గుడ్లగూబ:- ఎం. వి.ఉమాదేవి.
కొమ్మ మీద గుడ్లగూబ 
నమ్మలేని వింత శోభ!
పరిసరాల పరిశుభ్రత 
కలిగించే పక్షి గూబ!!

పగలెక్కడ కనిపించును?
నిశిలోనే చరించును!
పొలాలలో ఎలుకవేట 
రైతు మిత్ర అనిపించును!!

గుండ్రమైన కళ్ళలోన 
సూటిగున్న చూపుమిన్న 
చుట్టూతిరుగు శిరసులోన
జ్ఞాననేత్రముందిర చిన్నా!!

ఎంతగొప్ప సేవకుడో 
లక్ష్మీదేవికి వాహనంగా 
నిర్భయముగా సాధుజీవి 
కీటకాల నాశనిగా!!

అందమైన వాటికన్న 
సత్యమైన జీవిమిన్న 
సృష్టిలోని వైవిధ్యము 
తెలుసుకుంటే మంచిదన్న!!


కామెంట్‌లు