సాహితీకవికళా పీఠం
సాహితీ కెరటాలు
============
పరమేశ్వరా పాహిమాం
దేవతలను, రాక్షసులనూ భయకంపితులను చేసిన,
క్షీరసాగర మథనమొసగిన విషాన్ని,
లోక సంరక్షణార్థమై కంఠంలో నిలిపిన నీలకంఠేశ్వరా,
నీకెవ్వరు సాటి! నీకు నువ్వే సాటి.
గుణ,రూప, రస, గంధ, స్పర్శల నీ సృష్టిలో ,
రూపాలను మార్చే నీ వినాశన శక్తిని,
నమకంతో కొలిస్తే, చమకంగా కనిపించే,
"అహం బ్రహ్మాస్మి", "తత్వమసి",
నీకెవ్వరు సాటి! నీకు నువ్వే సాటి.
స్త్రీ పురుషుల సహవాసములో,
సామరస్య జీవితమే ఆదర్శమని,
సతికి అర దేహమునొసగిన అర్ధనారీశ్వరా,
నీకెవ్వరు సాటి! నీకు నువ్వే సాటి.
అరూప రూపివి; నిరాకారుడైన సాకారుడివి.
అనుదినం ప్రాపించిక మాయలను మరచే నిదురనొసగి,
మరణ కాలంలో తలిస్తే ముక్తిని ప్రసాదించే పరమాత్మా,
నీకెవ్వరు సాటి! నీకు నువ్వే సాటి.
అనంత హృదయాల్లో అమృత రూపా,
ఆదిత్య వర్ణంలో అచలానంద మూర్తీ,
తిమిరాతీత సర్వాధిపతీ; సర్వేశ్వరా,
నీకెవ్వరు సాటి! నీకు నువ్వే సాటి.
పరమేశ్వరా పాహిమాం, పాహిమాం, పాహిమాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి