ప్రకృతి స్నేహం:- ఉండ్రాళ్ళ రాజేశం-సిద్దిపేట -9966946084
 విజ్జపల్లి గ్రామంలో చంద్రయ్య అనే రైతు ఉండేవాడు. ప్రతిరోజు వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి, ఏదో ఒక పని చేస్తుండేవాడు. సాయంకాలం అయితేనే  గ్రామంలోకి మూటతో తిరిగి వచ్చేవాడు. అందరూ ఏమయ్యా! చంద్రయ్య ప్రతిరోజు వ్యవసాయ భూమి వద్ద ఏం పని ఉంటుంది. పనులున్నప్పుడే పోవాలి అంటూ వెటకారంగా మాట్లాడేవారు. చంద్రయ్య మాత్రం ఎదురు సమాధానం ఇవ్వకుండా  చిరునవ్వుతో వెళ్లేవాడు. 
            ఒకరోజు సద్దిమూటతో వెళ్తున్న  చంద్రయ్యను గ్రామస్తులు వ్యవసాయ భూమి వద్దకు వెళ్లకుండా కచేరి వద్ద అందరి మధ్య కూర్చోబెట్టుకుని  ముచ్చట పెట్టసాగారు. చంద్రయ్య ఎంత ప్రయత్నించినా ఎవరో ఒకరు ఆపుతూ బయటకు వెళ్లకుండా చేస్తున్నారు. సాయంత్రం కావస్తుంది. ఇగ చంద్రయ్యకు వశమైతలేదు. ఎలాగో ఒకలా తప్పించుకొని వ్యవసాయ భూమి వద్దకు పరిగెత్తసాగాడు. గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయి చంద్రయ్య వెనకాలే వెళ్లారు. 
               వ్యవసాయ భూమి వద్దకు వెళ్లగానే కుక్కలు, కోతులు, నెమళ్లు, పక్షులు  అరుస్తూ చంద్రయ్యకు ఎదురుగా వచ్చాయి. పండు, ఫలాలు తెంపి వాటికి వేసి, కుక్కలకు సద్దిమూట పెట్టి, పాత్రలలో నీళ్లు నింపి, కడవలో నీళ్లు చంద్రయ్య తాగాడు. చంద్రయ్య వెనకాల వచ్చిన గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. కుక్కలు గ్రామస్తులను చూసి అరవడం. కోతులు కిచ్ కిచ్ మంటూ చెట్లు ఎక్కగా, నెమళ్లు నాట్యమాడుతూ, పక్షులు కిలకిలమంటూ అడవిలోకి వెళ్లాయి. చంద్రయ్య కుక్కలను పంపించి గ్రామస్తులను గట్టుపై కూర్చోబెట్టి, ఇక చెప్పండి నేను మీ ముచ్చట వింటాను. రాత్రి, పగలు ఇక్కడే ఉందాం అంటూ గుడిసెలో ఉన్న పండ్ల మూట తెచ్చి అందరికీ పంచాడు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టది అన్నట్లుగా, అడవిలో జంతువులతో స్నేహం చేస్తూ, చంద్రయ్య లేకున్నా పొలంలో పండ్లు, ఫలాలకు జంతువులు, పక్షులు దూరం ఉంటూ చంద్రయ్య అందిస్తేనే తినడం అందరు ఆశ్చర్యపోయారు. ఊర్లో కచేరి ముచ్చట కంటే వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి స్నేహం బాగుందంటూ గ్రామస్తులు చంద్రయ్యను మెచ్చుకుని, గ్రామంలోకి బయలుదేరారు.

కామెంట్‌లు