సునంద భాష్యం:- వురిమళ్ల సునంద, ఖమ్మం

  న్యాయాలు 897
"అర్థస్య పురుషో దాసో దాసస్త్వర్థో నకస్య చిత్" న్యాయము
*****
అర్థ అనగా ధనము,సంపద ప్రయోజనము, లక్ష్యము.అర్థస్య అనగా అర్థానికి. పురుషో అనగా పురుషుడు, వ్యక్తి.దాసో అనగా దాసుడు, బానిస. దాసన్త్వర్థో అనగా ధనం బానిస .నకస్య చిత్ అనగా ఎవరికీ కాదు, ఎవ్వరికీ కాదు అనే అర్థాలు ఉన్నాయి.
"పురుషుడు ధనమునకు దాసుడై ఉంటాడు గాని ధనము ఎవ్వరికీ దాసురాలుగా ఉండదు"అని అర్థము.
అర్థస్య పురుషో దాసో అనగా మనిషి ధనానికి బానిస కానీ  దాసస్త్వర్థో నకస్యచిత్ అనగా ధనము , డబ్బు లేదా సంపద ఎవరికీ దాసురాలుగా ఉండదు అనగా డబ్బు ఎవరికీ బానిస కాదు చెప్పడమే ఈ న్యాయము లోని అంతరార్థము.
ఈ శ్లోకము  మహా భారతంలో భీష్మ పితామహుడు యుధిష్ఠిరుడికి చెప్పాడు. ఎందుకు చెప్పాడో శ్లోకం మొత్తాన్ని ,ఆ సందర్భాన్ని తెలుసుకుందాం.
 కౌరవ పాండవుల మధ్య సయోధ్య కోసం చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలం కావడంతో కౌరవ సైన్యం, పాండవుల సైన్యం కురుక్షేత్ర యుద్ధ భూమిలో మోహరిస్తుంది.
యుద్ధం ప్రారంభానికి ముందు యుధిష్ఠిరుడు తన ఆయుధాలను వదిలేసి,తన కవచాన్ని తీసేసి ప్రార్థనగా చేతులు జోడించి కౌరవ సైన్యాధిపతి అయిన భీష్మ పితామహుడి వైపు నడవడం ఇరువైపులా ఉన్న యోధులు ఆశ్చర్యంగా చూస్తారు. అతడు లొంగిపోవాలని నిశ్చయించుకున్నాడని భావిస్తారు.
ధర్మరాజు సోదరులు కూడా తన అన్నయ్యను అనుసరిస్తూ భీష్ముడి వద్దకు వెళ్ళి వినమ్రంగా నమస్కరించి యుద్ధంలో మేము ఎదురుగా ఉన్నందున మీ వైపు మా ఆయుధాలను ప్రయోగించాల్సి రావచ్చు.అందువల్ల మీకు వ్యతిరేకంగా ఏదైనా జరగవచ్చు కాబట్టి బొమ్మకు మమ్మల్ని క్షమించమని వేడుకుంటారు.
వారి గౌరవ ప్రదమైన ప్రవర్తనకు చాలా సంతోషిస్తూ, తనను వారివైపు యుద్ధం చేయమని మాత్రం అడగొద్దని  కారణం చెబుతాడు.అదేమిటంటే దుర్యోధనుడు అందుబాటులో ఉంచిన ఆర్థిక వనరులపై తాను జీవిస్తున్నాడు కాబట్టి దుర్యోధనుని కోసమే తాను పోరాడవలసి ఉంటుందని చెబుతూ ఈ శ్లోకాన్ని కూడా ఉదహరిస్తాడు.
"అర్థస్య పురుషో సో దశస్త్వర్థో న కస్యచిత్!/ఇతి సత్యం మహరాజ్!బద్ధోస్మ్యర్థేన్ కౌరవైః" అనగా మనిషి డబ్బుకు బానిస.డబ్బు ఎవరికీ బానిస కాదు.ఓ రాజా! యుధిష్ఠిరా! కౌరవులచే నాకు డబ్బు అందడం ద్వారా  బంధించబడ్డానని నేను మీకు నిజం చెబుతున్నాను "అంటాడు.
ఒక్క సారి ఈ శ్లోకం యొక్క అర్థమును లోతుగా అధ్యయనం చేస్తే తెలిసేది ఏమిటంటే మనిషి డబ్బు కోసం ఎంతగానో కష్టపడతాడు.కొందరైతే డబ్బు కోసమే బ్రతుకుతారు.కానీ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే డబ్బు ఎవరికీ బానిస కాదు. కానీ మనిషే తన జీవితాన్ని డబ్బు కోసం బానిసగా మార్చుకుంటాడు. మార్చుకుంటున్నాడు.అది తగదు అని,.ధనం ఒక శక్తివంతమైన అంశం అని.అది మనిషిని అత్యంత ప్రభావితం చేస్తుందని చెప్పడమే ఇందులోని ప్రధాన ఉద్దేశ్యం.
అంతే కాదు ఎప్పుడైతే ఇతరుల ద్వారా డబ్బు సహాయం పొందుతామో  వారికి అనుకూలంగా, వారు చెప్పినట్లుగా వినవలసి వస్తుంది.అనగా ఈ ఆర్థికావసరం ఆ వ్యక్తిని డబ్బు ద్వారా ఇచ్చిన వ్యక్తికి దాసుడిగా మారుస్తుంది.
అంతే కానీ డబ్బు ఎవరికీ దాసోహం కాదు. తనను చేరదీసిన వ్యక్తిని సంపన్నుడిని చేస్తుంది.ఎప్పుడయితే మనిషి తన కోసం తపిస్తూ అన్ని బంధాలు అనుబంధాలను వదులుకొని  దాసోహం లేదా బానిస అవుతాడో అప్పటి నుండి మనిషిలోని నీతిని, నిజాయితీని హరించి వేస్తుంది.మంచి స్నేహాన్ని చెడగొడుతుంది.ఈ విధంగా మనిషి వ్యక్తిత్వాన్ని అథఃపాతాళానికి తోసి వేస్తుంది.
కాబట్టి అవసరాల కోసం, ఆర్థిక స్థిరత్వం కోసం  మాత్రమే డబ్బు సంపాదించాలి.అంతే కానీ అదే ధ్యాసగా దానిని సంపాదించడం కోసం  నైతిక విలువలను వదిలేసి, బంధాలు అనుబంధాలకు దూరమై  డబ్బుకు  బానిసగా  బతకకూడదనే ఓ గొప్ప విషయాన్ని, విలువైన  సమాచారాన్ని మనం ఈ "అర్థస్య పురుషో దాసో దాసస్త్వర్థో నకస్యచిత్" న్యాయము ద్వారా తెలుసుకోగలిగాం.s


కామెంట్‌లు