న్యాయాలు -903
"నైవాశ్రితేషు గుణ దోష విచారణా స్యాత్" న్యాయము
*****
నైవ అనగా ఎవరు కాదు. ఆశ్రితేషు అనగా ఆశ్రయం పొందిన వారు, ఆశ్రయం పొందిన వారిలో. గుణ అనగా లక్షణము, లక్షణము, అలవాటు.దోష అనగా తప్పు,లోపం, పొరపాటు. విచారణా అనగా వివరాలను తెలుసుకునే ప్రయత్నం, దర్యాప్తు వాకబృ, పరిశీలన, పరీక్ష,చర్చ.స్యాత్ అనగా అవకాశం ఉంది లేదా బహుశా అనే అర్థాలు ఉన్నాయి.
ఆశ్రితుల గుణ దోష విచారణ ఎవ్వరూ చేయరు.(చంద్రుడు దోషాకరుడైనా కుటిలుడయినా కళంకితుడయినా మిత్రుడు ( సూర్యుడు) అస్తమించిన తరువాత గాని తాను ఉదయించక పోయినా, శివుడు అతనిని తలమీద పెట్టుకున్నాడు). అనగా రక్షించమని వచ్చిన వాడు శరణు కోరిన వాడి గుణ దోషాలు ఎంచకుండా సజ్జనులు కాపాడుతారు లేదా రక్షిస్తారు అని అర్థము.
ఈ శ్లోకాన్ని మొత్తంగా చూద్దామా.
"దోషా కరోపి,కుటిలోపి,కళంకితోపి!/మిత్రాపసాన సమయే విహితోచ్ఛయోపి!చంద్రః,తథాపి,హర వల్లభతాం -ఉసైతి:/నైవాశ్రితేషు గుణ దోష నివారణా స్యాత్!!/
అనగా చంద్రుడు దోషాలకు నెలవు. రాత్రి చీకట్లోనే ఆయన తావు.చంద్రడు కుటిలుడు అనగా వంకర బుద్ధి గలవాడు. ( వంకరగా ఉంటాడు).ఈ విధంగా ఎన్నో పాపాలు చేసిన వాడు.మిత్రుడైన సూర్యుని అవసాన సమయంలో తాను వృద్ధి పొందుతాడు.అయినా శివుడికి అతని గుణ దోషాలు తెలిసిన శివుడు వాటన్నింటినీ తెలిసి కూడా అతడిని తలపై ధరించాడు అని అర్థం.
మరి దీనికి సంబంధించిన ఆసక్తికరమైన పురాణ కథను చూద్దామా..!
ప్రజాపతి దక్షుడికి మొత్తం 62 మంది కుమార్తెలు ఉండే వారని వారిలో 27 మంది( 27 నక్షత్రాలు- అశ్విని , భరణి, కృత్తిక, రోహిణి... మొదలైన)కుమార్తెలను చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడని మత్స్య పురాణం చెబుతోంది.
అయితే చంద్రుడు తన 27మంది భార్యలలో రోహిణిని మాత్రమే ఎక్కువగా ప్రేమించి మిగతా 26మంది భార్యలను నిర్లక్ష్యం చేస్తాడు.అది భరించలేని 26 మంది అక్కాచెల్లెళ్ళు తమ తండ్రి అయిన దక్ష ప్రజాపతి వద్దకు వెళ్ళి మొర పెట్టుకుంటారు. అల్లుడి ఈ పక్షపాత ధోరణి నచ్చక దక్ష ప్రజాపతి కోపంతో చంద్రుడిని శాశ్వతంగా క్షీణించి పోవాలని శపిస్తాడు.
శాపం వల్ల చంద్రుడు రాను రాను క్షీణించడం మొదలవుతుంది. బాగా బాధ పడుతూ ఉంటున్న సమయంలో నారదుడు చంద్రునితో " ఓ చంద్రుడా! దక్షుని శాపం నుండి నిన్ను రక్షించగలవాడు మహా దేవుడైన శివుడు మాత్రమే అని చెబుతాడు.
అప్పుడా చంద్రుడు. దక్షుడు శివుని భక్తుడు.అందులోనూ దక్షుని పనులలో తాను ఎన్నడూ జోక్యం చేసుకోనని మాట ఇచ్చాడు.వరాలు శాపాలు అనుభవించక తప్పదు.వాటిని వెనక్కి తీసుకు రాలేము కదా! అంటాడు.
అప్పుడు నారదుడు చంద్రునితో "అది నిజమే కానీ నే చెప్పిన విధంగా ముందుగా నీవు శివుని వద్దకు వెళ్ళి శరణు కోరు.ఆ విధంగా శివుని వాగ్దానాన్ని పొందు.ఆ తర్వాత దక్షుడు పెట్టిన శాపం గురించి చెప్పు "అని తన ఆలోచనను చెబుతాడు నారదుడు.
నారదుని సలహా ప్రకారం చంద్రుడు శివుని వద్దకు వెళ్ళి పాదాలపై బడి శరణు, ఆశ్రయం కోరుతూ తనను రక్షిస్తానని మాట ఇచ్చేంత వరకు లేవనని అంటాడు.
అసలే శివుడు భోళా శంకరుడు కదా! చంద్రుని రక్షిస్తానని మాట ఇస్తాడు. ఎప్పుడైతే శివుడు రక్షిస్తానని మాట ఇచ్చాడో అప్పుడు తన శాపం గురించి చెబుతాడు. ఇచ్చిన మాట ప్రకారం ఏం చేయాలా అని శివుడు ఆలోచిస్తూ ఉంటాడు.
దక్షుడికి విషయం తెలిసి హుటాహుటిన శివుని వద్దకు వచ్చి నా పనుల్లో జోక్యం చేసుకోనని చెప్పి ఇప్పుడు ఇలా చేయడం భావ్యమా? అని నిలదీస్తాడు.
అప్పుడు ఆ శివుడు అతడు తప్పు చేశాడు నిజమే. నా ఆశ్రయం కోరి వచ్చిన వాడిని రక్షించకుండా ఎలా వదిలేస్తాను అనడంతో ఇరువురి మధ్య వాగ్వివాదం మొదలవుతుంది.
అప్పుడు శ్రీమహావిష్ణువు వారి మధ్యలో జోక్యం చేసుకుని చంద్రుడిని రెండు సమాన భాగాలుగా చేస్తాను ఇందులో ఒక సగం దక్ష ప్రజాపతి ఇచ్చిన శాపం ప్రకారం క్షీణించి పోతూ వుంటాడు.అలా చంద్రుడు నెమ్మదిగా క్షీణించి మళ్ళీ పుంజుకుంటాడు అని. మిగిలిన సగం చంద్రుడిని శివుడు తలపై తన జుట్టులో పెట్టుకొని శాశ్వతమైన ఆశ్రయాన్ని కల్పిస్తాడు.ఈ విధంగా చంద్రుడు శివుడిని శరణు కోరడం వల్ల రక్షింపబడతాడు.
ఆశ్రయం కోరే వ్యక్తి ఎలాంటి వాడైనా శరణు అనడిగితే సజ్జనులు క్షమించి రక్షణ కల్పిస్తారనేది ఈ నైవాశ్రితేషు గుణ దోష నివారణా స్యాత్ న్యాయము ద్వారా మనం తెలుసుకోగలిగాము.
ఇలాంటి కథే గయోపాఖ్యానం. ఇందులో గయుడు ఆకాశయానం చేస్తూ వేసిన ఉమ్మి శ్రీకృష్ణుడు సంధ్యావందనం చేస్తూ నీటిని పట్టుకున్న దోసిట్లో పడటంతో ఆగ్రహించిన కృష్ణుడు అతనిని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేయడం.శ్రీకృష్ణుడి ప్రతిజ్ఞ తెలిసి భయపడుతూ ఉన్న గయుడికి నారదుడు సలహా ఇవ్వడం.ఆ సలహా ప్రకారం గయుడు వెళ్లి అర్జునుడి శరణు కోరడం.అభయం ఇచ్చిన తర్వాత అసలు విషయం చెప్పడం. ఆ తర్వాత కృష్ణార్జునుల మధ్య ఘోర యుద్ధం మొదలవ్వడం. శివుడు వారిద్దరినీ శాంతింప జేయడం.శ్రీకృష్ణుడు గయుని క్షమించి వదిలివేయడం జరుగుతుంది.
కాబట్టి ఎటువంటి వారైనా ప్రాణ భయంతో రక్షించమని ఆశ్రయం కోరితే వారిని రక్షించాలని ఈ న్యాయము చెబుతోంది.
అయితే దుష్టుడినీ, దుర్మార్గుడిని రక్షిస్తే లోకానికి మంచిది కాదు కదా! కాబట్టి అలా ఎవరైనా వస్తే పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు తెలుసుకోకుండా మాట ఇవ్వకూడదు. అక్కడ జరిగింది లోక హితం కోసం నారదుడు చేసిన చక్కని ఆలోచన. మరి ఇప్పుడు అలాంటి వారిని పోనిలే అని వదిలేస్తే అనర్థాలే ఎక్కువగా జరుగుతాయి.కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఆచి తూచి అడుగు వేయడం మంచిది అనేది కూడా మనం గ్రహించాల్సి వుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి