: నన్ను అధికంగా పెంచండి:-విత్తనాల విజయకుమార్ -హైదరాబాద్ -: 9985117789
సాహితీకవికళా పీఠం 
సాహితీ కెరటాలు 
=================
పండును తిని విత్తును నాటే వృద్ధునితో,
"మరణించే ముందు నీకెందుకనె?" చెట్టు.
"నా జాతి మనుగడకమ్మా!" అనిన వృద్ధునితో,
"నాతో ఏమా మనుగడ?" అన్నదా చెట్టు.

"డోలా, గిలకా పసితనమున ఇచ్చి,
గాలీ, వంటచెరకూ, ఉపకరణాల సహా, 
గూడు కట్టే సొగసుకి తనువునిచ్చి,
అడుగడుగున ఆదుకున్న తల్లివి నీవనె" వృద్ధుడు.

"అంతేనా నాయనా" అన్న చెట్టుతో,
"తినడానికి రుచికరమైన ఫలాలనిచ్చి, 
మా రోగాలకు రకరకాల ఔషధాలనిచ్చి,
మమ్మల్ని రక్షిస్తున్న తల్లివి కదమ్మా!" అని ....

"పంటలతో బతుకు పండించే వర్షాలకు హేతువై, 
సారవంతమైన మట్టిని కొట్టుకుపోకుండా పట్టి,
కడకు మా కట్టె కాలడానికి కట్టెవయ్యే తల్లీ,
నీవు లేని మా మనుగడ శూన్యం." దండం పెట్టాడా వృద్ధుడు.

"అంతేకాదు నాయనా!" వృద్ధుని ప్రేమతో చూస్తూ, 
"ప్రకృతిలో సకల ప్రాణుల రక్షణకూ,
అన్ని చోట్లా సమతుల్య వాతావరణానికీ,
అవసరమైన నన్ను అధికంగా పెంచండి." అన్నదా వృక్ష మాత.

•••••••••••••••~

కామెంట్‌లు