కథలు2016-17 విద్యా సంవత్సరం నుండి మహారాష్ట్ర ప్రభుత్వం తెలుగు వాచకాలలో పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టింది. ఇది తెలంగాణ భాషకు దక్కిన గౌరవం.
            "తెలంగాణ భాషలోని సౌందర్యం, మాధుర్యం, సౌకుమార్యం పిల్లలకు తెలిసేలా చాలా కాలం నుండి కథలు రాస్తూ నేటి బాలసాహిత్య రచయితలలో ఓ దీపస్తంభంలా నిలుస్తున్నారు పెండెం జగదీశ్వర్. తెలంగాణ భాషా పరిశోధకులు కూడా భాష కోసం తప్పని సరిగా బాలసాహిత్యాన్ని అధ్యయనం చేయవలసిన పరిస్థితిని కల్పిస్తున్నారు" అని ప్రముఖ బాలసాహితీ వేత్త  డా. వి.ఆర్.శర్మ పలికిన వాక్యాలు అక్షర సత్యాలు. 
             బడి పిలగాల్ల కతలు , గమ్మతి గమ్మతి కతలు రెండు సంకలనాలలోనూ జగదీశ్వర్ తెలంగాణ భాషావ్యవహారాలను సజీవంగా అక్షరీకరించారు. తొవ్వ,సోపతి,లాషిగ,ఒర్లుడు,పుంటికూర,ఆపతి,దోస్తులు,గమ్మతి,సంబూరం,ఇజ్జతి,పోరగాడు,బొక్కలు,జాగ,పొల్ల,జెరంత,గబ్బోడు మొదలయిన పదాలు కథలనిండా పరుచుకొని పాఠకులకు సహజత్వాన్ని పట్టి చూపిస్తాయి. తాము నిత్యం మాట్లాడుకొనే భాషలోనే ఉన్న ఈకథలు పిల్లలకు గొప్ప అనుభూతులను, ఆనందాన్ని కలిగిస్తాయి. "పచ్చి రొయ్యలు దెచ్చి నూనెల గోలియ్యమని జెప్తె గోలియ్యలేదేందే? యేమనుకుంటున్నవే నువ్వు? నరికి పోగులేస్త బిడ్డ! యియ్యాల నువ్వో నేనో తేలిపోవాలె!" అనే ఈ ఒక్క వాక్యం చాలు జగదీశ్వర్ కథల్లో తెలంగాణ భాష ఏమేరకు పరిమళించిందో తెలుసుకోవడానికి
       జగదీశ్వర్ ఇంకొంత కాలం జీవించి ఉంటే  బాల సాహిత్యం మరింత పరిపుష్టం అయ్యేది. కానీ ఆ అదృష్టానికి తెలుగు బాలలు నోచుకోలేదు. బాల సాహిత్యం ఉన్నంతకాలం జగదీశ్వర్ జీవించే ఉంటాడు. ఆయన ఆశయ సాధనకు  బాల సాహిత్యంలో తెలంగాణ భాష విస్తృతమవ్వాలి. తెలంగాణ బాలసాహితీ వేత్తలు పిల్లలను సాహిత్యం వైపు మళ్లించడానికి తమ కలాలను మరింత పదునెక్కించాలి. గమ్మతి గమ్మతి కతలు, బడి పిలగాల్ల కతలు మరెన్నో కథాసంకలనాలకు ప్రేరణగా నిలవాలి. అప్పుడే భాషాపరంగా, సాంస్కృతిక పరంగా  తెలంగాణ సాహిత్యానికిమరింత పరిపుష్టి చేకూరుతుంది.
( నేడు పెండెం జగదీశ్వర్ జయంతి)
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
good article congrats