మహాత్మా..." శాంతి "కావాలి..:-" కావ్యసుధ "-" ఆధ్యాత్మిక సాహితీ వ్యాసభూషణ్ "9247313488-హయత్ నగర్.

   ఓ పెద్దాయనకు ఆస్తి, అంతస్తు, హోదా, గౌరవం అన్నీ వున్నాయి. భార్య చనిపోయి నాలుగేళ్లు అయింది. కొడుకు, కూతురు జీవితంలో చక్కగా స్థిరపడ్డారు. పెద్దాయనకు భార్యా వియోగం కూడా అలవాటైంది. ఆయనకు అన్నీ వున్నాయి కానీ 'ఇది' అని తెలియని ఏదో లోటుపట్టుకుని పీడిస్తోంది. ఊరికి దూరంగా ఓ నిర్జన ప్రదేశంలో వున్న మహాత్ముని గురించి విన్నాడు.
ఓ శుభముహూర్తాన వెళ్లి ఆయన్ని కలిసాడు. తన మనసులోని బాధంతా చెప్పుకున్నాడు. మహాత్ముడు ఓపిగ్గా విని "మీకు ఏంకావాలి" అనడిగాడు.
"నాకు శాంతి కావాలి" అన్నాడు పెద్దాయన.
'శాంతి ఎవరు, ఎక్కడుంటుంది, ఆమె వయసెంత ?'  ఇలాంటి ప్రశ్నలు ఏమీ వేయలేదు మహాత్ముడు. ఆయన మహాత్ముడే కాబట్టి. "మీ పిల్లలకు ఇచ్చేయగా, మీకు ఎంత ఆస్తి వుంటుంది?" అని అడిగాడు.
"సిటీలో నేనుంటున్న బంగళా, ఇప్పుడు వచ్చిన కారు నా పేరుమీదే వున్నాయి. ఇవికాక బంగారం, డబ్బు కలిపి కోటిన్నరదాకా వుండచ్చు" నిజాయితీగా చెప్పాడు.
అంతకన్నా నిజాయితీగా మహాత్ముడు "వచ్చే ఆదివారం కోటిరూపాయలు మూటకట్టి తీసుకురండి" అనంటే "ఆదివారమా, డ్రైవరు రాడు" అన్నాడు పెద్దాయన.
"మీకు డ్రైవింగ్ రాదా?!"
"వచ్చు. మీరు చెప్పినట్లే ఆదివారం వచ్చి కలుస్తాను" చెప్పేసి నమస్కరించి వెళ్ళాడు పెద్దాయన.
ఆదివారం రానే వచ్చింది. పెద్దాయన కోటి మూట కట్టుకుని వచ్చాడు. మహాత్ముని పాదాల దగ్గర పెట్టాడు. డబ్బును నిర్లిప్తంగా ఓసారి చూశాడు మహాత్ముడు- అన్నీ పెద్ద నోట్లే, ఎంతైనా పెద్దాయనకదా!
"ఈ డబ్బు ఏం చేయమంటారు?" అడిగాడు పెద్దా యన. "కళ్ళుమూసుకోండి చెప్తాను" అన్నాడు మహా త్ముడు. మూసుకున్నాడు పెద్దాయన. డబ్బు మూటతో కనుమరుగయ్యాడు మహాత్ముడు.
లిప్త కాలం తర్వాత కళ్ళు తెరిచాడు పెద్దాయన. మహాత్ముడు, మూట కనబళ్లేదు. చుట్టూ చూస్తే దూరంగా కనిపించాడు మహాత్ముడు మూటతో.
పెద్దాయన వెంటపడ్డాడు. మహాత్ముడు పిక్కబలం చూపాడు. పెద్దాయన పరుగు లంకించుకున్నాడు.
అది నిర్జన ప్రదేశమేమో ఇద్దరే వున్నారు. ఇద్దరూ వయసుమళ్లినవారే. ఒకరిది ధనబలం, మరొకరిది తపో బలం. పట్టుకుందామని ధనవంతుడు. తప్పించుకుండా. మని తపోధనుడు ఒకరికొకరు పోటీపడ్డారు. పరుగులు తీశారు. మధ్యమధ్యలో కేకలు, అరుపులు, చివరకు తపో ధనుడు తామన్న చెట్టుకిందకే చేరాడు మూటతోసహా. 
           ఆయన దగ్గరకొచ్చి ఆయాసపడుతూ నిలబడ్డాడు ధనవంతుడు. మూట ఆయన చేతిలో పెట్టాడు మహా త్ముడు. గట్టిగా పట్టుకుని, కూర్చున్నాడు పెద్దాయన. ఇద్దరూ ఆయాసం, అలసటతీర్చుకున్నాక మహాత్ముడు అడిగాడు- "మీరు తెచ్చినప్పుడు ఎంత తెచ్చారు?"
"కోటి” చెప్పాడు పెద్దాయన.
"ఇప్పుడు ఎంతవుంది?" అంటే "కోటి" అన్నాడు.
"మీరు సంపాదించుకున్నది ఎక్కడికీ పోలేదు. అం తేగా!?"అని మహాత్ముడడిగితే “అవును” అన్నాడు.
"మరి ఎందుకంత ఆవేశపడిపోయారు?"
"పోతుందేమోనని"- కాస్త ఇబ్బందిగా అన్నాడు.
"పోదు. ఆత్మస్థైర్యం అనే సొమ్ము ఏనాటికీ పోదు. విద్య, వివేకం, ఆరోగ్యం, ఆనందం-ఇవన్నీ అసలుసిసలు ఐశ్వర్యాలు" చెప్పాడు మహాత్ముడు.
"అవును. నిజమే” అన్నట్టు చూశాడు పెద్దాయన.
"నాకు శాంతి కావాలి- అన్నారు మీరు. డబ్బు వల్ల అవసరాలు తీరతాయి, ఆడంబరాలు వస్తాయి. శాంతి వస్తుందా?"అని ప్రశ్నిస్తే "రాదు" అన్నాడు పెద్దాయన.
"కానీ డబ్బు లేకపోవడంవల్ల అశాంతి రావచ్చు. ఆ ఇబ్బంది మీకు లేదు- డబ్బు వుంది కాబట్టి.నాకు శాంతి కావాలి అనేది మూడు పదాల వాక్యం. అందులో మొదటిది 'నాకు', మూడవది 'కావాలి' తీసే యండి. మిగిలింది శాంతి. అహం, కోరిక లేకపోతే మిగి లేది శాంతేగా" చెప్పాడు మహాత్ముడు.
( ఆధ్యాత్మిక నీతి కథ )

కామెంట్‌లు