బలాఢ్యుడు మిలో:- - యామిజాల జగదీశ్

 దాదాపు 2,500 సంవత్సరాల క్రితం, క్రోటన్‌కు చెందిన గ్రీకు రెజ్లర్ మిలో (క్రీస్తుపూర్వం 540 - 511 ). ప్రపంచంలో ఇప్పటివరకు జీవించిన రెజ్ లర్లలో అత్యంత బలాఢ్యుడిగా మిలో చరిత్రపుటలకెక్కాడు. 
అద్భుతమైన బలం కలిగిన వ్యక్తి మిలో. అతను కండరాలను బలంగా ఉంచడానికి మూడు ప్రాథమిక సూత్రాలను సూచించాడు. అవి,
చాలా తేలికగా ప్రారంభించడం. వ్యాయామాలను మిస్సవకుండా క్రమబద్ధంగా చేయడం. శిక్షణనూ ఓ క్రమపద్ధతిలో చేయడం. శిక్షణ నైనా వ్యాయామాన్నయినా ప్రణాళికా బద్ధంగా పాటించడం. ఒకరోజు ఎక్కువసేపు చేయడం, మరొక రోజు తక్కువ సేపు చేయడం వంటివి తగదు. ఏదైనా అంచెలంచెలుగా చేసుకుంటూ పోవడం ముఖ్యం.
ఈనాటి దక్షిణ ఇటలీలోని మాగ్నా గ్రేసియాలోని క్రోటన్‌కు చెందిన మిలో, గ్రీస్‌లో జరిగిన పురాతన ఒలింపిక్ క్రీడలలో ఆరుసార్లు రెజ్లింగ్ ఛాంపియన్‌గా నిలిచాడు. తన  కాలంలో అత్యంత విజయవంతమైన రెజ్లర్‌గా ప్రసిద్ధి చెందాడు. 
క్రీ.పూ. 540లో, అతను బాలుర రెజ్లింగ్ విభాగంలో గెలిచాడు. తరువాత వరుసగా ఐదు ఒలింపిక్ క్రీడలలో పోటీ పడి విజయం సాధించాడు. 
అతని గురించి అనేక మంది రచయితలు ప్రస్తావించారు. వారిలో అరిస్టాటిల్ , పౌసానియాస్ , సిసిరో , హెరోడోటస్ , విట్రువియస్ , ఎపిక్టెటస్, సుడా తదితరులున్నారు.  కానీ అతని చుట్టూ మరిన్ని కథలున్నాయి.
డయోడోరస్ సికులస్ తన చరిత్రలో మిలో పైథాగరస్ అనుచరుడు అని రాశాడు. అతను క్రీస్తుపూర్వం 511లో సైబరైట్‌లను ఓడించిన క్రోటోనియన్ సైన్యానికి నాయకత్వం వహించాడు. అతను తన ఒలింపిక్ దండలు ధరించి, సింహ చర్మంలో హెరాకిల్స్ లాగా దుస్తులు ధరించి, గదను మోసేడని పేర్కొన్నాడు.
ఆ తరువాత సైబరైట్లు మూడు లక్షల మంది సైన్యంతో యుద్ధభూమిలోకి అడుగుపెట్టారు. క్రోటోనియన్లు కేవలం లక్ష మంది సైనికులే ఉన్నారు. వీరిని మిలో అనే మల్లయోధుడు నడిపించాడని, అతను మొదట తన ఎదురుగా ఉన్న సైన్యం విభాగాన్ని తరిమికొట్టాడని రాశాడు. అతను అజేయమైన బలం కలిగి ఉండటం వల్ల ప్రత్యర్థులను సునాయాసంగా తరిమికొట్టేవాడట. దీంతోనే అతనిని అందరూ ఆరాధించేవారు. 
మిలో మరణం అనూహ్యంగా జరిగింది. తోడేళ్ళ దాడి ల్లో లేక సింహం దాడి వల్లో సంభవించిందని అంటారు. 
అతను తన చిటికెన వేలును వంచడానికి ప్రయత్నించమని ప్రజలను సవాలు చేస్తుండే వాడట. అలాగే గ్రీజు వేసిన ఇనుప డిస్క్‌పై నిల్చుని తనను అక్కడి నుంచి నెట్టమని సవాలు విసిరే వాడు. ఒక చేతిలో దానిమ్మ పండు పట్టుకుని ఇతరులను తన నుండి తీసుకోమని సవాలు చేయడం వంటి అనేక విన్యాసాలు చేసేవాడు. కానీ చాలా మంది ముందుకొచ్చి ఓడిపోయిన వారే తప్ప ఎవరూ ఎప్పుడూ విజయం సాధించలేదు. పైగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది‌. అతను అర చేతిలో పండును ఉంచి గట్టిగా పట్టుకున్నప్పటికీ పండు ఎప్పుడూ దెబ్బతినలేదట.
ప్రతిరోజూ దూడను తన వీపుపై మోసుకెళ్లడం మిలో  శిక్షణలో ఒకటి.
ఆ తర్వాత అతను భారీ ఆవుని స్టేడియం పొడవునా మోసుకెళ్లి చంపి, వేయించి, తినేవాడట.
లండన్‌లోని హాలండ్ పార్క్‌లో మిలో విగ్రహాన్ని చూడవచ్చు‌. మిలో బల ప్రదర్శన ప్రవృత్తే అతని అంతిమ పతనానికి దారి తీసింది. క్రీస్తుపూర్వం 511లో, అతను గ్రామీణ ప్రాంతాలలో ప్రయాణించాడు. మార్గమధ్యంలో ఒకతను చెట్టును నరకడానికి ఇబ్బంది పడుతుండటం చూసిన మిలో అతనికి సాయం చేయబోయాడు. ఎంతో ఉత్సాహంగా 
అతను చెట్టును తన చేతులతో కూల్చడానికి నడుం బిగించాడు. అయితే అనుకోకుండా అతని వేళ్లు కాండం మధ్యలో చిక్కుకుపోయాయి.
మిలో తన వేళ్లను బయటకు తీసుకోలేకపోయాడు.   ఇంతలో తోడేళ్ళో లేక సింహమో అతనిమీద దాడి చేసి చంపినట్లు చెబుతారు‌. 

కామెంట్‌లు