ఊషన్నపల్లిలో ప్రైవేట్ స్కూళ్ల వాహనాలను అడ్డుకున్న గ్రామస్తులు

 -ఊషన్నపల్లికి రావద్దని వాహనదారులకు సూచన 
-పిల్లల్ని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని కోరిన ప్రజలు 
-అనుమతి లేని ప్రైవేట్ వాహనదారులపై ఎంఈఓ ఆగ్రహం

కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి గ్రామంలో శుక్రవారం గ్రామానికి వచ్చిన ప్రైవేటు స్కూళ్ల వ్యాన్లు, బస్సులను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామానికి రావద్దని, గ్రామంలోని పిల్లలందరినీ మా ఊరి ప్రభుత్వ పాఠశాలలోనే చదువాలని  ప్రజలు ప్రైవేటు స్కూళ్ల వాహనాలను అడ్డుకున్నారు. గ్రామంలోని పిల్లలందరినీ సకల సౌకర్యాలతో పాటు ఉచిత నాణ్యమైన విద్యను అందించే ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే చదివించాలని వారు కోరుతూ ప్రైవేట్ వాహనాలను అడ్డుకున్నారు. ఉదయం వాహనాలు వచ్చే సమయానికి వారు గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయం వద్ద వేచి ఉన్నారు. వ్యాన్లు, బస్సుల్లో ఎక్కుతున్న పిల్లల్ని దించి వేశారు. ఈ ఘటనతో అక్కడ గ్రామ ప్రజలందరూ గుమిగూడారు. గ్రామ ప్రజలందరూ కలిసి ప్రైవేట్ పాఠశాలల వ్యాన్లు, బస్సులను అడ్డుకుంటున్న విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య శ్రీరాంపూర్ ఎంఈఓ సిరిమల్ల మహేష్ కు సమాచారం ఇవ్వడంతో ఆయన హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ ప్రైవేటు పాఠశాలల వ్యాన్లు ఎక్కించడానికి సిద్ధంగా ఉన్న పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడారు. పిల్లల్ని ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు పంపించాలని కోరారు. అక్కడే ఉన్న పెగడపల్లి, శ్రీరాంపూర్ గ్రామాల్లోని ప్రైవేట్ పాఠశాలల వ్యాన్లు, బస్సులను తనిఖీ చేశారు. పిల్లల్ని వ్యాన్లలో తీసుకెళ్లడానికి మీకు పర్మిషన్ ఉందాని ఎంఈఓ అడగడంతో వారు లేదని సమాధానమిచ్చారు. పర్మిషన్ లేకుండా ఎలా నడుపుతున్నారని, పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనుంచి పిల్లలను తీసుకెళ్లడానికి అనుమతి లేని, మంచి కండిషన్లో లేని ఏ వాహనం వచ్చినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, సంబంధిత పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తామని ఎంఈఓ మహేష్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మహేష్ మాట్లాడుతూ ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తూ పిల్లల్ని అద్భుతంగా తయారు చేస్తున్నారని, పాఠశాల పిల్లల్లో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు గాను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాల "బెస్ట్ స్కూల్, ఛాంపియన్ స్కూల్" అవార్డులు పొందిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇంత మంచి స్కూల్ ను కాదని మీరు ప్రైవేట్ స్కూళ్లకు పిల్లల్ని ఎందుకు పంపిస్తున్నారని ఎంఈఓ తల్లిదండ్రులను ప్రశ్నించారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు నిజం తెలుసుకొని తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లకు పంపించి, డబ్బును వృధా చేసుకోవద్దని, అందుబాటులో ఉన్న ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లల్ని చదివించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, గ్రామస్తులు, పిల్లల తల్లిదండ్రులు, నాయకులు, యువకులు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు
సెహబాస్ 👏.
ప్రైవేట్ పాఠశాలల వ్యాపారాన్ని నిరసించాల్సిందే.
60 యేళ్ళ క్రితం మేము కూడా ప్రభుత్వ విద్యాసంస్ధల్లో చదువుకున్నవాళ్ళమే, మేమేమీ నష్టపోలేదే.
సెహబాస్ 👏.
ప్రైవేట్ పాఠశాలల వ్యాపారాన్ని నిరసించాల్సిందే.
60 యేళ్ళ క్రితం మేము కూడా ప్రభుత్వ విద్యాసంస్ధల్లో చదువుకున్నవాళ్ళమే, మేమేమీ నష్టపోలేదే.