డైరీలో ఆకాశం:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
ఆమె
బతుకంతా నడిపించిన అమ్మ
ఇల్లంతా ఆకాశం
కప్పూ వసారా 
తలుపూ కిటికీ తెరుచుకొన్న 
నా గుండెవాకిలి

ఆమె ఒంటరికాదు 
మబ్బులు తేలే కొత్త ఆకాశ విహారి

బావురుమనే సొంత ఊరూ గాలి
కిందామీదైన అసలు చిరునామా
నేను నేనుగా 

పీల్చినగాలి ఇప్పుడు పరాయి
నడకంతా నగరం కళ్ళలోనే 
తలకిందుల తపస్సు

ఆమెను వదిలిన నేనిప్పుడు
హృదయంలేని మరమనిషిని

చెట్టు అందాలు లేవిక్కడ 
మట్టి గుడిసే లేదు
ఆక్రమణల నేల సారం సమాధి
నింగిని తాకే అద్దాల భవంతుల కింద

క్షీరధారల  అమ్మ ఆనవాలెప్పుడూ
ఓ బతుకు ఓ వేగం ఒక సృష్టి

కామెంట్‌లు