పితృదేవులు పరమేశ్వర ప్రతిరూపమే:- కవిమిత్ర, సాహిత్యరత్న -ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్- (పుష్యమి)-విశాఖపట్నం.

అగ్రహారంలో ఆమంచివారి వీధిలో 
అమ్మలక్కతో ఆడుకుంటు ఉంటే
అమ్మ అన్నది నాన్నగారు వస్తారు జాగ్రత్త అంటే
అప్పుడు నేను అనుకున్నా నాన్న చండశాసనుడని
అరుణమ్మ, అరవింద్ పుట్టి  అల్లరిచేస్తుంటే
అర్ధమయింది నాన్నగా నేను మారినపుడు
నాన్న మా బాగుకే  కఠినంగా ఉన్నారన్నది.

బాల్యంలో శ్రీరాముని గుడికి వెళ్ళి
నాన్న భుజాలపై ఎక్కి గర్భగుడిలో రాముని చూపించినపుడు తెలియలేదు
నేనే శ్రీరాముని భుజాలపై ఉన్నానన్నది.

పండుగకి కుటుంబానికి కొత్తబట్టలు కొని
తాను చినిగిన బట్టలు వేసుకుంటే
నాన్న పిసినారి వాడని అనుకున్నా
మా సంతోషం కొరకై తన సుఖాన్ని త్యాగం చేసాడని
నేను నాన్నగా మారిన సమయాన తెలిసింది.

నాకు ఆరవై ఏళ్ల వయస్సులో
మనుమల నెత్తిన వేళ
అమ్మ అందని తీరాలకు వెళితే
ఎనభై ఏండ్లు దాటిన నాన్న 
వణుకుతున్న చేతులతో
బాధపడకురా చిన్నా నీకు నేనున్నా అన్న
పితృదేవులు పరమేశ్వర ప్రతిరూపమే
జన్మకు కారణమైన నాన్న సదా స్మరణీయులే

(పితృదినోత్సవ సందర్భంగా వ్రాసినది)
................................




 

కామెంట్‌లు