సుప్రభాత కవిత : -బృంద
తడిసిన కనుపాపల మనసున 
విడిది చేసిన కమ్మని కలలు 
వదలక మరిమరి వినతి సేయ 
కదలక నిలిచెను మది శిల వోలె!

ఎగసిన ఆశల అలలకు 
ముగిసేనా తీరని తపన 
గగనానికి తప్పక తెలిసేనా
వగచిన హృదయ నివేదనా!

కలవని తీరపు కోరిక 
కరగని మౌనపు వేదికలా
ఎదురయే కలతల తెరతీసేదెపుడో
ఎరుగక వేచెను వాడుకగా!

ఎన్నడు చీకటి తొలగునో
ఎప్పుడు వెలుగులు చిందునో
ఎందుకు ఎదలో కంగారో
ఎవరికి  ఎవరు తోడౌతారో!

భారమవక  బంధాలన్నీ 
దూరాలన్నీ చేరిపేసుకుని 
చేరువయ్యే  చెలిమిని పంచే
కోరుకున్న కొత్త వెలుగుల వేకువకు

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు