న్యాయాలు-910
"కోరుక్? హితమిత భుక్" న్యాయము
****
కోరుక్ అనగా ఎవరు అనారోగ్యం లేకుండా ఉన్నారు. హిత అనగా మేలు, మంచి. మితం అనగా పరిమితమైన, తగినంత, కొద్దిగా.భుక్ అనగా తిను , భోజనం చేయు, తినడం, అనుభవించడం అనే అర్థాలు ఉన్నాయి.
రోగము లేని వాడెవడు? అంటే హితమైన ఆహారమును మితముగా తినే వాడు అనే అర్థంతో మన పెద్దలు ఎంత మంచి ఆహారమునైనా మితముగా తినాలని చెప్పేందుకు ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
సంస్కృతంలో ఈ న్యాయానికి సంబంధించిన పూర్తి శ్లోకాన్ని చూద్దాం.
కోరుక్? కోరుక్? కోరుక్? హితభుక్,మితభుక్,జితేంద్రియో,నియతః!/ కోరుక్? కోరుక్? కోరుక్? శతపద గామీ చ వామశాయి చ!!/"
చరకుడు అంటే తెలియని వారు ఉండరు. ఆయుర్వేద చికిత్స విధానానికి,వైద్యానికి సంబంధించి చరక సంహిత అనే ఆయుర్వేద గ్రంథాన్ని రాసి లోకానికి అందించిన మహానుభావుడు. ఆయుర్వేద వైద్య విధానంపై అనేక పుస్తకాలు రాశారు. ఆయన గారు రాసిన వైద్య విధానాలను, ఆరోగ్య సూత్రాలను ఎందరో పాటించారు.
అయితే ఒకసారి చరకుడికి తన రచనల నుండి ఎవరెవరు ఏయే బోధనలు తీసుకున్నారో తెలుసుకోవాలని అనుకున్నాడట. అలా అనుకోవడమే తడవుగా తనను ఓ పక్షిగా మార్చుకుని వైద్యులు ఎప్పుడూ ఎక్కువగా కూర్చునే ఓ చెట్టు కొమ్మ మీద కూర్చున్నాడట.
అలా కూర్చుని కింద వైద్యులు వినే విధంగా "కోరుక్! కోరుక్!అని అరవడం ప్రారంభించాడట. అంటే తెలుసు కదా! ఎవరు వ్యాధి లేని వారు? ఎవరు మంచి ఆరోగ్యాన్ని అనుభవిస్తారో? అని అర్థము. ఆ పక్షి అరుపులు విని చెట్టు కింద కూర్చుని ఉన్న వైద్యులు సమాధానం ఇలా చెప్పడము ప్రారంభించారట.ఒక వైద్యుడు "రోజూ చ్యవన ప్రాశ రోజూ తినే వ్యక్తి మాత్రమే మంచి ఆరోగ్యాన్ని పొందుతాడు" అని అంటాడు.అది విన్న రెండో వైద్యుడు "రోజూ లవణ భాస్కర చూర్ణము తీసుకునే వ్యక్తి మాత్రమే ఆరోగ్యంగా ఉంటాడని" అంటాడు.ఇక మూడవ వైద్యుడు "అవి రెండూ కాదు చంద్రప్రభ వతి రోజూ తీసుకునే వ్యక్తి మంచి ఆరోగ్యంతో ఉంటాడని" అంటాడు. ఇలా మరికొందరు వైద్యులు వాదనలు చేస్తూ తమకు తోచిన విధంగా చెప్పడం చరకుడికి చాలా నిరుత్సాహం కలుగుతుంది.అక్కడ నుండి వెళ్ళి ఓ నది ఒడ్డున ఉన్న చెట్టు మీద కూర్చుంటాడు.
అప్పుడే నదిలో స్నానం చేసి బయటకు వస్తున్న వైద్య రాఘవ్ ని చూసి అతడు తానున్న చెట్టు కిందకు చేరుకోగానే "కోరుక్! కోరుక్! అని అరవడం మొదలు పెడతాడు. అది విన్న వైద్యుడైన రాఘవ్ ఒక్క క్షణం ఆలోచించి "హిత మిత భుక్" అని సమాధానం చెప్పడంతో చరకుడికి చాలా సంతోషం వేస్తుంది. తాను ఏదైతే చెప్పాలని అనుకున్నాడో అదే చెప్పిన రాఘవ్ ను ఆశీర్వదించడానికి వెంటనే మానవ రూపంలోకి మారి పోతాడు. రాఘవ్ చెప్పిన దాని అర్థం ఏమిటంటే "మేలైనది,ప్రయోజనకరమైనది మాత్రమే తినేవాడు,ఆకలి కంటే తక్కువ తినేవాడు, స్వచ్ఛమైన దానిని తినే వాడు,న్యాయంగా సంపాదించిన మార్గాల ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందుతాడని" అర్థము. ఈ విషయాన్ని శక్తానంద్ స్వామి చరక బోధన గురించి ప్రస్తావిస్తూ చెప్పడం జరిగింది.
దీనికి సంబంధించి ఇంకో కథనం కూడా ఉంది.అదేమిటో చూద్దాం.
కేరళలో అశ్విని దేవతలను వారి కుటుంబ దేవతగా పూజించే వైద్య నిపుణులు కుటుంబం ఉండేది. ఆ నంబూద్రి కుటుంబం వారు శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యులుగా ఉన్నారు. వారిది అలత్తూరు.
ఒకరోజు అలత్తూరు నంపి తన నిత్య పూజ కోసం శివ వైద్యనాథుడు ఉన్న శివాలయానికి వెళుతున్నాడు. ఆ దారిలో ఒక పెద్ద అశ్వత్థ వృక్షం కింద నుంచి వెళుతుండగా కొమ్మ మీద ఉన్న కవల పక్షులు కోరుక్? కోరుక్? అని అరుస్తాయి. అప్పుడా ప్రముఖ వైద్యుడు తన ప్రార్థనలో శ్రీ పరమేశ్వరుని అడుగుతాడు.
అప్పుడు భగవంతుడు వైద్యుని ఆశీర్వదిస్తాడు. దాని ఫలితమే ఈ క్రింది శ్లోకం.
⁶కాలే మిత హిత భోజి,కృత చక్రమణ: క్రమేణ వామశయ:!/అవిధృత్ మూత్ర పురీషః స్త్రీషు యతాత్మా చ యో నరః సోయరుక్!!'
అనగా క్రమం తప్పకుండా తినే వ్యక్తి తన ఆరోగ్యానికి మంచి మితంగా తీసుకునే వ్యక్తి: మితమైన వ్యాయామం చేసే వ్యక్తి, సరైన సమయంలో ఎడుమ వైపు నిద్ర పోయే వ్యక్తి, మూత్ర విసర్జన మరియు మల విసర్జన ప్రతి చర్యలను అణచి వేయని వ్యక్తి, లైంగిక సంబంధాల విషయంలో స్వీయ నియంత్రణ కలిగిన వ్యక్తి -వీరంతా ఎల్లప్పుడూ అనారోగ్యం నుంచి విముక్తి పొందుతారు. అలా నంపి చెప్పడంతో ఆ కవల పక్షులు ఆ నంపి లేదా నంబూద్రి ఇంటికి వచ్చి ఇంటి పైన వాలి అదృశ్యం అవుతాయి.
ఇవండీ! "కోరుక్? హిత మిత భుక్ న్యాయము" యొక్క అద్భుతమైన విషయాలు విశేషాలు. మనం తెలుసుకోవలసిన ఆరోగ్య నియమాలు, సూత్రాలు..
మరి ఇందులోని అంతరార్థం గ్రహించి హితంగా, మితంగా భుజించి పది కాలాల పాటు ఆయురారోగ్యాలతో కూడిన జీవితాన్ని గడుపుదాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి