జాగ్రత్త కవీ!:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం
మాటలు వదిలితే
తూటాలు పేలుతాయేమో
కలాలు కదిలిస్తే
కత్తులు దిగుతాయేమో

అక్షరాలు విసిరితే
నిప్పురవ్వలు పైనపడతాయేమో
పదాలు పారిస్తే
ప్రవాహంలో కొట్టకపోతారేమో

కవితలు పఠిస్తే
మెదడులో గుచ్చుకుంటాయేమో
ఆలోచనలు ఊరిస్తే
తల తటాకమవుతుందేమో

కల్పనలు అల్లితే
భ్రాంతుల్లో కూరుకుపోతారేమో
విషాదకైతలు రాస్తే
కన్నీరు కార్పిస్తుందేమో 

కవనజల్లులు కురిపిస్తే
వరదల్లో కొట్టుకపోతారేమో
ఎదలను దోచుకుంటే
పిచ్చివాళ్ళు అవుతారేమో


కామెంట్‌లు