బడికి ఎదురుగా ఉన్న సాక్షి పాన్ షాపు వద్ద చందమామ, బాలమిత్ర, బాలజ్యోతి, బుజ్జాయి వంటి రకరకాల పుస్తకాలు వేలాడుతున్నవి. అందులో " నన్ను చదవండి" అనే కథల పుస్తకం కూడా ఉంది.వాటిని చూస్తే పిల్లలకు రమ్మని పిలుస్తున్నట్లే అనిపిస్తది. ప్రతిరోజు బడికి వచ్చేటప్పుడు పోయేటప్పుడు పిల్లల దృష్టి ఆ పుస్తకాలపై పడుతుంది . లంచ్ సమయంలో ఏదో ఒకటి కొనుక్కోవడానికి బయటకు వచ్చిన పిల్లల చూపు రంగురంగుల పుస్తకాలపై పడేది . బడిలో ఆరవ తరగతి చదివే అరుణ తదేకంగా ఆ పుస్తకాల వైపే చూసింది. ఆమె మనసు అందమైన ముఖచిత్రంతో ఆకర్షణీయంగా వేలాడుతూ కనిపించే "నన్ను చదవండి " కథల పుస్తకం పై పడింది. "పుస్తకం అమ్మ వంటిది చదివితే భలే కమ్మగుంటదని , చినిగిన చొక్కా అయిన తొడుక్కో ఒక మంచి పుస్తకం కొనుక్కో " అన్న మాటలు క్లాసులో టీచర్ చెప్పిగా గుర్తుకు తెచ్చుకుంది. విరామ సమయంలో బయటకు వచ్చిన తన స్నేహితులు మాత్రం చాక్లెట్స్ కొనుక్కుని వెళ్లేవారు. అరుణకు మాత్రం పుస్తకం కొనుక్కోవాలనే ఆశ ఉండేది. కానీ అరుణ దగ్గర సరిపోను డబ్బులు లేక నిరాశతో వెళ్లిపోయేది. ఇలా ప్రతిరోజు ఆ పుస్తకాన్ని చూసినప్పుడల్లా కొనాలని ఆశ పుట్టేది. కానీ డబ్బులు లేక అది సాధ్యపడలేదు. తనను కొంటారనుకున్న కథల పుస్తకం కూడా నిరాశ పడింది.
ఒక రోజు పెద్దాయన ఆ పుస్తకాల షాపు వద్దకు వచ్చాడు. పుస్తకాలను చూసాడు. పుస్తకాలకు ఆనందం వేసింది. ఆయన మాత్రం సిగరెట్, అగ్గిపెట్టె కొనుక్కొని వెళ్ళాడు. పుస్తకాలన్నీ బాధపడ్డాయి. సాయంత్రానికి ఓ పంతులమ్మ వచ్చింది . ప్రతి పుస్తకాన్ని తిప్పి తిప్పి చూసింది. ఏవేవో కొనుక్కుని వెళ్ళింది. వెంటనే కథల పుస్తకానికి ఏడుపు వచ్చింది.ఇలా రోజూ వచ్చిన పిల్లలు , పెద్దలు చూస్తున్నారే కానీ నన్ను ఎవరూ కొనడం లేదు అనుకుంది.
ఇంకో రోజున ఓ యువకుడు వచ్చి పుస్తకాలను పట్టిపట్టి చూశాడు. పేజీ పేజీ తిప్పాడు. నన్ను ఈ రోజు కొంటాడని కథల పుస్తకానికి సంతోషం కలిగింది. కానీ ఆ కుర్రాడు సినిమా పత్రిక కొనుక్కొని వెళ్ళాడు. పుస్తకానికి కోపం వచ్చింది. పాపం ఏం చేస్తది. వేలాడుతూ వచ్చేవారిని పోయే వారిని చూస్తూ ఉండేది. ఇలా కొన్ని దినాలకు అన్ని పుస్తకాలు అమ్ముడు పోయాయి. కానీ కథల పుస్తకం ఒక్కటే బొడ్రాయి లెక్క అలాగే మిగిలింది. దాన్ని ఎవరూ కొనడం లేదు. ఎండకు ఎండి తన అందాన్ని కోల్పోయి రూపమే మారింది . ఎంతకూ ఎవరూ కొనక పోయేసరికి షాపు వాడు పక్కనే చెత్త కుప్పలో పడేశాడు.
ఒకనాడు బడికి వెళ్తున్న అరుణ షాప్ వైపు చూడగా పుస్తకం కనిపించలేదు. పక్కనే చెత్త కుప్పలో పడివున్న కథల పుస్తకం చూసింది. దగ్గరికి వెళ్లి పుస్తకాన్ని చేతికి తీసుకొని శుభ్రంగా తుడిచింది. కళ్ళకు అద్దుకుని తన సంచిలో పెట్టుకుంది. పుస్తకానికి ఎనలేని సంతోషం కలిగింది.
అరుణ కథల పుస్తకంలోని కథలన్నింటినీ బాగా చదివింది. చదివిన కథను తరగతి గదిలో తోటి దోస్తులకు చెప్పు తుండేది. స్పష్టంగా, ధారాళంగా చదివేది. పాఠశాల కథల పోటీలో బహుమతులు కూడా గెలుచుకుంది. ఆమెను పాఠశాల ఉపాధ్యాయులు మెచ్చుకునేవారు.
పదిహేను సంవత్సరాలు గడిచినంక అరుణ పెద్దదయింది. మంచి ఉద్యోగం సంపాదించింది. కుటుంబ జీవితాన్ని చక్కగా గడుపుతుంది. ఒక రోజున తన పిల్లలు బీరువాలో ఉన్న పుస్తకాన్ని తీశారు. ఆ కథల పుస్తకాన్ని తిరిగేస్తూ.. "ఎందుకు అమ్మ ఈ పుస్తకం ? పేజీలు చినిగిపోతున్నాయి... పాతబడింది కదా! బయటపడేయోచ్చు కదా!" అని తల్లితో అన్నారు. అప్పుడు తల్లి "ఆ పుస్తకమే నన్ను తీర్చిదిద్దిందని, అందులోని ఒక్కొక్క కథ జీవితంలో ఎంతో ఉపయోగపడిందని అంది. నన్ను మార్చిన పుస్తకం ఇది. అందుకే ఇంతకాలం భద్రంగా దాచి పెట్టాను. దీనివల్లనే నేను ఇంతగా ఎదిగాను. ఇది నా ప్రియనేస్తం. చదువుకునే రోజులలో పుస్తకాన్ని కొనాలని అనుకున్నా డబ్బులు లేక కొనలేకపోయాను. ఎవరు కొనకుండ ఉంటే కొట్టువాడు ఈ పుస్తకాన్ని చెత్త కుండీలో పడేస్తే నా కంట కనబడింది . ఆ పుస్తకాన్ని తనివి తీరా చదివి ఈ స్థాయికి వచ్చాను. దాన్ని ఎంతో భద్రంగా దాచాను. ఇందులో బోలెడన్ని కథలు ఉన్నాయి. నేను చనిపోయే వరకు ఈ కథల పుస్తకాన్ని కాపాడవలసిన బాధ్యత మీదే. ఈ పుస్తకాన్ని రాసిన రచయితకు రుణపడి ఉంట. దీన్ని అచ్చు వేయించి ఆసక్తి ఉన్న కొంతమంది విద్యార్థులకు ఉచితంగా అందజేస్తాను. మీరు కూడా పాఠ్యపుస్తకాలే కాకుండా ఇటువంటి కథల పుస్తకాలను చదివే అలవాటు చేసుకోండి." అంటూ ఆ కథల పుస్తకాన్ని తన గుండెకు ప్రేమగా హత్తుకుంది. ఇంతగా ప్రేమిస్తున్నందుకు ఆ కథల పుస్తకానికి ఎక్కడ లేని ఆనందం కలిగింది.
-
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి